టీడీపీ.. అక్కడ అభ్యర్థులను తేల్చేయలేకపోతోంది!

తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేని చోట ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ఈజీగానే తేల్చేస్తూ ఉన్నారు. కడప, రాజంపేట ఎంపీ సీట్ల పరిధిలోని అసెంబ్లీ సీట్లకు చంద్రబాబు నాయుడు నిన్న అభ్యర్థులను ఈజీగానే ఖరారు చేసేశారు. చకాచకా పది సీట్లకు అభ్యర్థులను ప్రకటించేసినట్టుగా ఉన్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేని చోట బాబు ఇలా తేల్చేయగలుగుతున్నారు కానీ.. ఎటొచ్చీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోటే అభ్యర్థిత్వాల విషయంలో చంద్రబాబు నాయుడు పునరాలోచనలో పడుతున్న వైనం స్పష్టం  అవుతోంది.

కడప, బద్వేలు,మైదుకూరు, కమలాపురం, ప్రొద్దుటూరు, రాయచోటి, రైల్వే కోడూరు, పుంగనూరు, పీలేరు.. వంటి  సీట్లకు చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ఈజీగానే డిసైడ్ చేశారు. అయితే పలమనేరు, తంబళ్ల పల్లె.. వంటి నియోజకవర్గాల అభ్యర్థులను మాత్రం బాబు తేల్చలేదు. వాటిని పెండింగ్ లో పెట్టినట్టుగా ప్రకటించారు.

ఎందుకంటే పలమనేరులో ఫిరాయింపు ఎమ్మెల్యే, మంత్రి అమర్ నాథ్ రెడ్డి ని మళ్లీ పోటీ చేయించాలా.. వద్దా.. అనేది బాబు తేల్చలేకపోతున్నారట. అలాగే  తంబళ్లపల్లెలో గత ఎన్నికల్లో టీడీపీ తరఫున నెగ్గిన ఎమ్మెల్యే శంకర్ పరిస్థితి కూడా అలానే ఉంది. వీరిలో అమర్ నాథ్ రెడ్డి మళ్లీ పోటీకే జంకుతున్నారని సమాచారం.

తను పలమనేరు నుంచి కాకుండా, పుంగనూరు  నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్టుగా చంద్రబాబుకు వివరించారట అమర్ నాథ్ రెడ్డి. అయితే పుంగనూరు సీటుకు ఆయన మరదలు అనీషా రెడ్డే పోటీకి వచ్చారు. ఆమెనే అక్కడ అభ్యర్థిగా ఖరారు చేశారు చంద్రబాబు.  ఇక తంబళ్లపల్లెలో సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారట. దీంతో ఆయననే  పోటీ చేయించడానికి ధైర్యం చేయలేకపోతున్నారని.. 
ప్రత్యామ్నాయాలను వెదుకుతున్నారని సమాచారం. కేవలం రాజంపేట ఎంపీ సీటు పరిధిలోని సీట్లలోనే కాదు.. చాలా మంది సిట్టింగులకు, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు టికెట్ లను ఇవ్వడానికి సిద్ధంగా లేరనే ఆ  పార్టీ  నుంచి సమాచారం అందుతోంది.