సోషల్‌ వేధింపులపై పూనమ్‌ కౌర్‌ ఫిర్యాదు

సినీ నటి పూనమ్‌ కౌర్‌పై సోషల్‌ మీడియాలో ఇటీవలి కాలంలో జరుగుతున్న 'ప్రచారం' గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాల పరంగా పూనమ్‌ కౌర్‌ పేరు ఈ మధ్యకాలంలో పెద్దగా విన్పించడంలేదుగానీ, సోషల్‌ మీడియాలో మాత్రం ఆమె పేరు మార్మోగిపోతోంది. ఈ క్రమంలోనే మీడియాలోనూ పూనమ్‌ కౌర్‌ పేరు బాగానే హైలైట్‌ అవుతోంది. తనపై వస్తున్న పుకార్లకు సంబంధించి పూనమ్‌ కౌర్‌ ఇప్పటిదాకా మౌనం దాల్చినా, చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. 

ఎన్నికల సీజన్‌లో పూనమ్‌ - పవన్‌ పేర్లను లింక్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా వీడియోలు పుట్టుకొచ్చేశాయి. పవన్‌ గురించి పూనమ్‌ కౌర్‌ చెప్పిన విషయాలంటూ కొన్ని ఆడియో క్లిప్పింగ్స్‌ కూడా వెలుగులోకి వచ్చాయి. వాటిని ప్రస్తావిస్తూ శ్రీరెడ్డి, పూనమ్‌ కౌర్‌ మీద జాలి చూపించడం, పవన్‌కళ్యాణ్‌ని విమర్శించడం తెల్సిన విషయాలే. అయితే, ఆ ఆడియో టేపుల గురించి కూడా పూనమ్‌ కౌర్‌ ఇప్పటిదాకా స్పందించలేదు. 

50కి పైగా యూ ట్యూబ్‌ ఛానెల్స్‌లో తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారం జరిగిందంటూ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పూనమ్‌ కౌర్‌ పేర్కొనట్లు తెలుస్తోంది. హీరోయిన్లపై సోషల్‌ మీడియాలో ఈ తరహా వీడియోలు ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయాయి. కొందరు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు, ఇంకొందరు వాటిని లైట్‌ తీసుకుంటున్నారు. సినీ ప్రముఖులే కాదు, రాజకీయ ప్రముఖులకీ ఈ తలనొప్పి తప్పడంలేదు. 

రాజకీయ కుట్రల నేపథ్యంలో కొందరు రాజకీయ ప్రముఖులపై ఇలాంటి దుష్ప్రచారాలు జరగడం, ఆయా ప్రముఖుల్ని పోలీసుల్ని ఆశ్రయించడం, విచారణ సందర్బంగా కొందర్ని పోలీసులు అరెస్ట్‌ చేయడం చూస్తూనే వున్నాం. అయినా సోషల్‌ మీడియాలో ఈ తరహా జుగుప్సాకరమైన వీడియోలు, ట్రాలింగ్‌కి మాత్రం అడ్డుకట్ట పడటంలేదు.