అధికారం పోయినా నోటి దురుసు తగ్గలేదు

టీడీపీ ఓటమికి కారణాలు తెలియట్లేదు, తెలియట్లేదు అంటున్న చంద్రబాబుకి.. నిన్న జరిగిన రచ్చతో అసలు టీడీపీ నేతలపై ప్రజలతో పాటు, ప్రభుత్వ అధికారుల్లో ఎంత వ్యతిరేకత ఉందో తెలిసొస్తోంది. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి జరిగినప్పుడే టీడీపీపై ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందిలో వ్యతిరేకత ఏర్పడింది. ఐదేళ్ల పాలన పూర్తయ్యే సరికి అది మరింత బలపడి ఆయా వర్గాలు టీడీపీకి పూర్తి వ్యతిరేకంగా మారాయి. ప్రభుత్వ అధికారులంటే టీడీపీ నేతలకు ఎంత చులకననే విషయం నిన్న పల్నాడు గొడవలో మరోసారి బైటపడింది.

పోలీసుల్ని యూజ్ లెస్ ఫెలోస్ అంటూ అచ్చెన్నాయుడు నోరు పారేసుకుంటే.. నన్నపనేని రాజకుమారి మహిళా పోలీస్ అధికారులతో వ్యవహరించిన తీరు మరింత చర్చనీయాంశమైంది. ఈ రెండు సంఘటనలను పోలీసు సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజా ప్రతినిధులకు రక్షణగా ఉండే పోలీస్ అధికారుల్ని, వారి విధి నిర్వహణను తప్పుబట్టడం టీడీపీకి ఫ్యాషన్ గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే అనుమానాలు బలపడటంతో పోలీసులు టీడీపీ నేతల్ని బలవంతంగా అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. ఆ క్రమంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసుల్ని అచ్చెన్నాయుడు యూజ్ లెస్ ఫెలోస్ అంటూ తూలనాడారు. పోలీసులకు సహకరించాల్సింది పోయి, మీడియా కవరేజ్ కోసం ఓవర్ యాక్షన్ చేశారు. పోలీసుల్ని అనరాని మాటలన్నారు. దీంతో పోలీసు అధికారులకు మండింది. ఏకంగా ఆయా సంఘాల నేతలు బైటకొచ్చి మరీ మాట్లాడాల్సిన పరిస్థితి.

ఇక నన్నపనేని రాజకుమారి నలుగురు మహిళల్ని వెంటబెట్టుకుని నానాహంగామా చేశారు. రాజకుమారి బ్యాచ్ లోని ఒకరు, ఓ మహిళా పోలీస్ అధికారిని దరిద్రపుదానా అనడంతో ఆమె బాగా హర్ట్ అయ్యారు. కష్టపడి చదువుకుని పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు తెచ్చుకున్నాం, మీలా కాదు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా పనిచేసిన రాజకుమారి కూడా మహిళలతో ప్రవర్తించే తీరు బాగోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వేలు చూపించి మాట్లాడుతున్నారని, తమను కించ పరిచే విధంగా ప్రవర్తించారని నొచ్చుకున్నారు.

మొత్తమ్మీద టీడీపీ నేతలు ప్రభుత్వ అధికారులతో, సామాన్య ప్రజలతో ఎలా ప్రవర్తిస్తారనే విషయం మరోసారి మీడియా సాక్షిగా బైటపడింది. అధికారంలో లేనప్పుడే ఇంత ఓవర్ యాక్షన్ అంటే, అధికారం వెలగబెట్టినప్పుడు వీరంతా ఏ స్థాయిలో జులుం ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి టీమ్ నిర్వాకం వల్లే ప్రజల్లో, ప్రభుత్వ సిబ్బందిలో టీడీపీ పలుచన అయింది, ఎన్నికల్లో పరువు పోగొట్టుకుంది. 

జగన్... గారాబం చేయడం నేర్చుకోవాలి!