ఫిరాయింపులపై.. వేదాలు వల్లిస్తున్న దెయ్యాలు!

ఒక పార్టీ తరఫున గెలిచిన వారిని మరో పార్టీలో చేర్చుకోవడంలో.. తెలుగుదేశం పార్టీ వ్యవహరించినంత అనైతికంగా బహుశా దేశంలో మరే ఇతర పార్టీ కూడా ఇప్పటిదాకా వ్యవహరించలేదు.

అలాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు.. ఇంకా ఫిరాయింపు అన్నది ఏమీ జరగకముందే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి.. జగన్ గురించి విమర్శలు గుప్పిస్తున్నారు. వీరి సిగ్గుమాలిన మాటలను గమనిస్తోంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు.

నేటి రాజకీయాలు అనేవి కప్పల తక్కెడ లాంటివేనని, ఒక పార్టీలోంచి మరో పార్టీలోకి అతి తరచుగా ఫిరాయిస్తుండే వారు చాలామందే ఉంటారని మనకు తెలుసు.

కానీ.. చట్టసభల్ల ప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎంపీలు అనైతికంగా పార్టీ ఫిరాయిస్తే.. ఆ రకంగా అక్రమాలకు పాల్పడితే వారి మీద అనర్హత వేటు వేయడానికి చట్టం ఉంది. కానీ ఆచరణలో వ్యవస్థలు మాత్రం ఆ చట్టాన్ని కూడా తుంగలో తొక్కేసి చెలరేగుతున్నాయి.

బొటాబొటీ మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వం అస్థిరత భయంలో ఉన్నప్పుడు.. ఇతర పార్టీలనుంచి ప్రలోభపెట్టి ఒకరిద్దరు ఎమ్మెల్యేలను ఫిరాయించడం చాలాచోట్ల జరుగుతుంది.

కానీ తెలుగుదేశం పార్టీ దృఢమైన మెజారిటీతో పాలనసాగిస్తుండగానే... వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఏకంగా 23 మందిని ఫిరాయింపజేసింది. అత్యంత హేయమైన రీతిలో వారికి మంత్రిపదవులను కూడా కట్టబెట్టింది. వారిపై అనర్హత వేటు స్పీకరు విచక్షణపై ఆధారపడి ఉంటుందనే మిషపై... వైకాపా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా చెలరేగింది.

జగన్ సీఎం అయ్యాక.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే తప్ప ఎవ్వరినీ వైకాపాలో చేర్చుకునేది లేదని తేల్చి చెప్పారు. వల్లభనేని వంశీ ని తెదేపా సస్పెండ్ చేసిన తర్వాత ఆయనను స్వతంత్ర సభ్యుడిగా గుర్తిస్తామని స్పీకరు తమ్మినేని చెప్పారు.

అయితే నిన్నటిదాకా నీతులు చెప్పిన జగన్.. ఇప్పుడు వంశీని వైకాపాలో చేర్చుకున్నారంటూ.. దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు వంటి నేతలు.. చవకబారు మాటలు మాట్లాడుతున్నారు. వంశీ వైకాపాలో ఇంకా చేరకపోగా.. వారికి ఉలుకెందుకో అర్థం కావడం లేదు.