స్టార్ హీరోస్. 60 ప్లస్.. స్టిల్ ఫిట్ గా!

'వాళ్లు ఇంకా కుర్ర హీరోయిన్ల  పక్కన చిందులేస్తూ ఉన్నారు..' అనేది స్టార్ హీరోల విషయంలో ఒక  కంప్లైంట్ లాంటి విమర్శ! అయితే అదే విషయాన్నే మరో కోణం నుంచి చూస్తే.. ‘అరవై యేళ్లు దాటినా వాళ్లి ఇంకా కుర్ర అమ్మాయిల పక్కన జోడీలా కనిపించగలుగుతున్నారు.. డెబ్బై  యేళ్లకు దగ్గరబడ్డా ఇంకా తెరపై హీరోలుగా చలామణి కాగలుగుతున్నారు!

దక్షిణాది స్టార్ హీరోల విషయంలో ఈ రెండు రకాల ధోరణిలోనూ ఆలోచించవచ్చు. తమ మనవరాళ్ల కన్నా కాస్త  పెద్ద వాళ్లైన  అమ్మాయిలతో ఈ హీరోలు చిందులేస్తూ ఉండవచ్చు గాక, అయితే ఆ ఏజ్ కు రీచ్ అయినా ఇంకా తెరపై కుర్రాళ్లుగానే ప్రేక్షకులను భ్రమింపజేస్తూ ఉన్నారంటే.. అది ఆ హీరోల గొప్పదనమే. వాళ్లు స్టార్ లు కావడం స్వయం కృషి, వ్యక్తిగత ప్రతిభ.. అయితే దశాబ్దాలకు దశాబ్దాలు గడిచిపోతున్నా.. ఇంకా వెండితెర మీద మాత్రం వారి వయసు పెరగడం లేదంటే..అందుకు వారు బాడీ ఫిట్ నెస్ ను కాపాడుకోవడం ఒక కారణం అయితే, మిగతాది మేకప్ గొప్పదనం.

అలాంటి కారణాలను ఎన్ని చెప్పినా.. డెబ్బైకి దగ్గర బడ్డ వయసులో కూడా ఇంకా తెర  మీద యాంగ్రీ యంగ్ మ్యాన్స్ గా రాణించడం అంటే మాత్రం మాటలు కాదు. దశాబ్దాలుగా సౌత్ లో స్టార్ హీరోలుగా చలామణి అవుతూ..ఇప్పటికీ అదే హోదాలో కొనసాగుతున్న వారి వయసులను ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం కలగకమానదు.

అందరి కన్నా పెద్దవ్యక్తి రజనీకాంత్!
అరవై ఎనిమిది.. ఇదీ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుత వయసు. మరో రెండేళ్లలో ఆయన డెబ్బై యేళ్లను పూర్తి చేసుకోబోతున్నారు. విశేషం ఏమిటంటే… ఇంకా రెండేళ్ల తర్వాత కూడా రజనీకాంత్ ఒక రోబో  గా కనిపించగలడు, ఒక భాషాగా మ్యాజిక్ చేయగలడు, మరో అరుణాచలాన్ని చూపించగలడు. నిజ జీవితంలో ఎలాంటి మేకప్ లేకుండా కనిపించే రజనీకాంత్ తెర మీద మాత్రం నిండైన మేకప్ తో మొత్తం మారిపోతాడు. అయితే మొత్తం మేకప్ తోనే కథ మారిపోతుందని చెప్పలేం! అరవై ఎనిమిదేళ్ల వయసులో కూడా ఇరవై ఎనిమిదేళ్ల వాడి ఎనర్జీని  తెర మీద చూపాలంటే.. అందుకు చాలా కసరత్తే అవసరం. ఈ వయసులో కూడా అలాంటి ఎనర్జీని చూపుతుండటం రజనీకాంత్ కే సాధ్యం. మరి ఇలాంటి ఎనర్జీనే అతడిని సూపర్ స్టార్ గా చేసిందా, లేక సూపర్ స్టార్ కావడంతో ఆ ఎననర్జీ వస్తోందో మరి!

మమ్ముట్టీ.. వయసెంతో నమ్మగలరా!
రజనీకాంత్  రియల్ పర్సనాలిటీ 68 అనే వయసుకు సూటవుతుంది. అయితే మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టీ  వయసు అరవై ఎనిమిది అంటే నమ్మడం కూడా కష్టమే. తెరమీద అంటే ఎలాగూ మేకప్ తో కవర్ చేస్తారు, బాడీ ముడతలను కనిపించకుండా చేయొచ్చు. అయితే తెర తీశాకా కూడా.. మమ్ముట్టీ ఇంకా నలభై యాభై యేళ్ల వయసు వ్యక్తి మాదిరే కనిపిస్తాడు. గత ఇరవై యేళ్లలో మమ్ముట్టీ రియల్ రూపంలో పెద్దగా మార్పులు కూడా ఏవీ కనిపించవు. తన వయసు గురించి మమ్ముట్టీ చాలా కాలం నుంచినే ప్రస్తావిస్తూ ఉన్నాడు. ‘ఈ వయసులో కండలు పెంచేలా కసరత్తు చేయను..’అంటూ ఎప్పుడో పదిహేనేళ్ల కిందటే మమ్ముట్టీ స్టేట్ మెంట్ ఇచ్చాడు. తనకు వయసు మీద పడిందనే విషయాన్ని అప్పుడే అలా ఒప్పుకున్నాడు. అయితే ఆ తర్వాత మరో పదిహేనేళ్లు గడిచిపోయినా.. మమ్ముట్టీ మాత్రం తన మాయను కొనసాగించగలుగుతూ ఉండటం గమనార్హం. అరవై ఎనిమిదేళ్ల వయసు వ్యక్తులు బయట ఎలా ఉంటారో గమనించి, ఆ తర్వాత మమ్ముట్టీని గమనిస్తే.. తేడా ఏమిటో సుస్పష్టం అవుతుంది!

