ఏదో చేద్దాం అనుకున్నారు.. అది కాస్తా లీక్

సరిగ్గా నెలరోజుల కిందటి మాట. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రెడీ అయిపోయింది. మంచి టైటిల్ దొరక్క ఫస్ట్ లుక్ రిలీజ్ ను వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పటికీ ఇంకా టైటిల్ ఫిక్స్ అవ్వలేదు. కానీ మేకర్స్ లాక్ చేసిన లుక్ మాత్రం లీక్ అయిపోయింది.

అవును.. శర్వానంద్ కు సంబంధించి ఏ లుక్ అయితే విడుదల చేయాలని మేకర్స్ భావించారో, అదే లుక్ లో శర్వానంద్ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది. ఆ షెడ్యూల్ కు సంబంధించిన పిక్స్ లీక్ అయ్యాయి.

ఈ సినిమాలో కాస్త వయసు మళ్లిన డాన్ పాత్ర పోషిస్తున్నాడు శర్వానంద్. ఫుల్ గా గడ్డంతో, కాస్త డిఫరెంట్ గా ఉండే క్యారెక్టర్ ఇది. ఫస్ట్ లుక్ కింద ఇదే గెటప్ ను విడుదల చేయాలనుకున్నారు. ఆ లుక్ కు సంబంధించిన స్టిల్సే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే సినిమాకు మంచి టైటిల్ దొరక్క కిందామీదా పడుతోంది యూనిట్. దీనికితోడు ఇప్పుడు ఫస్ట్ లుక్ వ్యవహారాలు మళ్లీ మొదటికొచ్చాయి. ఈసారి టైటిల్ కోసం ఎదురుచూడకుండా ఫస్ట్ లుక్ ను బయటకు వదుల్తారేమో చూడాలి.