బీజేపీకి సుబ్రమణ్య స్వామి సలహా అదే!

భారతీయ జనతా పార్టీ విధానాల అంశంలో కూడా ఆసక్తిదాయకంగా మాట్లాడే వ్యక్తి సుబ్రమణ్య స్వామి. పేరుకు బీజేపీ ఎంపీనే అయినా.. వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటారాయన. బీజేపీ తీరునే విమర్శిస్తున్నట్టుగా ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటారు.

ఈ క్రమంలో బీజేపీకి మహారాష్ట్ర వ్యవహారంలో ఒక ఆసక్తిదాయకమైన సలహా ఇచ్చారు సుబ్రమణ్యస్వామి. ఆ సలహా కూడా స్వామి స్టైల్లో ఉంది. ఇంతకీ అదేమిటంటే.. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని అధికార భాగస్వామిని కానీయకూడదు అనేది ఆయన ఆలోచన. 'కాంగ్రెస్ ముక్త్ భారత్' అనేది భారతీయ జనతా పార్టీ అజెండా అని, దేశంలో కాంగ్రెస్ ఉండకూడదనే లక్ష్యం  మేరకు భారతీయ జనతా పార్టీ పని చేయాలని సుబ్రమణ్య స్వామి అంటున్నారు.

ఇప్పుడు మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్ లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామి అవుతుంది. దానికీ కొన్ని మంత్రి పదవులు దక్కుతాయి. అప్పుడు మళ్లీ కాంగ్రెస్ ఉనికి చాటుకున్నట్టుగా అవుతుంది. అందుకే ఇప్పుడు ఆ కూటమిని అధికారంలోకి రానివ్వకూడదని భారతీయ జనతా పార్టీకి సుబ్రమణ్య స్వామి సలహా ఇస్తున్నారు.

అందుకోసం శివసేనకే అధికారం అప్పగించి, భారతీయజనతా పార్టీ సపోర్ట్ చేయాలన్నట్టుగా కూడా ఆయన చెబుతుండటం గమనార్హం. ముఖ్యమంత్రి పీఠం విషయంలో శివసేన పెట్టిన షరతులకు బీజేపీ ఒప్పుకోలేదు. అందుకే ఆ కూటమి అధికారంలోకి రాలేదు.

అయితే స్వామి మాత్రం శివసేన షరతులకు భారతీయ జనతా పార్టీ  ఒప్పుకోవాలని, ఆ పార్టీకి సీఎం పీఠాన్ని అప్పగించి లోపలనుంచినో, బయట నుంచినో సపోర్ట్ చేయాలని స్వామి అంటున్నారు. కాంగ్రెస్ కు మాత్రం ఛాన్స్ ఇవ్వొద్దని ఆయన అంటున్నారు. మరి స్వామి సలహాను బీజేపీ పట్టించుకుంటుందా?

Show comments