పొత్తుల్లో పడి కాంగ్రెస్ చిత్తవుతుందా?

మొత్తంగా 53 సీట్లకు బేరం పెట్టాయి కాంగ్రెస్ తో మిత్రత్వానికి సై అంటున్న పార్టీలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోలోగా వెళితే కేసీఆర్ ను ఏమీ చేయలేమని వీళ్లందరికీ తెలుసు. అందుకే చాలా సహజ మిత్రులం అన్నట్టుగా పొత్తులకు రెడీ అయిపోయారు. కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా ఏర్పాటు అయిన తెలుగుదేశం పార్టీనే కాంగ్రెస్ తో చేతులు కలపడానికి రెడీ అయిపోయింది. అయితే సీట్లు మాత్రం గట్టిగానే డిమాండ్ చేస్తోందని సమాచారం.

తమకు 50 సీట్లలో బలం ఉంది, ముప్పై సీట్లు అయినా కేటాయించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందని సమాచారం. వీళ్ల డిమాండ్ ఇలా ఉంటే.. తెలంగాణ జనసమితి 15, సీపీఐ ఎనిమిది సీట్లు అడుగుతోందట. ఓవరాల్ గా 53 సీట్లకు బేరంపెట్టాయి ఈ పార్టీలన్నీ. అయితే ఇన్ని వీళ్లకు కేటాయిస్తే కాంగ్రెస్ కథ ఎన్నికలకు ముందే కంచికి చేరిపోతుంది.

జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి వంటి ఉద్ధండులు సిట్టింగులుగా ఉన్న సీట్లను కూడా తెలుగుదేశం పార్టీ అడిగేస్తోందని సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీ వద్ద ఉన్న ఆయుధమల్లా డబ్బే! కాంగ్రెస్ అభ్యర్థులందరి ఖర్చుకూ డబ్బులు ఇస్తామని తెలుగుదేశం పార్టీ ఓపెన్ ఆఫర్ ఇస్తోందని టాక్. మరి డబ్బుకు ఆశపడి కాంగ్రెస్ పార్టీ సీట్లను త్యాగం చేస్తుందా? అనేదానికి త్వరలోనే స్పష్టత వస్తుంది. ఎన్నికల్లో ఖర్చు కోసమని.. సీట్లనే త్యాగం చేసేస్తే కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతం అవుతుందని మాత్రం ఖాయంగా చెప్పవచ్చు.

ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ సీనియర్లు ఈ విషయాన్ని ఢిల్లీ వరకూ తీసుకెళ్లారు. అసలు పొత్తు అవసరం టీడీపీకే, వీలైనన్ని తక్కువ సీట్లకు పరిమితం చేద్దాం అని వీళ్లు రాహుల్ నే కలిసి చెప్పారట. పొత్తుల బాధ్యత పీసీసీదే అని రాహుల్ తేల్చేశాడట. టీడీపీకి 15 సీట్లు ఇస్తేచాలు అనేది కొంతమంది కాంగ్రెస్ నేతల వాదన. టీజేఎస్‌కు ఏడెనిమిది, సీపీఐకు మూడు సీట్లు ఇద్దామని వీరు ప్రతిపాదిస్తున్నారట. ఈ నంబర్లు మొదటి నుంచి వినిపిస్తున్నవే.. ఇప్పటివరకూ పొత్తు అయితే ఒక కొలిక్కి రాలేదు.

Show comments