కోడెల చరమాంకం.. టీడీపీ నేతలకు పాఠం

వాడుకుని వదిలేయడం... ఇది చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. అవసరం ఉన్నంత మేరకే ఎవరితో అయినా అత్యంత సన్నిహితంగా ఉంటారు చంద్రబాబు, అవసరం తీరిందా, ఇక కన్నెత్తి చూడరు, పల్లెత్తు మాటకూడా మాట్లాడరు సరికదా.. ఎవరో తెలియనట్టు, తనకేం సంబంధం లేనట్టు వ్యవహరిస్తుంటారు. కోడెల వ్యవహారంలో కూడా ఇదే జరిగింది. సీనియర్ అనే గౌరవం కూడా లేకుండా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే విషయంలో ఆయన్ను తీవ్రంగా అవమానపరిచారు బాబు.

తీరా ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఫర్నిచర్ దొంగతనం విషయం బైటపడే సరికి పూర్తిగా తనకేం సంబంధం లేనట్టు వ్యవహరించారు. మద్దతు తెలపాల్సిన అవసరం లేదు, కనీసం పార్టీ అధినేతగా తానున్నానన్న భరోసా కూడా కోడెలకు కల్పించలేదు. పైగా ఒకరిద్దరు పార్టీ నేతలతో కోడెలకు వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా తానే మాట్లాడించారు. కోడెల కొడుకే ఆయన్ను ఇబ్బంది పెడుతున్నాడన్న వార్తలు బాబు చెవిన కూడా పడ్డాయి, అయినా జోక్యం చేసుకోలేదు.

ఒక పార్టీ అధినేతగా కోడెల శివప్రసాద్ కు చంద్రబాబు నైతిక మద్దతు ఇచ్చి ఉంటే, ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు చాలామంది. మాజీ స్పీకర్ అకాల మరణానికి ఒకరకంగా చంద్రబాబు కూడా కారణం అని విమర్శిస్తున్నారు. వర్ల రామయ్య, సోమిరెడ్డి వంటివాళ్లు ఇప్పుడు ఎగిరెగిరి పడొచ్చు. చంద్రబాబు ఉసిగొల్పితే ఎవరి మీదైనా, ఎంత మాటైనా తూలొచ్చు. కానీ కాలం ఎప్పుడూ ఇలానే ఉండదని గుర్తుంచుకోవాలి. అవసరం ఉన్నప్పుడు అడ్డగోలుగా వాడుకునే చంద్రబాబు కష్టకాలంలో ఆదుకోడనే విషయం ఇలాంటి నేతలు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది.

కోడెల చరమాంకం టీడీపీ నేతలందరికీ ఓ గుణపాఠంలా మారాలి. పార్టీ కోసం, కార్యకర్తల కోసం కష్టపడితే పర్వాలేదు, కానీ అధినేత మెప్పుకోసం చేయరాని తప్పులు చేస్తే చివరకు ఎవరూ పట్టించుకోరనే విషయం గుర్తుంచుకోవాలి. తీవ్ర మనోవేదనలో కూడా కోడెలకు చంద్రబాబు కాసింత మాటసాయం చేయలేదంటే ఆయన మనస్తత్వం ఎలాంటిదో టీడీపీ నేతలు గ్రహించాలి. ఆత్మాభిమానం చంపుకుని, భవిష్యత్ కి భరోసా లేకుండా అలాంటి నాయకుడి కింద పనిచేయడం ఎంతవరకు సరైనదో వారే నిర్ణయించుకోవాలి.

గ్రేట్ ఆంధ్ర ఈవారం స్పెషల్ బిగ్ స్టోరీ

Show comments