కూతురు పెళ్లి చేసిన రజనీకాంత్

రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ పెళ్లి తతంగం పూర్తయింది. ఈరోజు ఉదయం చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్ లో సౌందర్య-విశాగన్ పెళ్లి పూర్తయింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, నటుడు కమల్ హాసన్ ఈ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి తర్వాత అంతా కలిసి దిగిన గ్రూప్ ఫొటోను మీడియాకు వదిలారు.

అంతకంటే ముందు, నిన్నంతా పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. సంగీత్ తో పాటు మెహందీ ఉత్సవం కన్నులపండువగా జరిగింది. స్వయంగా రజనీకాంత్ సంగీత్ లో స్టెప్పులేయడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. దీని తర్వాత పలువురు ప్రముఖులు, బంధువులకు ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఏర్పాటుచేశారు. అర్థరాత్రి వరకు ఈ వేడుకలు జరగగా, ఈరోజు ఉదయం సౌందర్య-విశాగన్ పెళ్లితో ఒక్కటయ్యారు.

తన పెళ్లికి సంబంధించిన ప్రతి మూమెంట్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్న సౌందర్య, పెళ్లికి సంబంధించిన పిక్స్ ను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. మరికాసేపట్లో పెళ్లికి సంబంధించిన ఎక్స్ క్లూజివ్ ఫొటోల్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయనుంది.

సౌందర్యకు ఇది రెండోపెళ్లి. పదేళ్ల కిందటే పారిశ్రామికవేత్త అశ్విన్ కుమార్ తో ఆమెకు వివాహం జరిగింది. వీళ్లకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. వీళ్లిద్దరూ విడాకులు తీసుకొని దాదాపు రెండేళ్లు అవుతోంది. ఈ గ్యాప్ లో విశాగన్ కు దగ్గరైంది సౌందర్య. దాదాపు ఏడాదిగా వీళ్లిద్దరికీ పరిచయం. పెద్దల అంగీకారంతో ఇప్పుడు పెళ్లితో ఇద్దరూ ఒకటయ్యారు.