ఎమ్బీయస్‌: శివసేన అత్యాశ

మహారాష్ట్రలో సంక్షోభానికి ప్రధాన కారణం - శివసేన అత్యాశ, అతి తెలివి! 288 సీట్ల అసెంబ్లీలో దానికి వచ్చినది 56, అనగా 19% సీట్లు! 105 అనగా 36% తెచ్చుకున్న బిజెపితో సమానస్థానం కావాలని పట్టుబట్టింది. సిఎం పదవి రొటేషన్‌లో కావాలంది. (అది ఒప్పుకుని ఉంటే తనవాళ్లే ముందు సిఎం కావాలని అడిగేదేమో) అదేమంటే ఎన్నికలకు ముందు దానికి అంగీకరించారని వాదించింది. బిజెపి లొంగలేదు. దానితో ఎన్సీపీ, కాంగ్రెసులను ఆశ్రయించింది. వాళ్లతో కలవడానికి దీనికి యిబ్బందులున్నాయి. దీనితో కలవడానికి వాళ్లకి యిబ్బందులున్నాయి. మొత్తానికి ఏవో తంటాలు పడి ఓ దశకు వచ్చారు. ఈలోగా బిజెపి జెల్ల కొట్టింది. ఎన్సీపీని చీల్చలేక అజిత్‌ పవార్‌ మధ్యలో చేతులెత్తేసే పరిస్థితి వస్తే గవర్నరు అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు పిలవవచ్చు. లేక యీ సేన-ఎన్సీపీ-కాంగ్రెసు అతుకుల బొంతను పిలిస్తే అదిఎన్నాళ్లు నడుస్తోందో దేవుడికే తెలియాలి.

బిజెపి-శివసేన మహాయుతికి ప్రజామోదం లభించింది. ఇద్దరికీ కలిపి 55% సీట్లు వచ్చాయి. ఏ ఉప ముఖ్యమంత్రి పదవో తీసుకుని హాయిగా ఐదేళ్లు కాలక్షేపం చేయకుండా శివసేన ఎందుకింత రిస్కు తీసుకుందో తెలియాలంటే దాని యిబ్బందేమిటో అర్థం చేసుకోవాలి. దాని కంటె ముందు అందరికీ వచ్చే సందేహం - 50-50 అని బిజెపి ఒప్పుకుందా, లేదా అని. శివసేన ఏకంగా అంత అబద్ధమాడుతుందా? అని. ఉద్ధవ్‌ చాలా గట్టిగా చెపుతున్నాడు. అమిత్‌ షా ఒప్పుకున్నాడు అని, దేవేంద్ర ఫడణవీస్‌ అక్కడే ఉన్నాడు అని. బిజెపి అతని మాట కొట్టేయడంతో అతనికి చాలా కోపం వచ్చింది, నన్ను అబద్ధాలకోరు అంటారా అని. దేవేంద్ర ఎంత మంచి మిత్రుడైనా అతని ఫోన్లు ఎత్తడం మానేశాడు. 

మరి దేవేంద్ర ఏమంటున్నాడు? ఒప్పందంలోని అంశాలను సరైన సమయంలో బయటపెడతాను అన్నాడు. ఆ ఘడియ యింకా రాలేదు. అమిత్‌ చూస్తే 'ఎన్నికల సభల్లో దేవేంద్రే సిఎం అని చెప్పాం కదా, అప్పుడు కాదనలేదే' అని వాదిస్తున్నాడు. స్విస్‌ బ్యాంకుల నుంచి తలా 15 లక్షల మాట అడిగినప్పుడు అతనే 'ఎన్నికల మాటలు (జుమ్లా బాత్‌) పట్టించుకోనక్కరలేదు' అని గతంలో చెప్పాడు. దేవేంద్రకున్న పలుకుబడి రీత్యా అలా చెపుదాం అనుకుని ముందు అనుకున్నారేమో తెలియదు. ఎన్నికల్లో గెలిచిన సీట్లలో సేన- బిజెపి సీట్ల నిష్పత్తి 1:1.9 ఉంది. ఎన్నికల ముందు కూడా ఆ నిష్పత్తి అలాగే ఉంది. అంటే దాదాపు రెట్టింపు అన్నమాట. అలాటప్పుడు సేన 1:1 నిష్పత్తిలో పదవులు ఎలా అడగగలదు? అంటే ఉద్ధవ్‌ అబద్ధమాడుతున్నట్లేనా? అయితే యింత రిస్కు తీసుకుని 30 ఏళ్ల పొత్తును వదులుకుంటాడా? అతను అబద్ధమాడటం లేదని అనుకుని ఆలోచించి చూస్తే ఒకటి తడుతుంది. 

