సుజనా ప్రవచనం : భాజపా మీ అవసరం!

కండువా మార్చుకున్న తర్వాత.. ఎంపీ సుజనా చౌదరి ఏసీ రూం రాజకీయాలకు పరిమితం కాకుండా, ప్రజా రాజకీయాల్లోకి రాదలచుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ కేవలం నాయకులతో మాత్రమే భేటీ అవుతూ ఉండిపోయిన ఈ రాజ్యసభ సభ్యుడు, తాజాగా భారతీయజనతా పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాత.. పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. పార్టీ కార్యక్రమాలను భుజాన వేసుకుని చేపడుతున్నారు. అచ్చమైన పార్టీ నాయకుడిలాగా తిరుగుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం సంఘటనా పర్వ్ లో భాగంగా విశాఖపట్టణంలో జరిగిన కార్యక్రమంలో సుజనా చౌదరి వల్లించిన అంశాలు మరొక ఎత్తు. ఈ కార్యక్రమంలో ఆయన ‘తెలుగు రాష్ట్రాలు రెండింటికీ భాజపా అవసరం చాలా ఉంది’ అని వ్యాఖ్యానించారు. అనగా.. మీకు మా అవసరం ఉంది గనుక.. మీరు మా పార్టీని ఆదరించి తీరాల్సిందే అని ఆయన ప్రజలను బెదరిస్తున్నట్లుగా ఈ వ్యాఖ్యలున్నాయని విమర్శలు వస్తున్నాయి.

సాధారణంగా పార్టీలు.. ‘మమ్మల్ని ఆదరిస్తే.. మీ సేవ చేసుకుంటాం’ అనే బేరం మాత్రమే ప్రజల ముందు పెడతాయి. కానీ ఆయన ‘కేంద్రంలో మేం అధికారంలో ఉన్నాం గనుక.. మా అవసరం మీకున్నది గనుక... ఆదరించాల్సిందే’ అనేతరహాలో బేరం పెడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు భాజపా అవసరం చాలా ఉన్నమాట నిజమే.

నిజం చెప్పాలంటే ఆ ‘అవసరాన్ని’ భాజపానే సృష్టించింది. రాష్ట్రం రెండు ముక్కలు అయిన తర్వాత.. ఎవరికి ఏం దక్కాలో, నష్టపోతున్న నేపథ్యంలో ఎవరికి ఏం పరిహారంగా చెల్లించాలో విభజన చట్టం వీలైనంత స్పష్టంగానే నిర్దేశించింది. కానీ ఆ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురాకండా.. విభజన చట్టంలోని అంశాలను ఇంకా పెండింగ్ లోనే పెడుతూ... భాజపా ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వం అయిదేళ్ల పాటూ కుట్రపూరితంగా వ్యవహరించింది. దాంతో ఆ పార్టీతో తెలుగు రాష్ట్రాలకు అవసరం మరింతగా పెరిగిపోయింది.

ఇలా ఆ పార్టీ రాష్ట్రానికి ఎంతగా ద్రోహం చేస్తూపోతే అంతగా వారి అవసరం పెరుగుతుంది. కానీ.. వారు తమతో అవసరాన్ని పెంచుకోవడానికే ఈ కుట్రలు చేస్తున్నారని ప్రజలు గుర్తిస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ సమాధి అవుతుంది.

‘బాహుబలి’ రికార్డ్స్ ను ‘సాహో’ అధిగమిస్తుందా?

Show comments