తూచ్.. తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!

తెలంగాణ ఎన్నికల ఫలితాలతో తమకు సంబంధం లేదని అంటున్నారు ఏపీ తెలుగుదేశం పార్టీ నేతలు! ఆఖరికి ఇదీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనే చేయలేదు.. తమ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు మంత్రాంగమే రచించలేదు, తమ తరఫున నందమూరి నటసింహం ప్రచారమే చేయలేదు.. అన్నట్టుగా వీళ్లు మాట్లాడుతున్నారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఏపీ తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదని పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు ఇప్పటివరకూ. తెలుగుదేశం వాళ్ల తీరు ఇది. ఎక్కడో కర్ణాటకలో భారతీయ జనతాపార్టీ మినిమం మెజారిటీని సాధించకపోతే అది తమ ప్రభావమే అని తెలుగుదేశం నేతలు చెప్పుకున్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ చిత్తు అయినా.. ఏదో లక్కీగా జేడీఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అక్కడ కాంగ్రెస్ ను తామే గెలిపించామని తెలుగుదేశం నేతలు చెప్పుకుంటున్నారు. ఇటీవలే చంద్రబాబు నాయుడు ఇదేమాటే చెప్పాడు. కర్ణాటకలో బీజేపీని తనే ఓడించానని చెప్పుకున్నాడు.

జనాలు నవ్వుతారు అని తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ భయం ఉండదు. అందుకే.. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ చిత్తు అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్రియాశీల పాత్ర పోషించిన మహాకూటమిని జనాలు చిత్తుకింద కొడితే.. ఈ ఫలితాలతో తమకు సంబంధం లేదని తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటోంది.

సపోజ్.. పర్ సపోజ్.. ఈ ఎన్నికల్లో మహాకూటమి అధికారమే సంపాదించుకుని ఉండుంటే.. ఈ పాటికి మైకులు మోత మోగిపోయేవి కావా.. తెలుగుదేశం ఏపీ నేతలు విజయాన్ని ఏ రేంజ్లో సెలబ్రేట్ చేసుకునే వాళ్లో తెలియదా? తెలంగాణలో గెలిచేశాం.. ఏపీలో గెలిచేస్తాం.. దేశమంతా గెలిచేస్తాం అని వెర్రిక్కినట్టుగా అరచకపోయే వారా? ఓడిపోయింది కాబట్టి.. ఇప్పుడు వీళ్లకు తెలంగాణ టీడీపీతో సంబంధం లేదు.

మరో కామెడీ ఏమిటంటే.. బీజేపీ ఓటమిని మాత్రం వీళ్లు హైలెట్ చేస్తున్నారు. రాజస్తాన్లో, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ లో బీజేపీ ఓడిపోయింది కాబట్టి.. దేశవ్యాప్తంగా బీజేపీ ఓడిపోతుందట. ఈ విషయాన్ని టీడీపీ లీడర్లు బోండా ఉమ తదితరులు చెప్పారు. ఆ రాష్ట్రాల్లో ఓడింది కాబట్టి.. బీజేపీ దేశమంతా ఓడిపోతుంది. తెలంగాణలో ఓడినా టీడీపీ ఏపీలో ఓడిపోదు. అదీ పచ్చపాత థియరీ!

Show comments