దేవేంద్ర ఫడణవీస్‌, మోదీ హవాలు జమిలిగా మహారాష్ట్రను ఊపేస్తాయని మీడియా ఊదరగొట్టింది. మీడియా క్షేత్రస్థాయి వాస్తవాలను గమనించకుండా ఐనా రాసి ఉండాలి, లేదా మోదీ చేత ప్రభావితమైన పబ్లిషర్ల కోరిక మేరకు రాసి ఉండాలి. లేకపోతే మహారాష్ట్ర, హరియాణా రెండిటిలోనూ అంచనాలు అంత ఘోరంగా తప్పి వుండవు. తమకు పాజిటివ్‌ వేవ్‌ సృష్టించడానికి పైకి యిలా ఊదరగొట్టిస్తూన్నా, పరిస్థితులు అంత బాగా లేదని బిజెపికి అంతర్గతంగా తెలిసే ఉండాలి. అందుకే శివసేనతో ఎన్నికల పొత్తు పెట్టుకుంది. ఆ పొత్తు బిజెపి అధినాయకత్వానికి రుచించలేదని, అయినా దేవేంద్రే పట్టుబట్టి ఒప్పించాడనీ ఫీలర్లు వదిలారు, కానీ శివసేన పొత్తు లేకపోతే గట్టెక్కలేమని గ్రహించే అమిత్‌ ఉద్ధవ్‌ యింటికి వెళ్లాడు. ఇన్నాళ్లూ ఠాక్రే కుటుంబం కింగ్‌ మేకర్లుగా ఉండడానికే యిష్టపడుతూ వచ్చింది. అయితే ఉద్ధవ్‌ కొడుకు ఆదిత్య కింగ్‌ అవుదామని ముచ్చటపడ్డాడు. అతనికి తల్లి మద్దతు ఉంది. తల్లీ-కొడుకు ప్రోద్బలంతోనే ఉద్ధవ్‌ సగకాలమైనా ముఖ్యమంత్రి పదవి కావాలని అడిగి ఉంటాడు. దానికి తోడు మరో కారణం కూడా ఉంది.

శివసేన-బిజెపిల మధ్య సంబంధాలు చిత్రంగా మారుతూ వచ్చాయి. 'మహారాష్ట్ర మరాఠీలకే' అనే నినాదంతో శివసేన ప్రారంభమైంది. దక్షిణాది వారికి, కార్మిక యూనియన్లకు వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు చేసేది. అప్పుడు వాళ్లు హిందువులా, ముస్లిములా అనేది లెక్కలోకి తీసుకోలేదు. ఉడిపి హోటళ్ల మీద, తమిళుల మీద భౌతికపరమైన దాడులు జరిగేవి. వాళ్లంతా హిందువులే. వీళ్లు వచ్చి మా ఉద్యోగాలు కాజేశారు, వ్యాపారాలు పెట్టి మా అవకాశాలు కొట్టేశారు అని ఆరోపించి వాళ్లను చావగొట్టేవారు. దక్షిణాది వాళ్లు తీసిన హిందీ సినిమాలు బొంబాయిలో ఆడనిచ్చేవారు కారు. సేనకు బొంబాయి నగరంలోనే పట్టుండేది. తక్కిన నగరాలకు, పట్టణాలకు విస్తరించాలనుకునేటప్పుడు అక్కడ మరాఠీయేతరులు పెద్దగా వుండరు కాబట్టి వేరే నినాదం కావలసి వచ్చింది. 

