తాజ్‌మహల్‌తో ప్రజా వేదికకు పోలికా.?

ప్రపంచ అద్భుతాల్లో ఒకటి తాజ్‌ మహల్‌. దాన్ని అక్రమ నిర్మాణం ప్రజావేదికతో పోల్చారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. 'తాజ్‌ మహల్‌, యమునా నది ఒడ్డున వుండబట్టి సరిపోయింది.. లేదంటే..' అంటూ సోషల్‌ మీడియాలో ఓ ఫొటోని కేశినేని నాని పోస్ట్‌ చేశారు. ఈ మధ్య సోషల్‌ మీడియా వేదికగా కేశినేని నాని హల్‌చల్‌ చేస్తోన్న విషయం విదితమే. టీడీపీ మీద సెటైర్లు వేయడం ద్వారా సోషల్‌ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్న ఈ టీడీపీ ఎంపీ, ఇప్పుడు ప్రభుత్వమ్మీద సెటైర్లేసేందుకు సోషల్‌ మీడియాని ఆశ్రయిస్తున్నారన్నమాట.

కేశినేని నాని పోస్ట్‌ చేసిన ఫొటోలో పైన తాజ్‌ మహల్‌, కింద సగం కూల్చేసిన ప్రజావేదిక వున్నాయి. అయితే, ఇక్కడ నాని తెలుసుకోవాల్సింది.. నిబంధనలకు విరుద్ధంగా ప్రజావేదికను నిర్మించారని. ప్రజల కోసం నిర్మించిన ప్రజావేదికను, తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల కోసం వినియోగించుకుందన్న విషయాన్ని కేశినేని నాని మర్చిపోతే ఎలా.?

'ప్రజా వేదికను కూల్చేయడానికి కొంత టైమ్‌ తీసుకుని వుంటే బావుండేది..' అని ఇటీవల ఆయనే కామెంట్‌ చేశారు. పరోక్షంగా కూల్చివేతను సమర్థించిన కేశినేని నాని, ఇంతలోనే మాట మార్చేశారు. చంద్రబాబు విదేశాల నుంచి తిరిగొచ్చాక కేశినేని నానిలో మార్పురావడం ఆశ్చర్యకరమేమీ కాదు. టీడీపీలో నిరసన గళం విన్పించి, తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించిన నాని, ఇప్పుడిప్పుడే మళ్ళీ జూలు విదుల్చుతున్నానని అనుకుంటున్నారుగానీ.. ఆయన తన వ్యాఖ్యలతో నవ్వులపాలైపోతున్నానన్న విషయాన్ని కాస్త గుర్తుంచుకుంటే మంచిది.

ప్రజావేదిక ఒక్కటేకాదు, మొత్తంగా కరకట్టను ఆనుకుని వున్న అక్రమ నిర్మాణాలన్నిటి అంతుచూసేలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కార్యాచరణ షురూచేసింది. నోటీసులు వెళ్ళడం, సమాధానం రాకపోతే కూల్చేయడం.. ఇదీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందున్న లక్ష్యం.   

జగన్‌ విషయంలో కూడా ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?

Show comments