ఏపీ బడ్జెట్ సమావేశాలు.. టీడీపీలో సెగలు

ఏపీ బడ్జెట్ సమావేశాలు టీడీపీ అధినేతకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలలో ఎంతమంది తనతో ఉంటారు, ఎంతమంది గోడదూకుతారు అనే లెక్కలతో కిందామీదా పడుతున్న చంద్రబాబుకి బడ్జెట్ సమావేశాలు మరింత టెన్షన్ పెడుతున్నాయి. ఈ సమావేశాల్లోనే ఎమ్మెల్యేల అంతరంగం ఆవిష్కృతం అయ్యే అవకాశం ఉంది.

టీడీపీ బ్యాచ్ లో ఇప్పటికే కొంతమందికి జ్ఞానోదయం అయింది, ఎంపీలంతా కేంద్రంలో అధికార పార్టీతో కలిసిపోయారు కానీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆలోచనలో ఉన్నారు. రాజీనామా చేసి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీలో చేరాలా లేక, రాజీనామా వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోకుండా సైలెంట్ గా కాషాయ కండువా కప్పుకోవాలా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఓ ఎమ్మెల్యే బీజేపీ గూటి దగ్గరకు వెళ్లి మరీ వెనక్కు వచ్చారు.

ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేసి మరీ టీడీపీకి షాకిచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికల్లో ఓటమి పాలైన తనకు ఎమ్మెల్సీగా కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా లోకేష్ ను ఉద్దేశించి అన్నవే. అయితే ఇలాంటి మాటలకు రోషానికి పోయి రాజీనామా చేసేంత ధైర్యం లోకేష్ కి లేదని అందరికీ తెలిసిందే కదా. కానీ ఈ రాజీనామా వ్యవహారం మిగతా వాళ్లలో కూడా చైతన్యాన్ని రగిలిస్తుందనేది బాబు భయం.

ఎవరో ఒకరు ముందుగా ధైర్యం చేస్తే.. వారి బాటలో వెళ్లాలని మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రభాకర్ రాజీనామాతో కదలిక వస్తుందేమో చూడాలి. అయితే అంతకంటే మంచి అవకాశం వీళ్లకిప్పుడు బడ్జెట్ రూపంలో వచ్చింది. జనరంజక బడ్జెట్ ని మెచ్చుకునే క్రమంలో టీడీపీ నేతలు తమ లోపలి మనిషిని బైటపెట్టే అవకాశం ఉంది. అలా వైసీపీపై తమ మమకారాన్ని చూపించుకునే అవకాశం వీళ్లకు దక్కింది.

వైసీపీలో చేరాలని చూస్తున్న ప్రజా ప్రతినిధులంతా కచ్చితంగా బడ్జెట్ ని, కేటాయింపులను మెచ్చుకుంటారు. అదే సమయంలో టీడీపీలో జరిగిన అవకతవకలనూ మీడియా ముందు బయటపెట్టే అవకాశముంది. బీజేపీ వైపు చూస్తున్న ఒకరిద్దరు కూడా బడ్జెట్ సమావేశాల్లో తమ స్వరం మారుస్తారని సమాచారం.. కేంద్ర బడ్జెట్ కి, రాష్ట్ర బడ్జెట్ కి పోలికలు తెచ్చే అవకాశం ఉంది.

ఎలా చూసుకున్నా ఈ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీలో చీలిక వచ్చే అవకాశం ఉంది. 22 మందిలో (చంద్రబాబు మినహా) ఎంతమంది ఈ గట్టునుంటారో, ఎంతమంది ఆ గట్టుకి వెళ్తారో తేలిపోతుంది. ఇక ఇప్పటికే జగన్ పై విధేయత చూపించిన జనసేన ఎమ్మెల్యే.. ఈ బడ్జెట్ సమావేశాల్లో జననేతకు వీర విధేయుడుగా మారతాడేమో చూడాలి. బడ్జెట్ సమావేశాలు 14 రోజులు కొనసాగుతాయి. ఈ 2 వారాల్లో ప్రతిపక్షంలో అంకెలు మారే అవకాశాలున్నాయి.

బాబు భ్రమలను నమ్మని జనం.. వికేంద్రీకరణకే జగన్‌ మొగ్గు?