శివసేన.. రెంటికీ చెడ్డ రేవడీ అవుతుందా?

కేవలం ముఖ్యమంత్రి పదవే లక్ష్యంగా శివసేన పావులు కదిపింది. బీజేపీతో కలిసి ప్రజలు ఆ పార్టీకి కనీస మెజారిటీని ఇచ్చారు. బీజేపీ వాళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడానికి ససేమేరా అన్నారు. తమకు దక్కితే ముఖ్యమంత్రి పదవి  కావాలి లేకపోతే అధికారం అక్కర్లేదన్నట్టుగా బీజేపీ సైడైపోయింది.

బీజేపీ, శివసేనలు రెండూ సీఎం పదవినే లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే శివసేన అందు కోసం కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలపడానికి కూడా వెనుకాడటం లేదు. దూకుడుగా ముందుకు వెళ్లిపోయింది ఆ పార్టీ.
అయితే తీరా ముందుకు వెళ్లాకా కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం అవుతుందనేది శివసేనను ఇబ్బంది పెడుతూ ఉంది. ఎన్సీపీ అంటే మరాఠా పార్టీ. ఇన్నేళ్లూ ఆ పార్టీతో వైరమే ఉన్నా, ఏదో మరాఠా అంటూ చేతులు కలపడాన్ని శివసేన సమర్థించుకోగలదు.

కాంగ్రెస్ మాత్రం జాతీయ పార్టీ. శివసేన వ్యతిరేక పార్టీ. కాంగ్రెస్ విధానాలను సేన కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే ఎన్సీపీ వాళ్లు ఇప్పుడు కొత్త వాదనలతో రెడీ అయ్యారు. బీజేపీ కూడా పీడీపీ వంటి పార్టీతో జత కట్టిందని, దాంతో పోలిస్తే తాము చేసేది పాపం కాదని సేన వాళ్లు అంటున్నారు.

అయితే ఇంతకు తెగించినా.. శివసేన వాళ్లకు ఇంకా భరోసా లేదు. కోరుకున్న సీఎం పదవి దక్కుతుందనే నమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు గనుక తేడా వస్తే.. శివసేన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడీ అవుతుంది. ఇప్పటికే తన దూకుడైన తీరుతో ఎన్డీయే నుంచి కూడా బయటకు వచ్చినట్టుగా సేన ప్రకటించేసింది!

Show comments