కమల్ సిక్స్ టీ ఫైవ్ ప్లస్!
గత వారంలోనే అరవై ఐదేళ్ల వయసును పూర్తి చేసుకున్నాడు కమల్ హాసన్. కమల్ హాసన్ ను డైరెక్టుగా చూసిన వాళ్లెవ్వరూ ఆయన అరవై దాటిన వ్యక్తి అని అనుకోలేరు. ఎలాంటి మేకప్ లేకుండా పంచె కట్టుకుని వ్యక్తి ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కమల్ ను చూస్తే.. మహా అంటే యాభై యేళ్ల వ్యక్తిలా గోచరిస్తాడు. అయితే ఆయన రియల్ ఏజ్ మాత్రం అరవై ఐదు దాటింది. తెర మీద ఇరవై ఐదులా కనిపించగల ఎనర్జీ ఇప్పటికీ కమల్ లో కనిపిస్తుంది. బహుశా తన శరీరంతో తెరపై ఏ హీరో చేయనన్ని ప్రయోగాలు చేసిన వ్యక్తి కూడా కమల్ హాసనే. దాదాపు ముప్పై ఐదేళ్ల కిందటే కమల్ వృద్ధుడిలా నటించాడు. ఇప్పుడూ కమల్ అలానే నటిస్టూ ఉన్నాడు భారతీయుడు పార్ట్ టు లో. కాబట్టి నిజ జీవితంలో కమల్ కు వృద్ధుడుగా కనిపించారేమో!

చిరు.. కమల్ కన్నా ఒక ఏడాది చిన్న!
కమల్ హాసన్ ది చాలా ఫ్లెక్సిబుల్ బాడీ అనిపిస్తుంది. అయితే చిరంజీవి అలా కాదు. ఎందుకో చాలా కాలం నుంచినే చిరంజీవి రొమాంటిక్ సీన్లకు దూరంగా ఉంటే మంచిదేమో అనే అభిప్రాయాలు వినిపిస్తూ వచ్చాయి. ‘స్టాలిన్’ సినిమా సమయంలోనే ఆ కామెంట్లు వినిపించాయి. రొమాంటిక్ సీన్ల సంగతేమో కానీ, ‘సైరా నరసింహారెడ్డి’లో చిరంజీవి తన ఎనర్జీ ఏమిటో చూపించారు. అరవై నాలుగేళ్ల వయసులో ముప్పై రెండేళ్ల వ్యక్తి ఎనర్జీని చూపించారు మెగాస్టార్.

హీరోలుగా రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి.. ముగ్గురూ దాదాపు ఒకే సమయంలో కెరీర్ ఆరంభించారు. ముగ్గురూ ఒకే టైప్ హీరోయిజంతో ఇప్పటికీ కొనసాగగలుగుతూ ఉన్నారు. వయసు ప్రకారం చూసుకుంటే.. వీరు ముగ్గురూ ఒకే ఎనర్జీని కనబరుస్తున్నట్టే.

మోహన్ లాల్ 59!
పై హీరోలందరి కన్నా చిన్న వాడే అయినా కొంచెం త్వరగానే సోలో హీరో పాత్రలను వదులుకున్న హీరో మోహన్ లాల్. ఒకవైపు వయసు  మీద పడినందుకు సంకేతంగా ఇతర యంగ్ హీరోల  సినిమాల్లో నటిస్తూనే, అదే సమయంలో తనకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం లాల్ తన సత్తా ఏమిటో చూపిస్తూ ఉన్నాడు. ‘మన్యంపులి’ వంటి సినిమాలో సోలోగా అదరగొట్టాడు. అయితే ఎక్కువగా స్టోరీ బేస్డ్ సినిమాలు చేస్తూ  కూల్ గా కెరీర్ కొనసాగిస్తూ ఉన్నాడు లాల్ కుట్టన్.
బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇదే క్లబ్!

'మన్మథుడు 2' గా కనిపించిన నాగార్జున వయసు అరవై, 'వెంకీ మామ'గా కనిపిస్తున్న వెంకటేష్ ఏజ్ 58, యాభై తొమ్మిదేళ్ల బాలకృష్ణ తన తదుపరి సినిమా స్టిల్స్ లో కొత్త గెటప్స్ లో కనిపిస్తూ ఉన్నారు.  వీళ్లు అరవైకి రీచ్ అయిన వాళ్లు, త్వరలోనే అరవైకి రీచ్ కాబోతున్న వాళ్లు.

ఒకవైపు జనాల ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది, అసహనాన్ని జనాలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు సినిమాల విషయంలో. అయినా అరవై దాటిన, దాటుతున్న వాళ్లు ఇంకా తెరపై మెస్మరైజ్ చేస్తున్నారంటే.. నిస్సందేహంగా చాలా గొప్ప విషయం ఇది. మరి కొన్నేళ్లు కూడా వీరు తెరను ఏలడం కూడా ఖాయమే!  

Show comments