టీనేజ్ లవ్... ఎలాంటి మనస్తత్వాలు ఇవి?

మిర్యాలగూడ, హైదరాబాద్ ఎర్రగడ్డలో జరిగిన ప్రేమికుల హత్యల నేపథ్యంలో అసలు ప్రేమంటే ఏమిటో, టీనేజీ ప్రేమలేంటో, తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మొదగా టీనేజీ పిల్లల మనస్తత్వమేమిటో చూద్దాం.

ఇదో తిరుగుబాటు దశ
13 నుంచి 18 ఏళ్ల వయసును టీనేజ్ లేదా అడాలసెన్స్ అంటారు. మనిషి జీవితంలో ఇది చాలా కీలకమైన దశ. అప్పటివరకు తల్లి లేదా తండ్రి చాటు బిడ్డల్లా ఉన్నవారు తమదైన స్వంత వ్యక్తిత్వాన్ని సంతరించుకునే దశ. ఇందులో భాగంగానే చాలామంది పిల్లలు తల్లిదండ్రులను ఎదిరిస్తుంటారు, వారి నిర్ణయాలను వ్యతిరేకిస్తుంటారు. ఇది పిల్లలు తమకూ ఒక వ్యక్తిత్వం ఉందంటూ, తమ జీవితాలకు సంబంధించిన నిర్ణయాలు తాము తీసుకోగలమనే విషయాన్ని ప్రకటించుకునే క్రమంలో భాగమే తప్ప తల్లిదండ్రులను వ్యతిరేకించడం ఎంత మాత్రమూ కాదు.

కానీ చాలామంది తల్లిదండ్రులకు ఈ విషయం తెలీక పిల్లలు ఒకమాట ఎదురు చెప్పగానే ఏదో నేరం, ఘోరం జరిగినట్లు వారిపై ఆంక్షలు విధిస్తుంటారు. ఇది వారిని మరింత రెచ్చిపోయేలా చేస్తుంది. ఎందుకంటే తిరుగుబాటు టీనేజ్ లక్షణం. మరోవైపు శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగా టీనేజ్ పిల్లల్లో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వీటన్నింటినీ అర్థం చేసుకోలేక, సర్దుబాటు చేసుకోవలేక వారు తీవ్రంగా సతమతమవుతుంటారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల ఆంక్షలు వారిని మరింత తిరగబడేలా చేస్తుంది.

టీనేజ్ లవ్
ప్రణయ్, అమృతలు తొమ్మిదో తరగతి నుంచే ప్రేమించుకుంటున్నారనే అంశంపై చాలామందిలో ఆందోళన, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దానిపై సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు సర్క్యలేట్ అవుతున్నాయి. ఆపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షణ కలగడం టీనేజ్ యొక్క సహజ లక్షణం. అలా కలగకపోతేనే అబ్ నార్మల్ అని చెప్పవచ్చు. అలాగని టీనేజ్ క్రష్ లన్నీ ప్రేమలుగా మారవనే విషయాన్ని అందరూ గుర్తించాలి. ప్రణయ్్, అమృతల విషయంలో అది ప్రేమగా మారింది. వారి ఇంజినీరింగ్ పూర్తయే్యవరకూ కొనసాగి పెళ్లిగా మారింది.

తొమ్మిదో తరగతిలో వారిమధ్య ఉన్నది ఆకర్షణ, కేవలం ఆకర్షణే కావచ్చు. కానీ అది ఏళ్ల తరబడి కొనసాగి, రకరకాల అడ్డంకులను అధిగమించి పెళ్లి చేసుకునే వరకూ కొనసాగిందంటే.. అది కచ్చితంగా ప్రేమే. ఈ నేపథ్యంలో ప్రేమంటే ఏమిటో తెలుసుకుందాం.

రాబర్ట్ స్టెర్నబర్గ్ అనే ప్రపంచ ప్రఖ్యాత సైకాలజిస్ట్ ప్రేమలో ప్రధానంగా మూడు మౌలికాంశాలు ఉంటాయన్నాడు. అవి passion, intimacy, commitment. ప్రణయ్, అమృతల విషయంలో ఈ మూడింటినీ మనం స్పష్టంగా చూడవచ్చు. ఒకరంటే ఒకరికి తీవ్రమైన ఇష్టం, ఇద్దరిమధ్య సాన్నిహిత్యం, నిబద్ధత ఉన్నాయి కనుకనే ఏడేళ్లలో వారి ఆకర్షణ ప్రేమగా మారి పెళ్లితో ముడిపడింది. కాబట్టి వారి ప్రేమను తప్పు పట్టాల్సిన, తప్పులు వెతకాల్సిన అవసరం లేదు.

పరువు.. ప్రతిష్ట
ప్రణయ్ హత్య, సందీప్ పై దాడిని పరువుకోసం చేసిన వాటిగా చూపడంలోనే మర్మమంతా దాగి ఉంది. ఆ తండ్రులు అవి పరువుకోసం చేసిన దాడులైనా, తన కుమార్తె తక్కువ కులంవాడిని చేసుకోవడంవల్ల సమాజంలో తమ పరువు పోయిందనే భావనే అందుకు కారణం. అంటే అవి కులం నేపథ్యంలో జరిగినవిగానే పరిగణించాలి. ఎవరేమనుకున్నా, ఎవరు కాదన్నా మన దేశంలో కులం ఒక సామాజిక వాస్తవం. దాని ఆధారంగానే పెళ్లిళ్లు జరుగుతాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే మారిన, మారుతున్న కాలంతో పాటు కులం పట్ల భావన కూడా మారుతోంది.

కొందరు యువత కులాన్ని కాదని ముందడుగు వేస్తున్నారు. అది తమను వ్యతిరేకించడంగా, తమను కించపరచడంగా, తమ ఆధిపత్యాన్ని ధిక్కరించడంగా ఆ ఇద్దరు తండ్రులూ చూడటం వల్లనే ఈ దాడులు జరిగాయని చెప్పవచ్చు. ఇందులో ప్రధానపాత్ర కులానిదే. ఆ తర్వాత ఆర్థిక అంతరాలది. అయితే మన సమాజంలోనే సెలబ్రిటీలుగా ఆరాధించబడేవారిలో అనేకానేక అఫైర్ల తర్వాత తమకు నచ్చినవారిని పెళ్లి చేసుకోవడం, అందులోనూ కొందరు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవడం, దాన్ని అందరూ హర్షించడం మనం గమనింవచ్చు.

ఇక్కడ పరువు పోయినట్లు వాళ్లేం ఫీలవ్వడంలేదు. సంతోషంగా ఉన్నారు, ఆనందంగా జీవిస్తున్నారు. అంటే పరువు, ప్రతిష్టలనేవి మనం మనసులో సృష్టించుకున్న అంశాలేనని... అవి కులం, సామాజిక, ఆర్థిక స్థాయిలను బట్టి మారుతుంటాయని, వాటికి మరీ అంతగా ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం లేదనీ పాతతరం గుర్తిస్తే మంచిది. అన్నింటికీ మించి పిల్లలు తమ ఆస్తులు కాదని, వారికంటూ స్వంత ఇష్టాయిష్టాలూ, అభిప్రాయాలూ ఉంటాయనీ, వాటిని గౌరవించడం తల్లిదండ్రుల కర్తవ్యమనీ గుర్తించాలి.

పిల్లల అభిప్రాయాలతో విభేదాలుంటే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప దాడులు, హత్యల వరకూ వెళితే అందరి జీవితాలూ నాశనమవుతాయని పెద్దలు గుర్తించాలి. జీవితాలను నాశనంచేసే పరువు పరువే కాదని అంగీకరించాలి. పరువు పోతే సంపాదించుకోవచ్చు, ప్రాణాలు పోతే తీసుకురాలేమన్నది సత్యం. దాడులు చేయడం, ప్రాణాలు తీయడం చట్టరీత్యా నేరం. అలాంటి చర్యలకు శిక్ష తప్పదని, శిక్ష నుంచి తప్పించుకోలేమనీ గుర్తించాలి.

ప్రేమికులకు సూచన..
చివరగా ప్రేమించుకునే, ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే యువతీయువకులకు... మీ ప్రేమలో లేదా మీరు ప్రేమిస్తున్నవారిలో లేదా మిమ్మల్ని ప్రేమిస్తున్నవారిలో నిజాయితీ, నిబద్ధత ఉందో లేదో చూసుకోండి. వీలైనంతవరకూ మీ పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నించండి. సాధ్యంకానప్పుడు మీ నిర్ణయం మీరు తీసుకోండి. మీ చర్యతో తమ పరువు ప్రతిష్టలు పోయాయని బాధ/ ఆవేశపడే తల్లిదండ్రులను మరింత బాధపెట్టే, లేదా మరింత రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా మీ జీవితం మీరు గడపండి. అన్నింటికంటే మీ ప్రేమ, మీ జీవితం ముఖ్యమనే విషయాన్ని గుర్తించి వాటికి ఎలాంటి ఆపద రాకుండా జాగ్రత్తలు తీసుకోండి.

-విశేష్, సైకాలజిస్ట్
హైదరాబాద్
Cell:- 8019 00006

Show comments