దేవదాస్ లో మిస్ అయింది.. జెర్సీలో దక్కింది

దేవదాస్ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందు మేటర్ ఇది. ఆ టైమ్ లో శ్రద్ధా శ్రీనాధ్ అనే ముద్దుగుమ్మ పేరు గట్టిగా వినిపించింది. నాగార్జున సరసన ఆ కన్నడ బ్యూటీని హీరోయిన్ గా తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ ఆ స్థానంలో ఆకాంక్ష సింగ్ వచ్చి చేరింది. 

కట్ చేస్తే, ఇప్పుడు మరోసారి శ్రద్ధా శ్రీనాథ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఈసారి నాగార్జున స్థానంలో నాని ఉన్నాడు. సినిమా పేరు జెర్సీ. అవును.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాధ్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. రేపోమాపో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. 

ఈ సంగతి పక్కనపెడితే, అసలు శ్రద్ధా శ్రీనాద్ ఎవరనే విషయాన్ని ఓసారి చూద్దాం. కన్నడలో వచ్చిన సూపర్ హిట్ మూవీ యూటర్న్ సినిమాలో లీడ్ రోల్ పోషించిందీమె. ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ కు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఆ పాత్రనే తెలుగులో సమంత చేసింది. 

తర్వాత కన్నడలో వచ్చిన ఆపరేషన్ అలమేళమ్మలో కూడా శ్రద్ధ నటనకు అవార్డుల పంట పండింది. ఇక సూపర్ హిట్ అయిన విక్రమ్ వేధలో శ్రద్ధా యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇలా పాత్రలకు ప్రాధాన్యం ఉండే సినిమాలు మాత్రమే సెలక్ట్ చేసుకుంటోంది ఈ భామ.

అందుకే దేవదాస్ వదులుకుంది. ఇప్పుడు జెర్సీ సెలక్ట్ చేసుకుంది. కన్నడ, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఈ నటి, జెర్సీ సినిమాతో తెలుగులో అడుగుపెడుతోంది. దసరా నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది జెర్సీ.

Show comments