అప్పట్లో హిందూత్వ నినాదం ఊపందుకుంటోంది. విపి సింగ్‌ మండల్‌ రాజకీయాలను ఎదుర్కోవడానికి బిజెపి కమండల్‌ పట్టింది. బాల ఠాక్రే 'హిందూ హృదయ సామ్రాట్‌' బిరుదు ధరించి బిజెపితో చేతులు కలిపాడు.  ఇప్పటికీ కాస్తకాస్తగా మరాఠీ మానుస్‌ అని అంటూనే ఉన్నా, హిందూత్వ పార్టీగా ముద్ర వేయించుకున్నాడు. ఆర్టికల్‌ 370, ఉమ్మడి పౌరస్మృతి, పౌరసత్వ జాబితా, ముమ్మారు తలాక్‌, అయోధ్య.. యిలా ఏది తీసుకున్నా బిజెపిదీ, దానిదీ ఒకటే సిద్దాంతం. అందుకే అది 30 ఏళ్లపాటు దానితో కలిసి ఉండగలిగింది. అయితే 2012లో బాల ఠాక్రే బతికి ఉన్నంతకాలం మహారాష్ట్రలో సేనది ప్రథమస్థానం, బిజెపిది ద్వితీయ స్థానం. ఉద్ధవ్‌ నాయకుడయ్యాక, తండ్రి అంత బలమైన నాయకుడు కాదని పేరు బడ్డాక, యిటు మోదీ-అమిత్‌ ద్వయం ఎదుగుతున్నకొద్దీ అన్నాతమ్ముళ్ల స్థానాలు తారుమారయ్యాయి. 2014 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి తమకు ఎక్కువ స్థానాలు కావాలంది.  ఉద్ధవ్‌ కొడుకు ఆదిత్య అడ్డుపడి అలా కుదరదన్నాడు. 

విడివిడిగా పోటీ చేస్తే బిజెపికి 122, సేనకు 63 వచ్చాయి. ఎవరికీ పూర్తి మెజారిటీ రాలేదు. మోదీ ప్రభావం పార్లమెంటుకే పరిమితమని గ్రహించిన బిజెపి సేనను కలిసి రమ్మనమని ఆహ్వానించింది. గునుస్తూనే సేన వచ్చి చేరింది. చేరిందన్నమాటే కానీ తరచుగా ఫిర్యాదులు చేస్తూనే ఉంది. కలహాల కాపురం ఐదేళ్లూ సాగింది కానీ దీనివలన సేన నష్టపోసాగింది. 2017లో ముంబయి కార్పోరేషన్‌ ఎన్నికలలో బిజెపి, సేనతో సమానసంఖ్యలో సీట్లు తెచ్చుకుంది. కేంద్రంలో ప్రధాని కార్యాలయం సర్వాధికారాలతో పెత్తనం సాగించినట్లే, రాష్ట్రంలో దేవేంద్ర ఆఫీసు మంత్రులను నిర్లక్ష్యం చేసి, అధికారం చెలాయించింది. ఇది సేనను కలవరపరిచింది. ముంబయి ఆర్థికవ్యవస్థలో గుజరాతీలదే సింహభాగం. యజమానులు గుజరాతీలు, ఉద్యోగులు మరాఠీలు. అందువలన గుజరాతీలంటే మరాఠీలకు అసూయ, కడుపుమంట. గతంలో బిజెపి నాయకత్వం వాజపేయి, ఆడ్వాణీ చేతిలో ఉండగా ఫర్వాలేకపోయింది కానీ యిప్పుడు మోదీ, అమిత్‌ యిద్దరూ గుజరాతీలే. వాళ్ల చుట్టూ ఉన్నది గుజరాత్‌ లాబీయే! 

