పోలింగ్ అలర్ట్... అక్కడ బలం తారుమారవుతుందా?

లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ గురువారం కొన్ని ఆసక్తిదాయకమైన సీట్లలో పోలింగ్ జరగనుంది. ప్రత్యేకించి తమిళనాట రేపు పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే  అక్కడ ఈసారి ఫలితాలు మరింత ఆసక్తిదాయకంగా ఉండబోతున్నాయి. 

గత ఎన్నికల్లో తమిళనాట డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు తుడిచి పెట్టుకుపోయాయి. ఎంతగా అంటే తమిళనాడు నుంచి ఆ రెండు పార్టీలకూ లోక్ సభలో సీటే దక్కలేదు! మొత్తం ముప్పై తొమ్మిది స్థానాలున్న తమిళనాట అన్నాడీఎంకే అప్పుడు ఏకంగా ముప్పై ఏడు ఎంపీ సీట్లను సొంతం చేసుకుంది. మిగతా రెండు సీట్లలో ఒకటి బీజేపీ, మరోటి పీఎంకే దక్కించుకుంది. 

డీఎంకే గుండు సున్నగా నిలిచింది. కాంగ్రెస్ కూడా జీరోగా నిలిచింది. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పు! ప్రత్యేకించి జయలలిత లేరు అన్నాడీఎంకేకు. అలాగే డీఎంకేకు కూడా కరుణానిధి లేరు. అయినా.. ఈసారి బలాబలాలు తారుమారు కావడం ఖాయంగా కనిపిస్తుంది.

ఐదేళ్లకు ఒకసారి ఒక్కో పార్టీని చిత్తుగా ఓడించడం తమిళులకు ఉన్న అలవాటు. ఈసారి కూడా అదే జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే డీఎంకే కూటమిలోని పార్టీలో తాము పోటీచేసిన సీట్లన్నింటిలోనూ విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నాయి.

వీటిల్లో డీఎంకే ఇరవై సీట్లలో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ తొమ్మిది. వీసీకే రెండు సీట్లలో పోటీచేస్తోంది. ఇక సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే, ఐజేకే, కేడీఎండీకే, ఐయూఎంఎల్ పార్టీలు తలా ఒక సీట్లో పోటీ చేస్తున్నాయి. అవతల కూటమిలో అన్నాడీఎంకే ఇరవై సీట్లలో, పీఎంకే ఏడు సీట్లలో, బీజేపీ ఐదు, డీఎండీకే నాలుగు సీట్లలో పోటీ చేస్తున్నాయి. 

తమిళ మానిల కాంగ్రెస్, ఇతర పార్టీలు తలా ఒక సీటుకు పోటీచేస్తూ ఉన్నాయి. జయలలిత అన్నాడీఎంకేను లీడ్ చేస్తూ ఉండినా.. ఈ ఎన్నికల్లో తమిళులు ఏకపక్షంగా డీఎంకే కూటమికి మద్దతుగా నిలిచేవారే, ఇక ఆమె కూడా ఎలాగూలేదు కాబట్టి.. ఈసారి డీఎంకే కూటమికి వార్ వన్ సైడ్ అవుతుందనే అంచనాలున్నాయి.

అందులోనూ దినకరన్ పార్టీ అన్నాడీఎంకే ఓటు బ్యాంకును మరింతగా చీల్చుతుందని, కమల్ పార్టీ కూడా అన్నాడీఎంకేనే దెబ్బకొడుతుందనే అంచనాలున్నాయి. ఈ రకంగా చూస్తే తమిళనాట డీఎంకే కూటమి విజయం నల్లేరు మీద నడకేనేమో!

ఇప్పుడు పోయిన ప్రాణాలను జేసీ సోదరులు తెచ్చిస్తారా?