త్రిబుల్‌ ఎక్స్‌ సినిమాలు చూడాల్సొస్తుందేమో.?

కొండ నాలికకి మందేస్తే.. వున్న నాలిక ఊడిపోయిందట.! సెన్సార్‌ బోర్డ్‌ పరిస్థితి అచ్చం ఇలానే తయారయ్యింది. సినిమాకి సెన్సార్‌ అవసరమే. ఏ వయసువారు ఏ సినిమా చూడాలి.? అన్నది సెన్సార్‌ బోర్డ్‌ నిర్ణయిస్తుంది. అఫ్‌కోర్స్‌, థియేటర్లలో కాకపోతేనేం ఎంచక్కా ఇంట్లో చూసేయడానికి ఛాన్స్‌ దొరుకుతోంది. ఆ సినిమాలూ ఈ సినిమాలు ఏం ఖర్మ.? అచ్చంగా 'త్రిబుల్‌ ఎక్స్‌' సినిమాలు.. అదేనండీ పోర్న్‌ సినిమాలు నెట్టింట్లో.. సారీ సారీ నట్టింట్లోకి వచ్చేస్తున్నాయి. 

చాలా చిత్రమైన సందర్భమిది. సినిమాల్లో హీరోయిన్‌ ఎక్స్‌పోజింగ్‌ చేస్తే 'ఛండాలం..' అనే రోజులు కావివి. 'నేను మహిళను.. సహజంగా నాకు కొన్ని అందాలు వచ్చాయి. వాటిని నేను బహిర్గతం చేస్తే తప్పేంటట.?' అంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు నేటి తరం హీరోయిన్లు. ఇకనేం, డిస్కషన్‌ ఓవర్‌. ఎక్స్‌పోజింగ్‌ గురించీ, వల్గారిటీ గురించి మాట్లాడటమే పచ్చి బూతు ఇప్పుడు. సో, దాని గురించి డిస్కషన్‌ అనవసరం. 

హింస విషయానికొద్దాం. ఓ సినిమాలో ఓ హీరో కత్తితో విలన్‌ తలని తెగ నరుకుతాడు. అది భయానకం. అందుకే, దానికి సెన్సార్‌ అంగీకరించదు. 'ఎ' సర్టిఫికెట్‌ ఇచ్చేస్తుంది. వెండితెరపై పరిస్థితి ఇలా వుంటే, బుల్లితెర మాటేమిటి.? పొద్దున్న లేస్తే టీవీల్లో హాట్‌ రేటింగ్స్‌ క్రైమ్‌ స్టోరీస్‌కే వుంటాయి. 'సామాజిక బాధ్యత' అనే పేరు చెప్పుకుని పబ్లిసిటీ చేసుకునే ఛానళ్ళూ టీఆర్‌పీ రేటింగుల కోసం క్రైమ్‌ స్టోరీస్‌ని పెంచి పోషించక తప్పదు. 

ఎక్స్‌పోజింగ్‌ కావొచ్చు.. హింస కావొచ్చు.. ఇంకోటి కావొచ్చు. సినిమాలో ఏమున్నా సెన్సార్‌ చెయ్యాల్సిన అవసరమే లేదిప్పుడు. అఫ్‌కోర్స్‌, సెన్సార్‌ కూడా ఈ మధ్య ఇలాంటివాటి విషయంలో అంత సీరియస్‌గా వ్యవహరించడంలేదనుకోండి.. అది వేరే విషయం. ఫలానా మాటని 'బీప్‌' చేయాలని సెన్సార్‌ బోర్డ్‌ సూచిస్తే, ఆ సమయంలో వచ్చే ఆ బీప్‌ సౌండ్‌ ఇంకా దారుణమైన ఇంపాక్ట్‌ చూపిస్తోంది. గ్యాప్‌ ఫిల్లింగ్‌లో ఎవడికి తోచిన బూతు వాడు అనేసుకోవచ్చు. ఇలా తయారయ్యింది సెన్సార్‌ వ్యవహారం. 