ఇవన్నీ సాధారణ శివసైనికుడిగా మింగుడు పడకుండా ఉన్నాయి. బిజెపితో పొత్తు కొనసాగిస్తే తమ హిందూత్వ ఓటు బ్యాంకు పూర్తిగా వాళ్ల సొంతమే అయిపోతుందని, తాము ఎప్పటికీ వాళ్లకు సెకండ్‌ ఫిడిల్‌ వాయిస్తూనే ఉండాలని వాళ్ల బాధ. బిజెపి భాగస్వాములను క్రమేపీ మింగేస్తూ వస్తోందని, తమ పరిస్థితి నానాటికీ తీసికట్టు అవుతుందనీ శివసేన నాయకత్వం ఘోష. 2019 అసెంబ్లీ ఎన్నికలలో విజయానికి బిజెపికి తమ అవసరం ఉంది కాబట్టి వాళ్లని వంచడానికి యిదే అదనని భావించింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర తన కార్యాలయం ద్వారా తమను కట్టడి చేశాడు కాబట్టి, యీసారి తామే ఆ పదవి తీసుకుని, రాష్ట్రంలో బిజెపి ఎదుగుదలకు అవరోధాలు  కల్పించాలని భావించింది. ఈ లెక్కలతోనే ఆదిత్య ఠాక్రే, 2019 అసెంబ్లీ ఎన్నికల సమయానికి పట్టుబట్టాడు - నేను ముఖ్యమంత్రి లేదా ఉపముఖ్యమంత్రి కావాల్సిందే, మనకు హోం యిత్యాది ముఖ్యమైన శాఖలు యివ్వాల్సిందే అని. ఉద్ధవ్‌కు అనారోగ్యం. బయట తిరగలేడు. ఆదిత్యే రాష్ట్రమంతా పర్యటించి, శివసైనికులను ఉత్సాహపరిచాడు. ఈసారి అధికారం మనదే అంటూ. 

ఇవన్నీ తెలిసి కూడా బిజెపి నాయకత్వం సేనతో ఒప్పందానికి సిద్ధపడింది. ఎందుకంటే సొంతంగా పోటీ చేసే సత్తా తమకు లేదని వాళ్లకు అంతర్గతంగా తెలుసు. ఎన్నికల తర్వాత చూసుకోవచ్చు, తమలో సగం బలం ఉన్న వీళ్లు తమనేం ఆడిస్తారు అనుకున్నారు. పైగా ఎన్సీపీ, కాంగ్రెసులను కేసులతో, ఫిరాయింపులతో చితక్కొట్టేశాం కాబట్టి వాళ్ల సాయంతో శివసేన అధికారంలోకి రావడం కల్ల అనే అంచనాతో సరేననేసి ఉంటారు.  లేదా కట్నాల బేరసారాలలో జరిగేట్లుగా కాదనకుండా 'చూద్దాం లెండి' అని ఉంటారు. అందుకే తమ మధ్య కుదిరిన ఒప్పందం గురించి యిప్పుడు పెదవి విప్పటం లేదు. ఏది ఏమైతేనేం, ఫలితాలు వచ్చాయి. బిజెపికి, సేనకు గతంలో కంటె ఎక్కువ సీట్లు రాకపోగా తగ్గాయి. సేనకు 7 తగ్గితే, బిజెపికి ఏకంగా 17 తగ్గాయి. బిజెపిని వంచడానికి యిదే సమయం అనుకుంది సేన. అందుకని 50-50 ఒప్పందం గురించి బాహాటంగా డిమాండ్‌ చేయసాగింది.

