సిగ్గు సిగ్గు.. తెలంగాణ ఎన్నికల్లో ‘పచ్చ’దొంగలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలూ గట్టిగానే ఖర్చు చేశాయ్‌. ఇందులో ఇంకోమాటకు తావులేదు. కానీ, ఖర్చుపెట్టినా ఫలితం రాకపోతే.. ఆ బాధ వర్ణనాతీతం. తెలుగుదేశం పార్టీ పరిస్థితి అదే ఇప్పుడు. దాదాపు వెయ్యి కోట్లదాకా తెలంగాణలో ఎన్నికల కోసం చంద్రబాబు ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి గట్టిగానే విన్పించాయి. ఎన్నికల ప్రచార సమయంలో. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ కూడా ఇవే ఆరోపణలు చేసింది.

సరే, 1000 కోట్లు ఖర్చు చేశారా.? అందులో సగం.. అంటే 500 కోట్లు ఖర్చు చేశారా.? లేదంటే, వెయ్యికోట్ల కంటే ఎక్కువ ఖర్చయ్యిందా.? అన్నది వేరే విషయం. కానీ, ఖర్చయిన సొమ్ము ఏమయ్యింది.? ఎటు వెళ్ళిపోయింది.? ఎందుకు ఆ డబ్బు, ఎన్నికల్లో గెలుపు కోసం ఏమాత్రం ఉపకరించలేకపోయింది.? ఇదే ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళ ఆందోళన.

మొత్తం 13 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీచేసింది. ఆ 13 నియోజకవర్గాల్లో చాలా ఎక్కువగా ఖర్చుచేసిన టీడీపీ, మిత్రపక్షం కాంగ్రెస్‌ కోసం మిగతా నియోజకవర్గాల్లోనూ ఎంతోకొంత డబ్బు వెదజల్లిన మాట వాస్తవం. ఖమ్మం జిల్లాలో ప్రజాకూటమి ఫర్వాలేదన్పించింది. అక్కడే టీడీపీకి కూడా రెండు సీట్లు వచ్చాయి.

కానీ, డబ్బు వెదజల్లిన నియోజకవర్గాల్లో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌నగర్‌ ముందంజలో వున్నాయని తెలుగు తమ్ముళ్ళే ఆఫ్‌ ది రికార్డ్‌గా చెబుతున్నమాట. మరి, ఆ డబ్బులు ఏమైపోయాయట.? చంద్రబాబు ప్రచారం కోసం జనాన్ని బాగానే తీసుకొచ్చారు.

బాలయ్య వెంట కూడా జనాన్ని బాగానే తిప్పారు. ఈ క్రమంలో కిందిస్థాయి కార్యకర్తలు (వీరిలో కులాభిమానం వున్నవారే ఎక్కువ) సొంతంగా ఖర్చు చేశారు కూడా. కానీ, మధ్యస్థాయి నేతలు 'పచ్చనోట్లను' గట్టిగానే మేసేశారట. అదీ అసలు సమస్య.

కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలో బాలకృష్ణ రోడ్‌ షోలు చేసినప్పుడు, జనం ఒకింత పలచగా కన్పించారు. కానీ, ఆ టూర్‌ కోసం భారీగా ఖర్చు చేసింది పార్టీ. అంటే, ఇక్కడ 'మేత' బాగా పనిచేసిందనీ, బాలయ్య ఇమేజ్‌ డ్యామేజీ అయ్యిందని అర్థం చేసుకోవాలన్నమాట.

'ఖమ్మంలో డబ్బులు బాగానే ఖర్చుచేశారు గానీ, పంపకాల్లో దోపిడీ ఎక్కువైపోయింది.. చేరాల్సిన చోటకి చేరలేదు.. మధ్యలోనే మాయమైపోయాయ్‌..' అంటూ ఖమ్మం జిల్లాకి చెందిన టీడీపీ వీరాభిమాని ఒకరు తన సన్నిహితుల దగ్గర చెప్పుకుని వాపోతున్నాడిప్పుడు.

కూకట్‌పల్లిలో కూడా ఇదే జరిగిందట. మామూలుగా అయితే, ఇలాంటి 'మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌' విషయంలో టీడీపీకి ఘనచరిత్రే వుంది. కానీ, 'మేత'కి అలవాటు పడ్డ తమ్ముళ్ళు, సొంత పార్టీనే దోచేయడం కూడా తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణమన్నది 'టీడీపీ అభిమానులే' ఒప్పుకుంటుండడం గమనార్హం.

Show comments