సుప్రీంలో శివసేన తుస్సుమనుట ఖాయం!

మహారాష్ట్ర రాజకీయం చిత్రమైన మలుపులు తిరుగుతోంది. ఎన్సీపీకి ఇచ్చిన గడువు ఇంకా ముగియక ముందే.. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయగల పార్టీ లేదు అన్నట్లుగా గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసేయడమూ, దానిని కేంద్ర కేబినెట్ ఆమోదించేయడమూ రాష్ట్రపతి పాలన విధించడమూ కూడా జరిగిపోయింది. ఇక ఉత్తర్వులు లాంఛనం. అయితే ఈలోగా.. భాజపాకు మూడురోజుల గడువు ఇచ్చి తమకు మాత్రం ఒకే రోజు గడువు ఇవ్వడం.. గవర్నర్ చేసిన తప్పిదం అంటూ శివసేన సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే.. ఈతరహా వాదనతో ఆ పార్టీ నెగ్గే అవకాశం మాత్రం కనిపించడం లేదు.

అక్టోబరు నెల 21న మహా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. నిజంగా అధికారంలోకి రాగలిగినంత బలం ఉన్న పార్టీ ఏదైనా ఉంటే.. వారికి ఆ మాత్రం బలాన్ని కూడగట్టుకోవడానికి ఇరవై రోజులు అవసరం లేదు. ఎప్పుడో సమీకరణ పూర్తయి ఉండేది. ఆ బలం ఉన్నవారెవ్వరూ తమంతగా గవర్నరును సంప్రదించకపోవడంతో... ఆయన పాతప్రభుత్వపు కాలం చెల్లే సమయానికి, అతిపెద్ద పార్టీ భాజపాను ఆహ్వానించారు.

శివసేన మంకుపట్టు వల్ల వారు ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. శివసేనకు ఛాన్సు వచ్చింది గానీ.. కాంగ్రెస్ ఎన్సీపీల మద్దతు కూడగట్టడంలో వారు విఫలమయ్యారు. నిజానికి వారు ఫలితాలు వచ్చిన నాటినుంచే.. అనధికారిక మంతనాల్లో ఉన్నారు. కానీ గడువు సమయానికి కూడా అవి తేలలేదు. చివరికి ఎన్సీపీకి చాన్సు ఇచ్చి ఈలోగా ప్రెసిడెంట్ రూల్ కు సిఫారసు చేశారు.

అయితే.. తమకు గడువు ఇవ్వలేదనే వాదనతో సుప్రీంకు వెళ్తే పెద్ద లాభం ఉండదు. ఎక్కువ రోజులు గడువు ఇవ్వడం వలన బేరసారాలు, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు అవకాశం ఇచ్చినట్లవుతుందనే వాదన తెరపైకి వస్తే.. ఇక శివసేన గోడు ఎవ్వరూ పట్టించుకోరు. 

Show comments