సహజంగా యిది బిజెపి క్యాడర్‌కు నచ్చలేదు. సేనకు బుద్ధి చెప్పే తరుణమిదే అనుకున్నారు. దేవేంద్ర తనే ఐదేళ్లూ ముఖ్యమంత్రినని ప్రకటించుకున్నాడు. సేనకు ఏమిస్తారో చెప్పలేదు. ఈ పరిస్థితిని రాష్ట్రంలో నాయకులందరూ ముందే ఊహించారు. అందుకే ఫలితాలు రాగానే అమిత్‌ షా తమను గమనిస్తూ ఉంటాడని తెలిసి, శరద్‌ పవార్‌ సేన ముఖ్యనేత సంజయ్‌ రవుత్‌ను రహస్యంగా ఓ కారులో కలిసి, ముఖాముఖీ 45 ని.ల పాటు చర్చించాడట. బిజెపిని వదిలి వచ్చేస్తే, తాము సాయపడతామని అన్నాడట. అందుకే ఉద్ధవ్‌ 50-50పై అంత ధాటీగా మాట్లాడి బిజెపితో వ్యవహారం చెడగొట్టుకున్నాడు. ఆ తర్వాత శరద్‌ రంగంలోకి దిగాడు కానీ సేనను  ఓ ఆట ఆడించాడు. వాళ్లకు ఓ పట్టాన మద్దతు ప్రకటించలేదు. కాంగ్రెసు మా భాగస్వామి, వాళ్లను అడగాలి అన్నాడు. దిల్లీ వెళ్లి సోనియాతో మాట్లాడాలి అన్నాడు. ఇవాళ ఇందిర పుట్టినరోజు కుదరదన్నాడు. ఇలా వాళ్లని చూరుకు వేళ్లాడదీసి, వాళ్ల అహం అంతా దింపాడు.

ఆదిత్యను సిఎం చేయాలని ఉద్ధవ్‌ అంటే '29 ఏళ్ల కుర్రాడు సిఎం ఏమిటి, నువ్వయితేనే చెప్పు' అన్నాడు. ఉద్ధవ్‌ ఆరోగ్యం అంతంతమాత్రం. అతనైతే ఉపముఖ్యమంత్రి హోదాలో తమ పార్టీ మనిషే చక్రం తిప్పవచ్చని శరద్‌ ఐడియా. ఓ పక్క యింటిపోరు, యిటు శరద్‌ షరతులు. చివరి దాకా ఉద్ధవ్‌ ఎటూ చెప్పకుండా శివసేన సిఎం అంటూ వచ్చాడు. చివరకు నిన్న రాత్రి శరద్‌ 'ఉద్ధవ్‌ ముఖ్యమంత్రి' అని ప్రకటించాడు. ఉద్ధవ్‌ మాత్రం నేనే సిఎం అనలేదు కానీ ఆ షరతుకి అంగీకరించాడు. ఇక ఎన్‌డిఏలోంచి బయటకు వచ్చేయాలని, కాబినెట్‌లో సేన మంత్రి రాజీనామా చేయాలని కూడా శరద్‌ చెప్పాడు. ఇష్టం లేకపోయినా సేన ఆ పని చేసింది. ఇవన్నీ అయ్యాక కాంగ్రెసుని ఒప్పించాలి కదా అంటూ వాళ్లను రంగంలోకి దింపాడు. ఇక షరతులు పెట్టడం కాంగ్రెసు వంతు. 

ఈసారి బిజెపి ఉమ్మడి పౌరస్మృతి, దేశమంతా పౌరసత్వ జాబితా వంటి అనేక హిందూత్వ అజెండా ఐటమ్స్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది. శివసేన తన సిద్ధాంతం ప్రకారం వాటినన్నిటికీ మద్దతివ్వాలి. మా మద్దతు కావాలంటే వాటిని వ్యతిరేకించాలి అంది కాంగ్రెసు. రాష్ట్రంలో అధికారం కోసం సేన అన్నిటికీ సరేనంది. నిజానికి మహారాష్ట్రలో బిజెపియేతర ప్రభుత్వం ఏర్పడడం ఎన్సీపీ, కాంగ్రెసులకు ఎంతో అవసరం. అది మామూలు రాష్ట్రం కాదు. భారత ఆర్థికవ్యవస్థకు గుండెకాయ లాటి రాష్ట్రం. దేశంలో ధనికుల ఆర్థికమూలాలు అక్కడే ఉంటాయి. నిధులు రాలాలంటే అక్కడే నొక్కాలి. పైగా కాంగ్రెసు, ఎన్సీపీ నాయకులపై బిజెపి అనేక కేసులు బనాయించింది.  వాటిని చూపి ఆ పార్టీల నుంచి ఫిరాయింపుదారులను తీసుకుంది. ఆ కేసులను ముందుకు సాగనీయకుండా, యికపై ఫిరాయింపులు లేకుండా చేసుకోవాలంటే హోం శాఖ తమ చేతిలో పెట్టుకోవాలి. ఇవన్నీ తెలిసి కూడా కాంగ్రెసు, ఎన్సీపీ కంగారు పడకుండా సేనను ఊరిస్తూ, ఊరుకోబెడుతూ కాలక్షేపం చేసి, చివరకు లొంగదీశాయి.

