గేమ్ మొదలైంది

రాష్ట్రపతి ఎన్నికల పేరుతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొత్త గేమ్ మొదలు పెట్టారు. 2019 ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నాహాలు మొదలు పెట్టారు. నిజానికి 2018 చివర్లోనే దేశ వ్యాప్తంగా అసెంబ్లీ, లోక్ సభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించాలని మోడీ అనుకున్నప్పటికీ యుపిలో అఖండ మెజారిటీ రావడంతో ఆయన ఈ ఆలోచన మానుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో రెండేళ్లలోనే ఎన్నికలు నిర్వహించడం తమకే నష్టమని ఆయనకు బాగా తెలుసు. 2024 వరకు ఒకే సారి ఎన్నికలు జరిపేందుకు ఇప్పటినుంచే అందర్నీ మానసికంగా సన్నద్దం చేయాలని ప్రధానమంత్రి, అమిత్ షా బావిస్తున్నట్లు తెలిసింది.

2019 ఎన్నికలకు ప్రధానమంత్రి ఇప్పటికే గేమ్ మొదలు పెట్టారు. దేశ వ్యాప్తంగా ఆయన కాంగ్రెస్ పార్టీని, ఇతర ప్రతిపక్ష పార్టీలను కొన్ని ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టేందుకు వ్యూహరచన మొదలుపెట్టారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, అస్సాం, ఛత్తీస్ ఘడ్, హర్యానా, కర్ణాటక, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బిజెపి నేరుగా కాంగ్రెస్ తో పోటీ పడనుంది. ఇక పశ్చిమబెంగాల్, కేరళ, ఢిల్లీ, బీహార్, జార్ఖండ్, ఒడిషా, తెలంగాణ ల్లో బిజెపి ప్రాంతీయ, వామపక్ష పార్టీలను ఎదుర్కోవాల్సి ఉన్నది. ఇక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ ల్లో ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం, శివసేన , అకాలీదళ్ మిత్రపక్షాలుగా ఉన్నాయి. అంటే దాదాపు 150 సీట్లలో బిజెపి కాంగ్రెస్ ముఖాముఖి పోటీపడుతుంది. మిగతా సీట్లలో కొన్నిటిలో  ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ పై బిజెపి కత్తి దూస్తుండగా, ఢిల్లీ, ఒడిషా, పశ్చిమబెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో బిజెపి నేరుగా పోటీపడే స్థితికి చేరుకుంది.

మామూలుగా అయితే బిజెపి 2014లో అవలంబించిన ఫార్ములానే అనుసరించేది. అప్పుడు బిజెపి అంత బలంగా లేదు కనుక తాను బలంగా లేని చోట్ల ప్రాంతీయ పార్టీలపై ఆధారపడింది. కాని ఇప్పుడు బిజెపి పరిస్థితి పేరు. 2024లో అనుసరించిన ఫార్ములానే ఎందుకు అనుసరించాలి? ఒకప్పటి కాంగ్రెస్ లాగా దేశమంతా బిజెపి బలంగా ఎందుకు అవతరించకూడదు?  గతంలో బిజెపి కేవలం ఉత్తరాది పార్టీ. కాని ఇవాళ బిజెపి దేశమంతటా ప్రజలకు తెలుసు. ముఖ్యంగా నరేంద్రమోడీ అంటే తెలియని వారుండరు. దేశమంతటా బిజెపి ఓట్ బ్యాంకు ఏర్పడుతోంది. అందుకే బిజెపి తాను బలంగా లేని చోట్ల విస్తరించాలనుకుంటోంది.

ఉత్తర ప్రదేశ్ లో అనూహ్యమైన విధంగా 330 అసెంబ్లీ  సీట్లు గెలుచుకున్న బిజెపి ఇప్పుడు ఒడిషా లో బలంగా మారింది. ఈశాన్య రాష్ట్రాల్లో బలంగా మారింది. కాశ్మీర్ లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. 2014 ఎన్నికల్లో బిజెపి అత్యధికంగా సీట్లు సంపాదించిన రాష్ట్రాల్లో యుపి, గుజరాత్, ఉత్తరాఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, ఉన్నాయి. ఈ పన్నెండు రాష్ట్రాల్లోనే బిజెపి 250పైగా సీట్లు సాధించింది. దేశంలోని మిగతా 24 రాష్ట్రాల్లో బిజెపి పాతిక సీట్లు కూడా సంపాదించలేదు. ఈసారి ఈ రాష్ట్రాల్లో పాగా వేయాలన్నదే బిజెపి తాపత్రయం.

