ఇద్దరూ కొత్త దర్శకులే.. కానీ ఎంత తేడా!

కవచం, సుబ్రహ్మణ్యపురం... ఈ రెండు సినిమాలు ఒకేరోజు థియేటర్లలోకి వచ్చాయి. ఈ రెండు సినిమాలకు ఉన్న సారూప్యత ఏంటంటే.. ఇద్దరూ కొత్త దర్శకులే. కొన్ని పెద్ద సినిమాలకు రచయితగా పనిచేసిన శ్రీనివాస్, కవచంతో దర్శకుడిగా పరిచయమైతే... కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసిన సంతోష్ జాగర్లపూడి సుబ్రహ్మణ్యపురం సినిమాతో దర్శకుడిగా మారాడు.

ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న శ్రీనివాస్, కవచంతో మెప్పించలేకపోయాడు. కేవలం కొన్ని ట్విస్టులు, 2 ఆసక్తికరమైన ఎపిసోడ్స్ మాత్రమే రాసుకొని సెట్స్ పైకి వెళ్లిపోయాడు. ఫలితంగా తొలి సినిమాకే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాడు. కానీ సంతోష్ జాగర్లపూడి పరిస్థితి వేరు.

పక్కాగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. సీన్-బై-సీన్ అల్లుకుంటూ వెళ్లాడు. దర్శకుడిగా అతడికి అనుభవం లేదనే విషయం తెరపైన కనిపిస్తున్నప్పటికీ.. సెకండాఫ్ నుంచి ప్రేక్షకుడ్ని కట్టిపడేయగలిగాడు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ వరకు సస్పెన్స్ కొనసాగించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కార్తికేయ సినిమా ఛాయలున్నాయనే విమర్శల నుంచి మొదటిరోజే బయటపడ్డాడు.

ఇలా ఒకేసారి, ఒకేరోజు వచ్చిన ఇద్దరు దర్శకుల్లో అనుభవం ఉన్నప్పటికీ శ్రీనివాస్ ఫెయిల్ అయితే.. మొదటి సినిమాతోనే సంతోష్ ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా నిన్న కవచం, సుబ్రహ్మణ్యపురం, శుభలేఖలు, నెక్ట్స్ ఏంటి సినిమాలు థియేటర్లలోకి వస్తే.. వాటిలో సుబ్రహ్మణ్యపురం మాత్రమే ఓ మోస్తరుగా ఆకట్టుకుంది.

Show comments