సిక్కోలుని చిదిమేస్తున్న పొలిటికల్‌ తుపాను

తమిళనాడులో భారీవర్షాల కారణంగా వరదలు పోటెత్తితే, మహానగరం చెన్నయ్‌ నీట మునిగిపోయింది. రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ తమిళనాడు పట్ల ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలూ చేయూతనందించాయి. సినీ ప్రముఖులూ ముందుకొచ్చి, సాయం చేశారు. అలా, పెను విపత్తు నుంచి తమిళనాడు త్వరగానే బయటపడగలిగింది. కేరళలో ఇటీవల జలవిలయం సంభవిస్తే, వివిధ దేశాలూ సానుభూతి వ్యక్తం చేశాయి. ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చాయి.

కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా.. కేరళ వరదల పట్ల సానుభూతి వ్యకమయ్యింది. ఇక్కడా, రాజకీయం హుందాగానే వ్యవహరించింది. బాధితుల ఆర్తనాదాల్ని చూసి, దేశం విలవిల్లాడింది.. తమకు తోచిన రీతిలో సాయం చేసింది. సినీ ప్రముఖులు ఇక్కడా, తమవంతు బాధ్యతగా విరాళాలతో కేరళ వరద బాదితులకు అండగా నిలిచారు.

ఈసారి విలయం ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్రని వణికించింది. విసిరివేయబడ్డట్లుగా వుండే శ్రీకాకుళం జిల్లా నెత్తిన 'తిత్లీ తుపాను' పిడుగులా పడింది. ఉద్దానం సర్వనాశనమైపోయింది. తిత్లీ తుపాను బాధిత ప్రాంతాల్లో బాధితులకు కంట్లో నీరు తప్ప, తాగడానికి నీరు లేని దుస్థితి.

కానీ, ఇక్కడ రాజకీయం వికటాట్టహాసం చేస్తోంది. ప్రభుత్వం పబ్లిసిటీకే పరిమితమవుతోందన్న విమర్శలు మామూలే. మరి, విపక్షాలు తమవంతు బాధ్యత నిర్వహిస్తున్నాయా.? అంటే, ఆ జాడే కన్పించడంలేదు. ముఖ్యమంత్రి, తుపాను బాధిత ప్రాంతంలోనే వుండి పరిస్థితిని పర్యవేక్షిస్తోంటే, అధికారులు ఆయన చుట్టూ చక్కర్లు కొడ్తున్నారు తప్ప, బాధితుల్ని ఆదుకోవడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రతిపక్ష నేత కూడా ఉత్తరాంధ్రలోనే వున్నారు. తుపాను కారణంగా తన పాదయాత్రను ఓ రోజు వాయిదా వేసుకున్న ప్రతిపక్ష నేత, ఇంకో రోజు ఆ యాత్రని వాయిదా వేసుకుని, బాధిత ప్రజానీకం వద్దకు వెళ్ళి, వారికి భరోసా కల్పించి వుంటే బావుండేదేమో.!

ఇక, ఉత్తరాంధ్ర అంటే తనకు ఎనలేని మమకారం అని చెప్పుకునే సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌.. తనకు సినీ పాఠాలు నేర్పిన ఉత్తరాంధ్ర విలవిల్లాడుతుంటో, 'చుట్టపు చూపు' కింద అయినా అక్కడికి వెళ్ళడానికి సాహసించకపోవడం ఆశ్చర్యకరం.

కాంగ్రెస్‌ పార్టీ గురించో, ఇంకో పార్టీ గురించో.. మాట్లాడుకునే పరిస్థితులూ లేవు. సినీ ప్రముఖుల్లో సంపూర్ణేష్‌బాబు అందరికన్నా ముందు స్పందించాడు. ఏమో, ముందు ముందు మిగతా సినీ ప్రముఖులూ స్పందిస్తారేమో.!

ఒక్కటి మాత్రం నిజం.. ఉత్తరాంధ్రపై 'చిన్నచూపు' ఇంకా కొనసాగుతూనే వుంది. సిక్కోలు ఓ మూలకు విసిరివేయబడ్డ ప్రాంతమని మరోమారు నిరూపితమయ్యింది. తమ కష్టం పగడవాడిక్కూడ రాకూడదనీ.. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులూ.. ఎవరూ తమ గోడు పట్టించుకోవడంలేదనీ.. పొరుగు రాష్ట్రాలపై చూపే మమకారంలో సగం మమకారం తమ మీదా చూపాలని సిక్కోలు ప్రజలు కంటతడి పెడుతున్నారు.

తుపాను కంటే, ఈ వివక్ష తమను మరింత ఆవేదనకు గురిచేస్తోందని వాపోతున్నారు.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

Show comments