ఉదాహరణకు ఓడిషాలో ఆ పార్టీకి కేవలం ఒక సీటే వచ్చింది. తమిళనాడులో బిజెపికి ఒక సీటే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే బిజెపికి రెండే సీట్లు వచ్చాయి. తెలంగాణలో ఒక సీటే వచ్చింది. అంటే మొత్తం 102 సీట్లలో బిజెపికి వచ్చింది కేవలం 5 సీట్లే అన్నమాట. ఈ సారి ఈ పరిస్థితి మార్చాలని, కనీసం 50 నుంచి 60 సీట్లైనా అమిత్ షా, మోడీ నిర్ణయించుకున్నారు.   అలా చేయాలంటే ఏమిచేయాలో కూడా వారు వ్యూహరచన కూడా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉన్నది. ప్రజలు కాంగ్రెస్ కు అనుకూలంగా లేరు. ఆ స్థానంలో బిజెపి బలోపేతం చేయడానికి తగిన కార్యాచరణ రూపొందించాలని వారు నిర్ణయించారు. తెలంగాణలో టిఆర్ఎస్ కు వ్యతిరేక ప్రభంజనం వీస్తే 17 సీట్లలో కనీసం పది సీట్లైనా సాదించవచ్చునని బిజెపి తన అంతర్గత నివేదికలో పేర్కొంది. అదే విధంగా సీమాంధ్రలోని 25 సీట్లలో 10 నుంచి 15 సీట్లకు టార్గెట్ పెట్టాలని అవసరమైతే తెలుగుదేశంను కూడా వదులుకుని వైసీపీ తో చేతులు కలిపే విషయం పరిశీలించాలని బిజెపి యోచిస్తోంది.

తెలుగుదేశం జనాదరణ రోజురోజుకూ తగ్గిపోతోందని, ఆ పార్టీతో చేతులు కలిపితే లాభం లేదని బిజెపి నిర్ణయించింది. అందుకే ఇటీవల వైసీపీ నేత జగన్ తో నరేంద్రమోడీ మంతనాలు సాగించారు. ఒడిషాలోని 21 సీట్లలో 15 సీట్లు సాధించేందుకు అనుకూల వాతావరణం ఉన్నదని ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో బిజెపి అఖండ విజయం తర్వాత నిరూపితమైంది. తమిళనాడులో అన్నాడిఎంకె చాలా బలహీనంగా మారింది. రెండు వర్గాలు కొట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్నాడిఎంకెపై పట్టు బిగించి డిఎంకెకు వ్యతిరేకంగా పోటీ చేయాలని, మొత్తం 39 సీట్లలో పది సీట్లైనా టార్గెట్ పెట్టుకోవాలని బిజెపి భావిస్తోంది. జయలలిత మరణంతో మరో ప్రముఖ సినీనటుడైన రజనీకాంత్ లో రాజకీయ ఆశలు చిగురించడం ఈ సందర్భంగా గమనార్హం. గతంలో పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు జయలలితకు పోటీగా రజనీకాంత్ ను దించాలని ప్రయత్నించినప్పటికీ ధైర్యం చేయలేకపోయారు. ఈ సారి మోడీ రజనీ మధ్య బాంధవ్యం పెరిగే అవకాశాలు లేకపోలేదు.

నిజానికి అమిత్ షా, మోడీలు తమ గేమ్ ఎప్పుడో మొదలుపెట్టారు. పార్టీలో వారిద్దరి పట్టు పెరిగింది. ప్రభుత్వం పై కూడా ప్రదానమంత్రి కార్యాలయం పట్టు బిగించింది. పార్టీలో అమిత్ షా పూర్తిగా తన అంతరంగికులపై ఆధారపడ్డారు. గుజరాత్ కు చెందిన ఒక విశ్వసనీయ బృందం ముందుగానే అన్ని రాష్ట్రాల్లో తిరిగి నివేదికలు తయారు చేస్తోంది.  తాను జరిపించిన సర్వేల ప్రకారమే ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బిజెపిలో మోడీకి దరిదాపుల్లో మరో నాయకుడు సమీపించకుండా షా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ స్థానిక నాయకత్వం కంటే మోడీ నాయకత్వం గురించి అధికంగా ప్రచారం చేసేందుకు ఎన్నికల వ్యూహాన్ని రూపొందించారు. 2019కి ఎజెండా ఇప్పటికే నిర్ణీతమైంది. యుపి ఎన్నికల్లో అనుసరించిన ఫార్ములానే ప్రతి రాష్ట్రంలోను అనుసరించాలని నిర్ణయించారు. మోడీని ఢీకొనగల నాయకుడెవరూ జాతీయ స్థాయిలోనే కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా లేకపోవడంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది.

Show comments