సినిమా రివ్యూ: సుబ్రహ్మణ్యపురం

రివ్యూ: సుబ్రహ్మణ్యపురం
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: సుధాకర్‌ ఇంపెక్స్‌
తారాగణం: సుమంత్‌, ఈషా రెబ్బా, సురేష్‌, సాయికుమార్‌, భద్రమ్‌ తదితరులు
కూర్పు: కార్తీక శ్రీనివాస్‌
సంగీతం: శేఖర్‌ చంద్ర
ఛాయాగ్రహణం: ఆర్‌.కె. ప్రతాప్‌
నిర్మాత: బీరం సుధాకర్‌ రెడ్డి
రచన, దర్శకత్వం: సంతోష్‌ జాగర్లపూడి
విడుదల తేదీ: 7 డిసెంబర్‌, 2018

లో బడ్జెట్‌ థ్రిల్లర్‌/మిస్టరీ సినిమాలకి వుండే అతి పెద్ద అడ్వాంటేజ్‌... అంతకుముందు ఎవరూ ట్రై చేయని కాన్సెప్ట్‌. మిగిలిన వనరులు ఎలా వున్నా కానీ కథాపరంగా చూపించే కొత్తదనం ఇలాంటి చిత్రాలకి అతి పెద్ద బెనిఫిట్‌. అయితే 'సుబ్రహ్మణ్యపురం' మాత్రం కాన్సెప్ట్‌ పరంగా 'కార్తికేయ' చిత్రానికి కొనసాగింపులా, ఒక్కోసారి దానికి 'క్లోన్‌'లా అనిపిస్తుంది. ఆల్రెడీ ఒకరు ట్రై చేసిన దానిని తిరిగి అటెంప్ట్‌ చేయడంతోనే ఇలాంటి సినిమాలకి వుండే అతి పెద్ద అడ్వాంటేజ్‌ని దూరం చేసుకున్నట్టవుతుంది. పోనీ అదే మళ్లీ తీయాలని భావించినపుడు దాని కంటే ఉత్తమంగా తీర్చిదిద్దినట్టయితే బాగుంటుంది.

కానీ కార్తికేయ కంటే అన్ని విషయాల్లోను అధమంగా అనిపించే ఈ సుబ్రహ్మణ్యపురం కేవలం కథలోని సస్పెన్స్‌ మీదే డిపెండ్‌ అయి రన్‌ అవుతుంది. అదేమిటనేది, ఇది ఎటు వెళుతుందనేది 'కార్తికేయ' చూసే వారికి క్లియర్‌గా అర్థమవుతుంటుంది. పాత కథనే అయినా పాయింట్‌కి కట్టుబడి నడిపించినట్టయితే ప్రేక్షకులని లీనం చేసే వీలుంటుంది. కానీ కథ రసకందాయంలో పడేలోగా పుణ్యకాలం గడిచిపోయి ఇంటర్వెల్‌ కూడా అయిపోతుంది. కథకి ఏమాత్రం సాయపడని హీరో స్నేహితుల ట్రాక్‌, వారి మధ్య రిలేషన్స్‌ని దర్శకుడు చాలా దీక్షతో ఎస్టాబ్లిష్‌ చేస్తుంటాడు.

హీరోయిన్‌ ట్రాక్‌తో అయితే 'శ్రీమంతుడు' చిత్రాన్ని గుర్తు చేస్తాడు. అటు హీరో స్నేహితులతో సరదాలు, హీరోయిన్‌కి దగ్గరయ్యే ప్రయత్నాల్లో వుండగా ఇటు సుబ్రహ్మణ్యపురంలో కొందరు విచిత్రమైన పరిస్థితుల్లో ఆత్మహత్యలకి పాల్పడుతుంటారు. రక్తి కట్టించడానికి స్కోప్‌ వున్న ఈ ఆత్మహత్యల పరంపరని చాలా నాసిరకంగా చిత్రీకరించడంతో, సదరు సన్నివేశాల్లోని నటుల అభినయంతో ఏమాత్రం ఆసక్తి రేకెత్తించదు. మొత్తానికి హీరో తన ఫ్రెండ్‌షిప్‌ అండ్‌ రొమాన్స్‌ పనులు పూర్తి చేసుకుని ఇంటర్వెల్‌ తర్వాత సుబ్రహ్మణ్యపురానికి వస్తాడు. అక్కడ జరుగుతున్న మిస్టరీని చేధిస్తానంటూ పది రోజుల గడువు అడుగుతాడు.

