ఈ దశలో.. టీడీపీ, జనసేనలు కలుస్తాయా?

గత కొన్నాళ్లుగా చాలా సైలెంట్ అయ్యారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్.అంతకు ముందు నాలుగు గోడల మధ్య మాట్లాడినా, నాలుగు కూడళ్ల మధ్యకు వచ్చినా పవన్ కల్యాణ్.. చాలా మాటలు మాట్లాడేవారు. తన గురించి.. తన మేధస్సు గురించి ఏదో చెప్పుకోవడమో లేకపోతే ప్రత్యేకించి జగన్ ను రెచ్చగొట్టే ప్రకటనలు చేయడమో పవన్ కల్యాణ్ కు రొటీన్ గా ఉండేది. చంద్రబాబు కన్నా జగన్ నే ఎక్కువగా ప్రశ్నించేశారు పవన్ కల్యాణ్. ఆఖరికి ముఖ్యమంత్రిగా ఉన్నది  చంద్రబాబా.. జగనా.. అనే అనుమానాలు కలిగేవి పవన్ కల్యాణ్ ప్రసంగాలు వింటే!

అధికారపక్షంపై పోరాడటం మానేసి.. ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్న పవన్ కల్యాణ్ తీరు విమర్శలపాలైంది కూడా. అయితే అదంతా నెలరోజుల కిందటి  ముచ్చట. ఆ తర్వాత మాత్రం పవన్  కల్యాణ్ తీరులో చాలా మార్పు వచ్చింది. ఎంతమార్పు అంటే.. అసలు పవన్ కల్యాణ్ రాజకీయంలో ఉన్నారా.. లేదా.. అని అనుమానాలు కలిగేంత స్థాయిలో!

గతనెల నుంచి కూడా పీకే ఏవో సమీక్షలు, కార్యకర్తలతో సమావేశాలు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలు సాగిస్తూ ఉన్నారు. అయితే.. ఎక్కడా పవన్ కల్యాణ్ గొంతు వినిపించడం లేదు. పవన్ అస్సలు ఏ టాపిక్ గురించి మాట్లాడటం లేదు. గత నెలరోజుల్లో రాజకీయంగా ఎన్నో కీలక పరిణామాలు  సంభవించాయి. చంద్రబాబు నాయుడు వెళ్లి ఢిల్లీలో దీక్షచేసి వచ్చారు. దానికి పది కోట్ల రూపాయల ఖర్చు కూడా పెట్టుకున్నారు. రాజకీయంగా కొందరు ప్రముఖులు తెలుగుదేశం పార్టీని వీడుతున్నారు కూడా.

ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి. ఈ సమయంలో నేతలు మాట్లాడాల్సింది. అయితే ఈ సమయంలో మాత్రం పవన్ కల్యాణ్ కామ్ అయిపోయారు. ఇదే సమయంలో మళ్లీ టీడీపీ – జనసేన పొత్తు అనే అంశం తెరమీదకు వస్తూ ఉండటం గమనార్హం. ఒకవైపు పార్టీ నుంచి అనేకమంది నేతలు వీడుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు బేలగా మారిపోతూ ఉన్నారు. చాలా సంక్షేమ పథకాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా... పార్టీ నేతల్లో మాత్రం ఆ పథకాలు నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాయి.

అందుకే వారు తెలుగుదేశం పార్టీకి తలాక్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మళ్లీ పవన్ కల్యాణ్ మీదే ఆధారపడే అవకాశాలు దండిగానే కనిపిస్తున్నాయి. చేతులు ఎత్తేస్తున్న దశలో ఎవరిని బుజ్జగించడానికి అయినా బాబు వెనుకాడకపోవచ్చు. గత ఎన్నికల సమయంలోనూ ఇదే జరిగింది. చివరి ఘడియలో బీజేపీ, పవన్ కల్యాణ్ లను కలుపుకుని పోకపోతే బాబు కథ అప్పుడే ముగిసేది. ఇప్పుడు కూడా బాబు మళ్లీ జనసేనను ప్రాధేయపడటం అయినా ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

మళ్లీ పవన్ కల్యాణ్ తో సమావేశానికి బాబు ఆయన ఇంటికి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు. బాబుకు ఏదైనా సాధ్యమే. అవతల పపవన్ కల్యాణ్ పార్టీ పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేని నేపథ్యంలో.. మళ్లీ పదో పరక సీట్లతో పొత్తుకు ఆయన ఒప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదనీ పరిశీలకులు అంటున్నారు. అయితే ఈ దశలో వీళ్లిద్దరూ చేతులు కలిపితే.. జనాలు క్షమిస్తారా? అనేదే అసలైన ప్రశ్న! 

ముఖ్యమంత్రి పదవి విలువనే దిగజార్చలేదా?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?

Show comments