అమెరికా అధ్యక్షుడి కోసం ప్రత్యేకమైన షూ

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట తడబడ్డమే కాదు, నడక కూడా తడబడిన సంగతి తెలిసిందే. ఆయన ఇదివరకే 2 సార్లు తూలిపడ్డారు. అతడి కోసం మెట్ల సైజులో మార్పుచేర్పులు చేశారు. నడిచినప్పుడు పడిపోకుండా ఉండేందుకు ఓ స్పెషల్ ఏజెంట్ ను పెట్టారు.

ఇప్పుడు అధ్యక్షుడి కోసం ఏకంగా కొత్తరకం షూ తయారుచేశారు. దీన్ని "హోకా ట్రాన్స్ పోర్ట్"గా వ్యవహరిస్తారు. మడమ కింద పెద్ద సోల్ కలిగి ఉండడం దీని ప్రత్యేకత. అంతేకాదు, నడిచేటప్పుడు తడబడకుండా ఉండేలా ఈ షూను డిజైన్ చేశారు.

నడిచినప్పుడు దాదాపు 35 శాతం వాలుగా తూలినప్పటికీ, కింద పడకుండా ఈ షూ నివారిస్తుందట. అంతేకాదు.. నడిచేటప్పుడు కాలి పిక్కలకు, పాదాలకు అదనపు బలాన్ని, సౌకర్యాన్ని కూడా చేకూరుస్తుందంట. ఇంకా చెప్పాలంటే ఈ షూ ధరించి నడిస్తే గాల్లో తేలినట్టు ఉంటుందట. "హోకా ట్రాన్స్ పోర్ట్" ధరించి చలాకీగా నడుస్తున్న బైడెన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బైడెన్ కాళ్ల నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారని ఇప్పటికే వైట్ హౌజ్ ప్రకటించింది. దీన్ని సెన్సరీ పెరిఫెరల్ న్యూరోపతిగా వ్యవహరిస్తారు. ఈ ఇబ్బంది ఉన్నవాళ్లు, ఉన్నట్టుండి సడెన్ గా తమ అరికాళ్ల కింద నియంత్రణ కోల్పోతారు. ఇలాంటి వాళ్లకు ఈ "హోకా ట్రాన్స్ పోర్ట్" బాగా ఉపయోగపడుతుందంట.

Show comments