గ్రేట్ ఆంధ్ర గ్రౌండ్ రిపోర్ట్ః తాడిపత్రి

చాలా సైలెంట్ గా కనిపిస్తున్నారు తాడిపత్రి జనాలు! ఎవరికి ఓటేస్తారు అంటే.. ఎవరో ఒకరికిలే అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తున్నారు. ఎవరికి ఓటేస్తామో చెప్పడానికి ఇక్కడి జనాలు అంత ఆసక్తి చూపడంలేదు. ‘ఇంతకీ ఎవరు గెలుస్తారు?’ అంటే మాత్రం.. ‘జేసీ వాళ్లే గెలుస్తారేమో!’ అంటున్నారు. ‘మీరు జేసీ వాళ్లకే ఓటేస్తారా..’ అంటే ‘ఇప్పటికే చాలా వివరాలు చెప్పాం..’ అన్నట్టుగా వారు సైడైపోతున్నారు! ఇదీ తాడిపత్రిలో ఎదురవుతున్న పరిస్థితి.

ఈసారి జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీచేస్తూ ఉన్నారు. తండ్రి ప్రభాకర్ రెడ్డి వారసత్వాన్ని ఈయన తీసుకొంటున్నారు. ఒకరకమైన కఠినమైన పరీక్షనే ఎదుర్కొనబోతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈసారి బరిలోకి దిగారు. విశేషం ఏమిటంటే.. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో చాలాకాలం తర్వాత కేతిరెడ్డి కుటుంబం బరిలోకి దిగుతోంది.

2004లో కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి అలియస్ సూరీడు ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున జేసీ దివాకర్ రెడ్డి మీద పోటీచేశారు. ఆ కేతిరెడ్డి సూరీడి తమ్ముడే పెద్దారెడ్డి. సూరీడు కొడుకు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం వెంకట్రామిరెడ్డి ధర్మవరం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు.

గతంలో సూర్య ప్రతాపరెడ్డి ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసినప్పుడు జేసీ దివాకర్ రెడ్డికి ముచ్చెమటలు పట్టాయి. అప్పడు రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి ఉండినా.. దివాకర్ రెడ్డి కేవలం నాలుగైదు వేల చిల్లర మెజారిటీతో బయటపడ్డారు. ఆ తర్వాత సూర్యప్రతాపరెడ్డి హతమయ్యారు. కేతిరెడ్డి కుటుంబానికి మొదటి నుంచి వైఎస్ ఆశీస్సులుండేవి, దీంతో వారు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇదంతా పాత కథ.

ఈసారి డిసైడింగ్ ఫ్యాక్టర్లు ఇవే...
-యథాతథంగా జేసీ కుటుంబమే ఇక్కడ జెండా పాతుతుంది.. అనేది పైకి వినిపిస్తున్న మాట.
-కానీ తాడిపత్రిలో చాలా ఆసక్తిదాయకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి గత కొంతకాలంలో. జేసీ వర్గానికి అత్యంత అనుచవర్గంగా చలామణి అయిన వారు ఇప్పుడు దూరం అయ్యారు.
-మున్సిపల్ కౌన్సిలర్ స్థాయినేతలు అనేకమంది తమదారి తాము చూసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అహంకారాన్ని వారంతా భరించలేక పోయారనేది బాగా వినిపిస్తున్నమాట.
-ఏం చేసినా తామే గెలుస్తాం అనే భావన జేసీ సోదరుల అహాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిందని, సాటి వారెవరికీ కనీసం తమముందు కుర్చీల్లో కూర్చునే అర్హత కూడా లేదన్నట్టుగా జేసీ సోదరులు వ్యవహరిస్తారనే మాట స్థానికంగా వినిపిస్తుంది. దీంతో ఎన్నాళ్లీ ఊడిగం... కొందరు బయటకు వెళ్లిపోయారు.
-గ్రామాల్లో రెడ్డి సామాజికవర్గం సహకరించేకపోతే మాత్రం ఈసారి జేసీల ఓటమి ఖరారు అయినట్టే అని స్పష్టం అవుతోంది. జనాభా రీత్యా, రాజకీయ ఆధిపత్యం రీత్యా ఈ ప్రాంతంలో రెడ్లు ముందుంటారు.
-అలాంటి వారందరికీ ఏదైనా సమస్య వస్తే తనే అండగా ఉంటాననే ధోరణితో జేసీ దివాకర్ రెడ్డి ఇన్నాళ్లూ ఇక్కడ దిగ్విజయంగా బండి నడిపించారు. ఇతర కులస్తుల్లో కూడా ఈ భరోసాను ఇచ్చారు దివాకర్ రెడ్డి. 
-ఇన్నేళ్లూ స్థానికంగా కూర్చున్న బలమైన అభ్యర్థిలేరు దివాకర్ రెడ్డికి. మూడేళ్ల కిందటే జగన్ ఈ నియోజకవర్గం బాధ్యతను కేతిరెడ్డి పెద్దారెడ్డికి అప్పగించారు.
-గ్రామాల్లోకి చొచ్చుకుని వెళ్లడంలో, జనాలను కలుపుకుపోవడంలో జేసీ సోదరులకు ధీటుగా నిలుస్తున్నారు పెద్దారెడ్డి. 
-గ్రామాలు చాలా సైలెంట్ గా ఉన్నాయి. తాము జేసీ వర్గానికి వ్యతిరేకం అని ఎవరూ గట్టిగా చెప్పుకునే వారులేరు. అలాగని అనుకూలమని కూడా ఎవ్వరూ చొక్కాలు చించుకోవడంలేదు.
-మాస్ ఓటర్ జేసీకి అనుకూలత. కులాలకు అతీతంగా ఇది జేసీల వైపు మొగ్గుచూపుతూ ఉంది.
-పర్సెంటేజీల్లో చెప్పడానికి ఎవ్వరూ ఓపెనప్ కావడంలేదు. ఎందుకొచ్చిన గొడవ అన్నట్టుగా ఉంది పరిస్థితి. 
-గతంలోలా రుణమాఫీ వంటివి తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచే అవకాశాలు లేవు. 
-అత్యంత పోటాపోటీ ఉంటుంది. ఎవరు నెగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. తమ ఆత్మగౌరవాన్ని దివాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెడుతూ ఉన్నాడనే భావన ఇక్కడ ఒకవర్గంలో కనిపిస్తూ ఉంది!

రాధాకృష్ణ నాతో పెట్టుకోకు నేను ఎదవని కాదు...

సురేఖ వద్ద పవన్ పర్సనల్ లోన్.. కోటి ఏడు లక్షలకు పైగా..

Show comments