ఇదంతా సేన ద్వితీయశ్రేణి నాయకత్వానికి, క్యాడర్‌కు దుస్సహంగా తయారైంది. ఏమిటింత బెట్టు, వీళ్లతో కలిస్తే మన హిందూత్వ ఓటు బ్యాంకు చెడుతుంది, బిజెపి పరమౌతుంది. ఆదిత్య పేరాస కోసం పార్టీని బలివ్వాలా? ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుని అధికారంలోకి వచ్చేస్తే పోలా? అనసాగారు. శరద్‌ నమ్మదగిన వ్యక్తి కాదు కాబట్టి, పర్యవసానం ఎలా ఉంటుందో తెలియక సేన బిజెపికి ఓ గుమ్మం తెరిచే వుంచింది. ఇది శరద్‌ను మండించింది. అదిగో మీరు వాళ్లతో చాటుమాటు మంతనాలు సాగిస్తున్నారు, ఇలా అయితే కటీఫ్‌ అనసాగాడు. మా గూటికి మళ్లీ చేరండి అంటూ బిజెపి మధ్యవర్తుల ద్వారా రాయబారాలు పంపసాగింది. ఈ ఒత్తిళ్ల మధ్య సేన గందరగోళంలో పడింది. చివరకు ఎన్సీపీ, కాంగ్రెసులతోనే వెళ్లడానికి సిద్ధపడింది.

ఎందుకిలా అంటే నాకు ఒకటి తోస్తోంది. హిందూత్వ రాజకీయాలు యీసారి ఓట్లు రాల్చలేదని సేనకు అర్థమై ఉంటుంది. మామూలుగా బిజెపి హిందూత్వ రాజకీయమే యిప్పటిదాకా ఓట్లు సంపాదించి పెట్టిందనుకుంటే, సేన కూడా చేరడంతో డబుల్‌ హిందూత్వ అయి, ఆరెస్సెస్‌కు కేంద్రస్థానమైన మహారాష్ట్రలో మహాయుతి ఓట్లు, సీట్లు కొల్లగొట్టి ఉండాలి. కానీ అలా జరగలేదు. జాతీయతా వాదంతో పార్లమెంటు ఎన్నికలలో ఘనవిజయం సాధించిన బిజెపి, మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలలో ఆ మ్యాజిక్‌ మళ్లీ చేయలేకపోయింది. రెండు చోట్ల మాంద్యం, నిరుద్యోగిత, రైతుల దుస్థితి వంటి ఆర్థిక కారణాలే ప్రాధాన్యత వహించి, బిజెపిని కృంగదీశాయి. పైగా గమనిస్తే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట బిజెపి చొచ్చుకుని వెళ్లలేక పోతోంది. కొన్ని రాష్ట్రాలలో వాళ్లతో పొత్తు కుదుర్చుకోవలసి వస్తోంది. 

కాంగ్రెస్‌-ముక్త్‌ భారత్‌ అనేది బిజెపి సాధించలేక పోతోంది. నాయకత్వం అధ్వాన్నంగా ఉన్నా స్థానిక నాయకులు బలంగా ఉన్న చోట కాంగ్రెసు గెలుస్తోంది. గాంధీ కుటుంబీకుల కబంధ హస్తాల నుండి బయటపడితే కాంగ్రెసు మళ్లీ పుంజుకోవచ్చు. అందువలన 'బిజెపితో అంటకాగి హిందూత్వ రాజకీయాలను ముందుకు తీసుకుని వెళ్లడం కంటె దక్షిణాది ప్రాంతీయ పార్టీల తరహాలో ఆర్థికాంశాలు, ప్రాంతీయతావాదం నమ్ముకుని ముందుకు వెళితే పార్టీకి మనుగడ ఉంటుంది. బిజెపితో కలిసి నడిచినంతకాలం తమ స్థితి నానాటికీ దిగజారుతుంది' అని సేన లెక్క వేసి ఉంటుంది. 