ఏ విధంగా ఈ మిస్టరీ చేధిస్తాడోనని అనుకుంటూ వుంటే... ఊరంతా సిసిటివి కెమెరాలు మాత్రం బిగిస్తాడట. ఆ తర్వాతేం చేస్తాడట? అంతే అక్కడ్నుంచి క్లయిమాక్స్‌ వరకు ఓపిగ్గా ఎదురు చూస్తాడన్నమాట. ఆత్మహత్యలు కొనసాగుతూ వుండడంతో ఊళ్లో జనం వెళ్లిపోవాలని డిసైడ్‌ అవుతారు. కానీ తాను అడిగిన పది రోజుల గడువులో ఇంకో రోజు వుంది కనుక రేపు తేల్చేస్తానంటాడు. అప్పటికి ఏదైనా క్లూ దొరికిందా అంటే అదేమీ వుండదు. పది రోజుల టైమ్‌ అడిగాడు కనుక అందాక వేచి చూడాల్సిందే అన్నట్టు అప్పుడు వెళ్లి ఏమి చేయాలా అని మధనపడుతూ వుంటాడు.

ఇక హీరోకి దర్శకుడే ఒకదారి చూపిస్తాడు. అప్పుడు కానీ హీరోకి అసలు రహస్యం ఏమిటో తెలిసిరాదు. సదరు ఆత్మహత్యలకి కారణం ఏమిటి? చనిపోయే ముందు వారికి నెమలి ఎలా కనిపిస్తుంది? తదితర విషయాలని హీరో రివీల్‌ చేసేయడంతో కథ ముగుస్తుంది. కార్తికేయ కంటే బెటర్‌గా తీయాల్సిన చిత్రాన్ని వంశీ 'అన్వేషణ' కాలం నాటి టేకింగ్‌ కంటే తక్కువ స్థాయిలో చిత్రీకరించడం వల్ల ఈ సస్పెన్స్‌ ఏ దశలోను ఆకట్టుకోలేకపోయింది. సస్పెన్స్‌ మెయింటైన్‌ చేయడం కోసమని కొన్ని పాత్రలు అనుమానాస్పదంగా వ్యవహరించడం కామన్‌ టెక్నిక్‌. ఆ బాధ్యత తీసుకున్న సురేష్‌ పాత్రలో లీనమైపోయి, విషయం రివీల్‌ అయిపోయిన తర్వాత, లాస్ట్‌ సీన్‌లో కూడా అనుమానాస్పదంగానే నటిస్తాడు!

చూసేసిన స్టోరీ అయినా కానీ ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, కథనంతో ఈ చిత్రాన్ని ఆస్వాదించేలా చేసి వుండొచ్చు. బడ్జెట్‌ ఎక్కువ లేదనే కారణాన్ని దర్శకుడు సాకుగా చెప్పవచ్చు కానీ ప్రథమార్ధం అంత పాయింట్‌లెస్‌గా తీయడాన్ని కానీ, చివరి సన్నివేశం వరకు మిస్టరీకి సంబంధించిన క్లూస్‌ ఏమీ ఇవ్వకుండా కాలయాపన చేసుకోవడానికి గానీ సాకులు చూపించలేడు. దర్శకుడి సినిమా కావాల్సిన ఈ చిత్రం ఏ దశలోను దర్శకుడి ముద్ర లేక, ప్రేక్షకులనే డైరెక్టర్లని చేసింది (దర్శకుడి ఆలోచనల కంటే సాటి ప్రేక్షకులు బెటర్‌ ఐడియాలు ఇస్తూ వుండడం థియేటర్‌లో అనుభవమైంది). సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలు అవసరమైన ఈ సబ్జెక్ట్‌కి బడ్జెట్‌ కొరత అడుగడుగునా అడ్డుపడింది. సంగీతం, ఛాయాగ్రహణం లాంటివి కూడా ఆకట్టుకోలేకపోయాయి.

సుమంత్‌ తన సహజ శైలిలో నటించాడు. అతని గత చిత్రాలకీ, దీనికీ మధ్య నటుడిగా ఎలాంటి సవాల్‌ ఎదురు కాలేదు. ఈషా రెబ్బా కూడా అంతే. తెరవెనుక నుంచి కానీ, తెరపైన కానీ ఎటువంటి ప్రత్యేకతలు కానీ లేని ఈ చిత్రం ఇంట్రెస్టింగ్‌ ప్లాట్‌ వుండి కూడా తగిన ఎగ్జిక్యూషన్‌ లేక డిజప్పాయింట్‌ చేసింది.

బాటమ్‌ లైన్‌: ఈ ఊళ్లో చూడాల్సినంత విశేషాలేం లేవు!
-గణేష్‌ రావూరి

సినిమా రివ్యూ: కవచం