దటీజ్ చంద్రన్న: అసెంబ్లీలో ఆట!

ఏపీ ప్రభుత్వ నిస్సిగ్గుతనంలో ఇది మరో చాప్టర్. కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ నేడు ఒక తీర్మానాన్ని చేసి పంపింది ఏపీ ప్రభుత్వం. ఏపీ అసెంబ్లీ వేదికగా ఈ పని జరిగింది. కేంద్రంలోని మోడీ సర్కారు ఏపీకి అన్యాయం చేసిందని, రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని నిరసిస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీ ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించింది.

ఈ తీర్మానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే ప్రవేశపెట్టాడు. ఆయనే సుదీర్ఘంగా ప్రసంగించాడు. బీజేపీకి శాపనార్థాలు పెట్టాడు. ఈ విధంగా సాగింది ఈ వ్యవహారం ఇక్కడ పరాకాష్ట ఏమిటంటే.. ఇదే అసెంబ్లీ కొన్ని నెలల కిందట కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాన్ని పంపించింది. అది ఎందుకో కాదు.. విభజనతో అన్యాయం అయిపోయిన ఏపీకి మోడీ ప్రభుత్వం అద్భుతమైన సహకారం అందించిందని.. ఈ ఆనందాన్ని పట్టలేకపోతున్నామని.. ఇదే చంద్రబాబు నాయుడు.. అదే అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు.

ఇదీ కథ. అప్పుడేమో ధన్యవాద తీర్మానం. ఇప్పుడేమో నిరసన తీర్మానం. అప్పుడూ ఇదే ముఖ్యమంత్రి ఇప్పుడూ అదే ముఖ్యమంత్రి. అప్పుడూ ఇదే రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడూ అదే రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడూ ఇదే కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడూ అదే కేంద్ర ప్రభుత్వం.

మారింది చంద్రబాబు నాయుడు లెక్కలు మాత్రమే. అప్పుడూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహోదాను ఇవ్వలేదు, ఇప్పుడూ హోదాను ఇవ్వలేదు. అప్పుడే హోదా ఇవ్వకపోయినా కేంద్రం సహకారం అద్భుతం అంటూ ధన్యవాద తీర్మానాన్ని పంపించారు. అప్పుడు ఆ నాటకం. ఇప్పుడు ఈ నాటకం. దటీజ్ చంద్రబాబు నాయుడు.

Show comments