ఏమైతేనేం, సేన ఎన్సీపీ, కాంగ్రెసులతోనే కలిసి పయనించడానికి నిశ్చయించింది. అంతా సవ్యంగా జరిగితే యివాళ ఉద్ధవ్‌ ముఖ్యమంత్రి అయి వుండేవాడు. అయితే బిజెపి కాటు వేసింది. అయితే అజిత్‌ సామర్థ్యంపై కథ ఆధారపడి వుంది. అతను నిజంగా ఎన్సీపీలో సగం మందినైనా తీసుకుని వస్తే, స్వతంత్రులలో బిజెపి రెబెల్స్‌నూ, మరి కొందర్ని ఆకట్టుకుని బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసి రాజకీయపు టెత్తులలో తమకు ప్రస్తుతం సాటి వచ్చేవారు లేరని నిరూపించుకుంటుంది. అప్పుడు ఉద్ధవ్‌ రాజకీయంగా పరిపక్వత లేనివాడని సేన క్యాడర్‌ ఫీలై, అతన్ని విడిచిపెట్టడం ప్రారంభిస్తుంది. అలా కాక, అజిత్‌ నాదెండ్లలా తేలితే మాత్రం బిజెపి భంగపడి, సేన అధికారంలోకి వచ్చే అవకాశం ఏర్పడితే అప్పుడు ఉద్ధవ్‌కు మంచి రోజులే. 

1984లో నాదెండ్ల టిడిపిని చీల్చడం, ప్రజల మద్దతు సాయంతో ఎన్టీయార్‌ దాన్ని ఎదుర్కొనడం, గవర్నరు వ్యవస్థను దుర్వినియోగ పరిచి నాదెండ్లను సమర్థించిన కేంద్రంలోని కాంగ్రెసు భంగపడడం - యివన్నీ రసవత్తర ఘట్టాలు. ఆ నాటికి పుట్టనివారు, రాజకీయాలు అర్థం చేసుకునే వయసు లేనివారు యీనాటి అజిత్‌ పవార్‌ విన్యాసాలు ఎలా రూపుదిద్దుకుంటున్నాయో గమనించి కొంత రసానుభూతి పొందవచ్చు. తాజా వార్తల ప్రకారం అతని దగ్గర ఐదుగురే మిగిలారట! ఆ నాటి కాంగ్రెసు స్థానంలో యిప్పుడు బిజెపి ఉంది. నిజంగా అజిత్‌ను నమ్మి బిజెపి బోల్తా పడితే మాత్రం నాటి కాంగ్రెసు లాగే గాడిదవుతుంది. ఈ లోగా ఇంకేం మాయలు చేస్తుందో తెలియదు. అయితే అప్పట్లో ఎన్టీయార్‌ వంటి సమ్మోహకర నాయకుడు ఉన్నాడు కాబట్టి ప్రజలను కదిలించ గలిగాడు. ఈనాడు మహారాష్ట్రలో అలాటి క్లీన్‌ యిమేజి, కరిజ్మా ఉన్న నాయకుడు లేడు. ప్రజలకు ఎవరి మీదా పెద్దగా గౌరవం లేదు. అందువలన యిది ఒట్టి రాజకీయ క్రీడగానే మిగులుతుంది. ఈ గందరగోళానికి మూలకారణం - మహారాష్ట్రలో ఏ పార్టీకి బలం రాని పరిస్థితి! అది ఎందుకు వచ్చిందో వచ్చే వ్యాసంలో రాస్తాను. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2019)
mbsprasad@gmail.com

Show comments