బాబుకు షాక్.. మీటింగ్ కు డుమ్మాకొట్టిన తమ్ముళ్లు

ఓవైపు ప్రజావేదికను కూల్చేస్తుంటే.. మరోవైపు తన స్టయిల్ లో హంగామా చేసేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు. తన పార్టీకి చెందిన కీలకమైన నేతలతో ప్రజావేదిక పక్కనే ఉన్న తన నివాసంలో సమావేశమయ్యారు. దీనికి తన అనుకూల మీడియాతో కీలక సమావేశం అనే కలరింగ్ కూడా ఇచ్చుకున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. బాబు ఒకటి తలిస్తే అక్కడ ఇంకోటి జరిగింది.

అవును.. అర్జెంట్ మీటింగ్ అంటూ బాబు కబురుపెడితే చాలామంది ఆ సమావేశాన్ని లైట్ తీసుకున్నారు. పైకి ఏదో చూపిస్తారు, సమావేశానికి వెళ్లిన తర్వాత అక్కడేం జరుగుతుందనేది నేతలందరికీ తెలుసు. వాళ్ల నోళ్లు కట్టేసి, బాబు ఏదేదో మాట్లాడుకుంటూ పోతారు. ఆ సోది మీటింగ్ కు వెళ్లడం దండగని భావించి చాలామంది డుమ్మాకొట్టారు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది.

కొంతమంది నేతలు ఏవేవో కారణాలు చెప్పి మీటింగ్ ను తప్పించుకున్నప్పటికీ, మరికొంతమంది మాత్రం కావాలనే ఈ సమావేశాన్ని పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా బాబు దేశంలో లేనిటైమ్ లో సీక్రెట్ గా సమావేశం ఏర్పాటుచేసుకున్న కాపు నేతలు, మరికొందరు ఇతర ముఖ్యనేతలు ఈరోజు బాబు పెట్టిన సమావేశానికి వెళ్లలేదు.

కాకినాడలో కొన్ని రోజుల కిందట సమావేశమై.. పార్టీ మారే అంశంపై చర్చించిన బోండా ఉమ, తోట త్రిమూర్తులు లాంటి నేతలంతా ఈరోజు చంద్రబాబు సమావేశానికి హాజరుకాలేదు. వీళ్లంతా పార్టీ మారేఉద్దేశంలో ఉన్నారు. పైగా బాబు లేని వేళలో మీటింగ్ పెట్టుకున్నారు. ఆ అంశాన్ని బాబు లేవనెత్తే అవకాశం ఉండడంతో, ఎందుకొచ్చిన తలనొప్పి అనే ఉద్దేశంతో వీళ్లు గైర్హాజరైనట్టు తెలుస్తోంది.

ఇప్పటికే నలుగురు ఎంపీలు టీడీపీకి దూరమయ్యారు. తాజాగా అంబికా కృష్ణ కూడా కండువా మార్చారు. ఇప్పుడు ఈ కాపు సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడితే అది చంద్రబాబుకు మరింత నష్టాన్ని మిగులుస్తుంది. అక్రమంగా కట్టిన ప్రజావేదికను కూల్చినందుకు నిరసనగా సమావేశం ఏర్పాటుచేసి హంగామా చేయాలనుకున్న చంద్రబాబుకు.. ఆ పార్టీ నేతలు ఇలా ఝలక్ ఇచ్చారు. 

తెలుగుదేశం కథ ముగిసిందా?.. బడాయికి పోతున్న బీజేపీ