తీహార్ జైల్లోకి వెళ్లిన సోనియాగాంధీ!

ఎంతోమంది తమ వ్యతిరేక నేతలను జైళ్లకు పంపించారనే కీర్తి కలిగిన చిదంబరం ఇప్పటికే జైల్లో ఉన్నారు. కొన్నాళ్లుగా ఆయన కేరాఫ్ తీహార్ గా గడుపుతున్నారు. తను తీహార్ జైల్లో ఉన్నా, తన కుటుంబీకులు ట్విటర్ ఖాతాలో తన తరఫున ట్వీట్లు పెడతారని చిదంబరం ప్రకటించారు. తీహార్ జైల్లో ఉంటూ ట్విటర్ వాడటం సాధ్యం కాదు కాబట్టి, ఆయన కుటుంబీకులు ట్విటర్ లో పోస్టులు పెడుతూ ఉంటారట.

ఈ క్రమంలో చిదంబరం ట్విటర్ ఖాతా నుంచి ఆసక్తిదాయకమైన ప్రకటన వచ్చింది. అదేమిటంటే.. ఆయనను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లు పరామర్శించారట. తీహార్ జైలుకు వెళ్లి సోనియాగాంధీ తమ పార్టీ నేతను పరామర్శించిందట. 

మొత్తానికి సోనియాగాంధీ కూడా తీహార్ జైలు మెట్టు ఎక్కినట్టున్నారు. కొన్నేళ్ల కిందట వరకూ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా, దేశాన్ని ఒంటి చేత్తో శాసించిన నేతగా, తమ వ్యతిరేకులను జైలుకు పంపిన చరిత్రను కలిగి ఉన్న సోనియాగాంధీ ఇప్పుడు జైలుకు వెళ్లడం, అది తన ఆప్తుడి పరామర్శకు అయినా ఆసక్తిదాయకమైన అంశమే.

ఇక మన్మోహన్ సింగ్ కు కూడా జైలుకు వెళ్లి పరామర్శలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది పాపం. నాటి రాజకీయంలో అరాజకానికి మన్మోహన్ మౌన సాక్షిగా మాత్రమే నిలిచారు. అయినా పరామర్శలు అయితే తప్పుతున్నట్టుగా లేవు.

Show comments