రాను రాను సెన్సార్‌ బోర్డ్‌ పరిస్థితి మరీ దయనీయంగా తయారైపోయింది. 'ఎ' సర్టిఫికెట్‌ లేదా 'యు/ఎ' సర్టిఫికెట్‌ లేదా 'యు' సర్టిఫికెట్‌ ఇచ్చి, చేతులు దులుపుకోవడం తప్ప ఇక ముందు సెన్సార్‌ బోర్డ్‌ చెయ్యడానికేమీ వుండదు. 'యు/ఎ' సర్టిఫికెట్టే వచ్చిందనుకోండి, రేప్పొద్దున్న ఓ నిర్మాతో కోర్టుకు వెళ్ళి క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ తెచ్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి పరిస్థితులు వస్తాయో రావో, ముందుగా సెన్సార్‌ బోర్డ్‌లో పనిచేసేవాళ్ళే భయపడే పరిస్థితి వచ్చేసింది. 

క్రియేటివిటీకి హద్దులు కాకపోయినా, విజ్ఞత వుండాలి. ఆ విజ్ఞతని కోల్పోతేనే ఈ సమస్య పుట్టుకొస్తోంది. హీరోయిన్‌ని టూ పీస్‌ బికినీలో చూపించడమే కళాత్మకమా.? అలాగైతే, నగ్నంగా చూపించడం ఇంకా కళాత్మకమవుతుంది కదా.! శృంగారమే కళాత్మకమా.? అయితే, త్రిబుల్‌ ఎక్స్‌ సినిమాల్లో కూడా ఆ కళాత్మకత చూపించుకోవచ్చు కదా.! ఇలాంటి వాదనలే తెరపైకొస్తుంటాయి. సినిమా అనేది కళ. పైగా అది కమర్షియల్‌ కళ. కళ అంటే జనాన్ని జాగృతం చేసేది. కమర్షియల్‌ కళ కదా, కాసుల్నే వెతుక్కుంటుంది. కాసులు వెతుక్కోవడం తప్పు లేదు, కానీ సమాజ వినాశనం కోరుకోకూడదు కదా.? 

'ఉడతా పంజాబ్‌' సినిమా విషయంలో అత్యుత్సాహం చూపి, సెన్సార్‌ బోర్డ్‌ విశ్వసనీయత కోల్పోయింది. ఒక వ్యక్తి చేసిన పొరపాటు, మొత్తం వ్యవస్థని సర్వనాశనం చేసేసింది. ఇక నుంచి సెన్సార్‌ బోర్డ్‌ అన్న పేరు ఎక్కడాన్ని విన్పిస్తే, 'ఏడిశార్లే..' అని సినీ జనం లైట్‌ తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. పరిస్థితి ఎలా తయారైందంటే, అచ్చంగా పోర్న్‌ సినిమా తీసేసి, 'ఇది కళాత్మక చిత్రం.. కావాలంటే ఎ-సర్టిఫికెట్‌ ఇచ్చుకోండి.. కుదరకపోతే ఎక్స్‌-రేటింగ్‌ ఇవ్వండి, డబుల్‌ ఎక్స్‌, త్రిబుల్‌ ఎక్స్‌ అయినా ఫర్లేదు..' అని సెన్సార్‌ బోర్డ్‌ని మూవీ మేకర్స్‌ డిమాండ్‌ చేసే రోజులు ముందు ముందు వచ్చేస్తాయేమో.! 

కొసమెరుపు: బాలీవుడ్‌లో లెస్బియన్‌ సినిమాలొచ్చాయి.. గే సినిమాలొచ్చాయి.. అయినా వేటి విషయంలోనూ ఇంత రాద్ధాంతం జరగలేదు. వాటన్నిటికీ సెన్సార్‌ నుంచి క్లియరెన్స్‌ వచ్చింది. ఇదిగో, 'ఉడతా పంజాబ్‌' విషయంలోనే పాపం పండిపోయింది. దురదృష్టవశాత్తూ ప్రేక్షకుల పాపం పండిపోయిందంతే.!

Show comments