టీడీపీ ఫ్లాప్ షో.. వేటు కోసం పాకులాట

అసెంబ్లీ సమావేశాల్లో వార్ వన్ సైడ్ అని అర్థం కావడానికి ఎక్కువరోజులు సమయం పట్టలేదు. బడ్జెట్ సమావేశాలు మొదలైన నాలుగురోజుల్లోనే టీడీపీ చేతులెత్తేసింది. అర్థవంతమైన చర్చలు జరిగే అసెంబ్లీ సమావేశాలను చూద్దామనుకున్న సామాన్య ప్రజలకు నిరాశే ఎదురైంది. చర్చ సమస్యలపై కాకుండా పార్టీలు, విధానాలపైకి వెళ్లిపోయింది. గతాలను తవ్వి తీసుకోడానికే టీడీపీ అధిక ప్రాధాన్యం ఇవ్వడం, దాన్ని తిప్పికొట్టడానికే వైసీపీకి సమయం సరిపోవడంతో అసలు అసెంబ్లీ సమావేశాల లక్ష్యం ఏంటో అర్థం కాకుండా ఉంది.

కేవలం అసెంబ్లీలో సభ్యుల సీటింగ్ విధానంపై వాదులాడుకోడానికే ఓరోజు సరిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన 10రోజుల సమావేశాల్లో కూడా ఎలాంటి చర్చ జరుగుతుందో ముందే ఊహించుకునే అవకాశాన్నిచ్చాయి రెండు పార్టీలు. అయితే ఇటువైపు అలకపాన్పు ఎక్కిన వారంతా ఒక్కొక్కరే దిగొస్తున్నారు. మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహా మరికొంతమంది సీనియర్లు అసెంబ్లీలో గొంతు సవరించుకుంటున్నారు. ఇక అటువైపు చంద్రబాబు ఒంటరిగా మారిపోతున్నారు.

అధికార పక్షం దెబ్బకి అచ్చెన్నాయుడి నోరు మూగబోయింది, బుచ్చయ్య చౌదరికి ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు, సీనియర్లు గంటా, కరణం.. ఎవ్వరూ కలుగజసుకోవడంలేదు. కనీసం చంద్రబాబు కూడా తమాయించుకుని మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. ఆఖరుకు జనసేన సభ్యుడు మాట్లాడినంత సేపు కూడా టీడీపీ సభ్యులు మాట్లాడలేకపోయారు. దిక్కుతోచని స్థితిలో స్పీకర్ ని టార్గెట్ చేసి టీడీపీ సభ్యులు చీవాట్లు తినడం ఒక్కటే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం.

గతంలో ఎప్పుడూ స్పీకర్ ఈ స్థాయిలో సభ్యులకు వార్నింగ్ లు ఇచ్చిన దాఖలాలు లేవు. నన్ను భయపెట్టొద్దు, స్పీకర్ చైర్ ని టార్గెట్ చేసి మాట్లాడొద్దు అని పదే పదే చెప్పినా చంద్రబాబు తీరు మారకపోవడంతో నాకు తెలుసులేవయ్యా ఇకచాలు అని స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తంచేయాల్సి వచ్చింది. ఒకరకంగా టీడీపీ పలాయనవాదాన్నే నమ్ముకుంది. సభనుంచి పారిపోడానికి, లేదా క్రమశిక్షణ ఉల్లంఘించి వేటు వేయించుకోడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది.

అసెంబ్లీలో మాట్లాడవయ్యా అంటే గొడవ చేస్తున్న చంద్రబాబు సమావేశాలు ముగిసిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. మొత్తమ్మీద అసెంబ్లీ సమావేశాలు మాత్రం అర్థవంతంగా జరగడంలేదనేది వాస్తవం. టీడీపీ చేతులెత్తేయడంతో వార్ వన్ సైడ్ అయిపోయింది. 

బ్యూటిఫుల్ హీరోయిన్ తో క్యూట్ యాంకర్ ఇంటర్వ్యూ

పూరి చూసిన ఎత్తుపల్లాలు ఏమిటి