కేసీఆర్ సీటుపై అంతమందికి కన్నుందా..?

తెలంగాణ ముఖ్యమంత్రి పదవి. కేసీఆర్ మినహా ప్రస్తుతానికి ఈ కుర్చీపై ఇంకెవర్నీ ఊహించుకోలేం. కానీ ఈ సీటుపై కర్చీఫ్ వేసేందుకు చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. ఎన్నికల నగారా మోగడంతో సమర్థతతో సంబంధం లేకుండా అంతా ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థులైపోతున్నారు. ఒక్కొక్కరే ఎవరి మనసులో మాట వారు బైటపెడుతున్నారు. 

కేసీఆర్ ఉన్నంతకాలం టీఆర్ఎస్ లో ఎవరూ ఆ పదవి గురించి కామెంట్ చేసే సాహసం చేయరు. ఒకవేళ కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే మాత్రం కేటీఆర్ ని వారసుడిగా ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనికి ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతోందన్నది కాదనలేని నిజం. ఈ విషయంలో హరీష్ రావు నుంచి ఎలాంటి పోటీలేకుండా అంతర్గతంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నారు. 

ఇక ఈమధ్య కాలంలో అన్నీకలసి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి పదవి మాకెందుకు దక్కదు అంటూ ఒవైసీ సోదరుడు అక్బరుద్దీన్ మనసులో మాట బైటపెట్టారు. కర్నాటకలో మెజార్టీ లేకపోయినా జేడీఎస్ గద్దెనెక్కినట్టు.. తెలంగాణలో మైనార్టీలమైన మాకు అలాంటి బంపర్ ఆఫర్ దక్కుతుందేమో చూస్తామని సెలవిచ్చారాయన. గద్దర్ కూడా ఇలాంటి మాటలే అన్నారు. ఈ ఎన్నికల్లో పోటీచేస్తా.. అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా అవుతానంటూ ఓ కార్యక్రమంలో ప్రకటించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి పదవిపై మమకారం పెంచుకున్న మరో పెద్దాయన ఆర్.కృష్ణయ్య. బీసీ కార్డ్ తో గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన కృష్ణయ్య.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటించిన టీడీపీ తర్వాత అసలు పట్టించుకోలేదని వాపోయారు. గెలిచిన తర్వాత ఏనాడూ పసుపు కండువా కూడా కప్పుకోని ఈయన.. ఎన్నికలు దగ్గరపడే సరికి మరోసారి టీడీపీని కలవరిస్తున్నారు. పార్టీలోనే ఉన్నానని ఓవైపు చెబుతూనే మరోవైపు బీసీలకు ప్రత్యేకపార్టీ కావాలంటున్నారు. మొత్తానికి ఈయనకి కూడా సీఎం కుర్చీ అంటే మహా మోజు.
 
కాంగ్రెస్ లో మాత్రం పోటీచేసే ప్రతి ఒక్కరూ సీఎం అభ్యర్థే అనుకోవాలి. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ లో అందరూ సీనియర్లే, అయితే అన్నిటికీ అధిష్టానం ఒకటుంది కదా. అందుకే సీఎం అభ్యర్థి పేరు మాత్రం బైటపెట్టుకోరు. ఇకపోతే కాంగ్రెస్ ఇప్పుడు మహాకూటమిలో ఉంది కాబట్టి, సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు తక్కువే. తెలంగాణ జనసమితి.. కోదండరాంకి కూడా తన పరిధి ఏంటో తెలుసు. సో ఆ పార్టీని లెక్కలో వేసుకోలేం. 

ఇక మరో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కూడా స్నేహ పూర్వక శత్రుత్వంతో సరిపెడుతోంది. అయితే పైకి మాత్రం కేసీఆర్ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని, రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో బరిలో దిగుతామని బీజేపీ తరపున దత్తాత్రేయ ప్రకటించారు. అన్ని స్థానాల్లో పోటీ అంటే కచ్చితంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ఉండే ఉంటారు. అయితే ఆ పార్టీ లెక్కల ప్రకారం ఫలితాలొచ్చాకే పట్టాభిషేకాలు. 

మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి పదవిపై చాలామందికి కన్నుంది. సమయం వచ్చినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరూ తమ మనసులో మాట బైటపెడుతున్నారు. 

RELATED నోటా డబ్బింగ్ స్టార్ట్స్ నౌ?