సురేష్ బాబులో ‘జడ్జిమెంట్’ శక్తి పోయిందా?

సాధారణంగా ఏ రంగంలో అయినా ఒక స్థాయి సీనియారిటీ, అనుభవం వచ్చిన తర్వాత.. ఆ రంగాన్ని మదింపు చేయడంలో అప్రయత్నంగా కొన్ని సామర్థ్యాలు అలవడుతాయి. అలా ‘మదింపు చేయడం’ అనేది బిజినెస్ పరంగా చాలాకీలకం అయిన సినిమా రంగంలో ఇలాంటి అనుభవజ్ఞులు కూడా అనేకమంది ఉన్నారు. విడుదలకు ముందుగానే, ఒక సినిమాను చూశారంటే.. ఎన్నిరోజులు ఆడుతుందో సరిగ్గా లెక్కకట్టి చెప్పగల ఉద్ధండులూ ఉన్నారు. అలాంటి వారిలో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు కూడా ఒకరు! కానీ తాజా సినీ సంచలనం ‘కేరాఫ్ కంచరపాలెం’ విషయంలో సురేష్ బాబు జడ్జిమెంట్ దారుణంగా ఫెయిలైందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రాన్ని అతితక్కువ బడ్జెట్ తో నిర్మించారు. నిజానికి సినిమా మేకింగ్ సమయంలో చాలా ఇబ్బందులు పడుతూ.. దానిని పూర్తిచేశారు. అయితే.. చాలాకాలం కిందటే పూర్తయిపోయిన ఈ చిత్రం విడుదల కావడానికి చాలా సమయం తీసుకుంది. ఎందుకంటే.. రొటీన్ కమర్షియల్ చిత్రాలకు చాలా భిన్నంగా ఉండే ఈ చిత్రం ఎలాంటి ఫలితం సాధిస్తుందో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు సరిగా అంచనా వేయలేకపోయారని సమాచారం. సినిమా రూపకర్తలు పలుమార్లు ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రివ్యూలు వేసినా.. అది విడుదలకు మాత్రం నోచుకోలేదు.

లక్కీగా దగ్గుబాటి రానాకు ఈ చిత్రం నచ్చింది. రానా చొరవ తీసుకోవడంతో దీనికి మోక్షం లభించింది. ఆయనే స్వయంగా సినిమా పూర్తి హక్కులను కొనుక్కోవడంతో పాటూ... తాను కొన్న తరువాత.. సినిమా విడుదలకు హైప్ క్రియేట్ అయ్యేలా చొరవ తీసుకుని ప్రముఖ దర్శకులందరితో.. సినిమా ప్రమోషన్ గురించి చెప్పిస్తూ సక్సెస్ అయ్యారు.

అయితే విడుదలకు ముందు కూడా దగ్గుబాటి సురేష్ బాబు ఈ చిత్రం సక్సెస్ ను సరిగ్గా అంచనా వేయలేకపోయారని.. దీన్నెవరు చూస్తారనే ఉద్దేశంతో.. పది థియేటర్లలో రిలీజ్ చేస్తే చాలని అన్నారని సమాచారం. అయితే రానా పట్టుబట్టి.. 200 థియేటర్లలో విడుదల చేయించారు.

మొత్తానికి అది గ్రాండ్ సక్పెస్ ను నమోదు చేసింది. అయితే.. ప్రజలందరూ నీరాజనాలు పట్టిన తర్వాత గానీ.. సినిమాలో ఉన్న గొప్పదనం.. అనుభవజ్ఞులైన సినీ పండితులకు ముందుగా స్ఫురించకపోవడమే తమాషా!