బాబు కనుసన్నల్లో సుహాసిని రాజకీయం

రాజకీయాల్లో మిత్రుల కంటే శత్రువులకే ఎక్కువ మర్యాద ఇవ్వాలంటారు అనుభవజ్ఞులు. అలాంటి ఎత్తుగడల్లో ఆరితేరిందో లేక తాత, తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వమో తెలియదు కానీ, కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న నందమూరి హరికృష్ణ తనయ సుహాసిని తన ప్రచారాన్ని వినూత్నంగా ప్రారంభించారు. కాంగ్రెస్ రెబల్ గా కూకట్ పల్లి నుంచి నామినేషన్ వేసిన గొట్టిముక్కల వెంగళ్రావు నివాసానికి వెళ్లి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు సుహాసిని.

పొత్తుల న్యాయం ప్రకారం కూకట్ పల్లి టీడీపీకి ఇచ్చారు కాబట్టి తనకు పోటీలేకుండా తప్పుకోవాలని నామినేషన్ ఉపసంహరంచుకోవాలని ఆయన్ను కోరారు. ఆ తర్వాత తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో కూడా తనవెంట పెద్దిరెడ్డి కూడా ఉండేట్టు జాగ్రత్త పడుతున్నారు సుహాసిని. కూకట్ పల్లి సీటుని తొలినుంచీ ఆశించి భంగపడ్డ పెద్దిరెడ్డి హఠాత్తుగా సుహాసిని తెరపైకి వచ్చేసరికి కాస్త అలకబూనాడు. చంద్రన్న బుజ్జగింపులతో సరిపెట్టుకున్నా తనకు దక్కాల్సిన సీటు తప్పిపోయిందనే బాధ ఆయనలో ఉండనే ఉంది.

అందుకే సుహాసిని ముందుగా అసంతృప్తులను తగ్గించే పనిలో పడ్డారు. పెద్దిరెడ్డితో కలిసే ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు. లోలోపల ఎంత అసంతృప్తి ఉన్నా పైకి కలిసే ప్రచారానికి వస్తున్నారు కాబట్టి, పెద్దిరెడ్డి వర్గం కూడా సుహాసినికి మద్దతు తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు పెద్దిరెడ్డిని బుజ్జగించి, మరోవైపు కాంగ్రెస్ రెబల్ వెంగళరావుని కూడా శాంతింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సుహాసిని.

జనాల్లోకి వెళ్లి ఓట్లు అడగటం కంటే ముందు ఇలాంటి కీలకమైన వ్యవహారాలను చక్కబెట్టుకుంటూ అనుభవజ్ఞురాలైన రాజకీయ నాయకురాలిగా అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు సుహాసిని. చూస్తుంటే.. బాబు కనుసన్నల్లో సుహాసిని రాజకీయం జోరుగా సాగుతున్నట్టుంది.

బిడ్డా రాస్కో.. తెలంగాణ‌లో అధికారం మాదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments