జగన్‌ పాసా.. ఫెయిలా?!

లవ్‌ హిమ్‌ ఆర్‌ హేట్‌ హిమ్‌.. బట్‌ యూ కాంట్‌ ఇగ్నోర్‌ హిమ్‌... రాష్ట్ర రాజకీయ పరిణామాల మధ్య జగన్‌ పరిస్థితిని స్పష్టం చేయడానికి ఈ కోట్‌ ఒక్కటీ చాలు. అనూహ్యంగా రాజకీయాల్లో యాక్టివ్‌ అయ్యాడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. అతి తక్కువ కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించే దశకు వచ్చాడు. ప్రత్యేకంగా ఎలాంటి కృషి అవసరం లేకుండా కేవలం వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు కావడం వల్లనే జగన్‌కు క్రేజ్‌ లభించిందనేది నిర్వాదాంశం. ఆ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకొంటూ జగన్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. రాజకీయంగా కొన్ని ఎత్తులతో కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి.. సీఎం అయిపోయినట్టుగానే భావించాడు. అయితే కథ అడ్డం తిరిగింది. జగన్‌ ప్రతిపక్షంలో కూర్చున్నాడు. అధికారికంగా అయితే.. రెండున్నరేళ్ల నుంచి జగన్‌ ప్రతిపక్ష నేత. మరి ఈ బాధ్యతల్లో ఆయన ఏ మేరకు సఫలం అయ్యాడు? ప్రతిపక్ష నేతగా జగన్‌కు ఎన్ని మార్కులు పడతాయి? ఇంతకీ ఈ పరీక్షలో ప్రస్తుతానికి జగన్‌ ఫెయిలా పాసా?!

ముందుగా గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏమింటే.. ప్రతిపక్ష నేత ఇలానే చేయాలి, ఇలాగే వ్యవహరించాలి.. అని చెప్పేటందుకు ఏ ప్రమాణాలూ లేవు. రాజకీయ గమనాన్ని గమనించినా.. అనేక మంది నేతలు ప్రతిపక్ష నేతలుగా వ్యవహరించిన తీరును గమనించినా.. ఒక్కోరి శైలి మరొకరితో భిన్నం. ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున పోరాడిన వాళ్లూ పదవుల్లోకి వచ్చారు, అవేమీ పట్టకుండా పడుకున్న వాళ్లూ సీఎంలయ్యారు. ఆ సమయానికి వాళ్లు ప్రజలకు నచ్చాలి అంతే. ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకొంటే.. రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తులను కూడా సీఎంలుగా చేస్తారని భారత్‌లో పలుమార్లు రుజువు అయ్యింది.

కానీ నేతల విషయంలో కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఆ లోటు పాట్లే మొత్తం పరిస్థితిని తలకిందుల చేయగలవు! ఇది మాత్రం నిరూపణ అయిన విషయమే! ప్రత్యేకించి జగన్‌ విషయంలోనే ఆల్రెడీ ఇది ఒకసారి జరిగింది. 18 స్థానాలకు ఉపఎన్నికలు జరిగితే సంచలనాత్మక రీతిలో 16 స్థానాల్లో విజయం సాధించిన దగ్గర నుంచి వైకాపా తిరోగమన బాట పట్టింది. ఏ నియోజకవర్గాల్లో అయితే ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కనీయకుండా వైకాపా విజయం సాధించిందో.. అవే నియోజకవర్గాల్లో అదే ప్రత్యర్థులకు భారీ మెజారిటీని అప్పగించింది వైకాపా. అదే జగన్‌, అదే చంద్రబాబు.. అదే ప్రజలు. ఫలితాల్లో తేడా ఎందుకు? అంటే.. మారిన పరిస్థితులే అందుకు కారణం. అలా మారే పరిస్థితులకు అనుగుణంగా నేతలు నడుచుకోకపోతే.. చాకచక్యంగా వ్యవహరించకపోతే వాళ్ల కథ అంతే!

వైఎస్‌ హఠాన్మరణం. ఆ భావోద్వేగంలో జగన్‌ను సీఎం చేయాలనే డిమాండ్‌ వినిపించడం.. అధిష్టానం దానికి అంగీకరించకపోవడం.. పార్టీలోనే పొగబెట్టడం.. అధిష్టానంతో జగన్‌ ఢీ కొట్టడం, సొంత పార్టీ పెట్టుకోవడం, జగన్‌ను నియంత్రించడానికి కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఉచ్చుపన్నడం, ఆ ఉచ్చులో జగన్‌ చిక్కుకోవడం.. మరోవైపు ఉప ఎన్నికలతో జగన్‌ పార్టీ చాలా గ్రాండ్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించడం.. 2014 ఎన్నికల్లో ఓటమి.... పరిణామాలన్నీ వరసగా జరుగుతూ వచ్చాయి. జగన్‌వి వ్యూహాత్మక తప్పిదాలా?.. లేక మొండి ధైర్యం మంచిదేనా.. అనే విషయాలను ఎవరూ జడ్జ్‌ చేయలేరు. 2014 ఎన్నికల ఫలితాలు మాత్రం జగన్‌కు అత్యంత భారీ షాక్‌. ఆల్‌మోస్ట్‌ ముఖ్యమంత్రిని అయిపోయినట్టే.. అనే ఫీలింగ్‌లో ఉన్న జగన్‌కు దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయి. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వచ్చింది. Readmore!

ఐదేళ్లకు గానూ జగన్‌కు ఈ హోదాను ఇచ్చారు ప్రజలు. మరి వర్తమానంలో ఏం జరుగుతోంది? జగన్‌ ప్రతిపక్ష నేతగా ఏ మేరకు రాణిస్తున్నాడు? ప్రతిపక్ష నేత పదవికే ఒక గౌరవం తెచ్చిన, ప్రతిపక్ష నేత అంటే.. కాబోయే ముఖ్యమంత్రే అనే భావనను కలిగించిన వైఎస్‌ రాజశేఖర రెడ్డి తనయుడిగా జగన్‌ మోహన్‌ రెడ్డి అలాంటి అంచనాలను అందుకునే స్థితిలోనే ఉన్నాడా? అంటే.. అంత తేలికగా తేల్చేసే అంశం కాదు ఇది! అవును.. కాదు.. అనే సమాధానం చెప్పేయడానికి లేదు. 

జగన్‌ తీరులో అనేక లోటు పాట్లు ఉన్నాయి. జగన్‌కు ఉన్న పాజిటివ్‌లు ఏమిటో ఇప్పుడు చెప్పలేం. ఒకవేళ రేపటి ఎన్నికల్లో జగన్‌ పార్టీ గనుక గెలిస్తే.. అప్పుడు జగన్‌ తీరులో పాజిటివ్‌లు ఏమిటో విశ్లేషణలు, పరిశోధనలు చేయవచ్చు. ప్రస్తుతానికి మాత్రం వైకాపా అధినేత తీరులో లోపాలు ప్రస్ఫుాటం అవుతున్నాయి. 

ప్రత్యేకించి 1995 నుంచి 2004ల మధ్యన ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతగా వైఎస్‌ వ్యవహరించిన తీరుతో పోలిక పెట్టుకున్నప్పుడు జగన్‌లో అనేక మైనస్‌లు కనిపిస్తాయి. రెండున్నరేళ్లు గడిచినా.. జగన్‌ కొన్ని ప్రాథమిక అవరోధాలను అధిగమించలేదన్న అంశం స్పష్టం అవుతోంది.

జగనే ప్లస్‌.. జగనే మైనస్‌!

పార్టీ ఆవిర్భవించి ఇప్పటికే ఐదారేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటే అది జగన్‌ మాత్రమే! రాష్ట్ర స్థాయి నేతా జగనే, జిల్లా స్థాయి నేతా జగనే, గల్లీ స్థాయికీ నేత జగన్‌ మోహన్‌ రెడ్డే! ప్రాంతీయ పార్టీలన్నింటిలోనూ అలాంటి పరిస్థితే ఉంటుందని అనుకోవచ్చు.. కానీ వైకాపా పూర్తిగా ఏకస్వామ్యం అయిపోయింది. 175 నియోజకవర్గాలకు సంబంధించి నేతలున్నా... ఎంతో రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్లు వైకాపాలో ఉన్నా, వాళ్లెవ్వరూ రాష్ట్ర స్థాయి నేతలు అనే ఫీలింగ్‌ రావడం లేదు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ అంటే వైఎస్‌ మాత్రమే కాదు.. ఆ పార్టీ విధానాలకు కట్టుబడి వ్యక్తిగతంలో ఎదిగిన నేతలు ఎంతో మంది ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీపై హోల్‌ అండ్‌ సోల్‌ హక్కులు బాబుకు ఆయన తనయుడికే ఉన్నా.. ఆ పార్టీకి ద్వితీయ శ్రేణి నాయకత్వం ప్రతి జిల్లాకూ ఉంది. రాష్ట్రస్థాయి నేతలున్నారు. కొంతమంది వ్యాపారస్తులు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. మీడియా అధిపతులు.. ఇంకా రకారకాల మోతుబరులు.. తెలుగుదేశానికి అండగా ఉన్నారు. వాళ్లు పొందే ప్రయోజనాలు ఎలా ఉన్నా.. పార్టీకి పిల్లర్లుగా వారు ఉపయోగపడుతున్నారు. వైకాపాకు మాత్రం ఈ తరహా బలం ఏర్పడలేదు ఇంత వరకూ. ఈ రకంగా వైకాపాకు జగనే ప్లస్‌.. జగనే మైనస్‌.

జగన్‌కు నమ్మకమైన వ్యక్తులెవరు?

వైఎస్‌ రోజులు గుర్తు చేస్తే.. అది భువన విజయం గుర్తుకొస్తుంది. దిగ్గజాల్లాంటి వ్యక్తులు వైఎస్‌కు నమ్మకమైన వాళ్లుగా, వైఎస్‌కు సన్నిహితులుగా, వైఎస్‌కు మిత్రులుగా.. ఉండే వాళ్లు. ఉత్తరాంధ్ర, తెలంగాణ, కోస్తా, రాయలసీమ.. ఇలాంటి అంతరాలు ఏమీ లేవు! ప్రతి చోటా.. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు, అంతకు మించిన నేపథ్యం ఉన్న వాళ్లు.. వైఎస్‌ మనుషులనే ముద్ర ఉండేది! రాష్ట్ర స్థాయిలో ఏ నేతనూ సొంతంగా ఎదగనీయని కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ అలాంటి ప్రస్థానాన్ని సాగించాడు. 80లలోనే వైఎస్‌ అలాంటి మిత్రవర్గాన్ని సంపాదించగలిగాడు. అప్పటికి ఏముంది వైఎస్‌ దగ్గర? 

పదవా.. ఆర్థిక శక్తినా, మీడియా.. అధికారమా.. సముద్రంలాంటి కాంగ్రెస్‌ పార్టీలో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తన కన్నా గొప్ప కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లను, తన కన్నా ఎక్కువ ఆర్థిక శక్తిని కలిగిన వారిని కూడా వైఎస్‌ అనుచరులుగా చేసుకోగలిగాడు. అలాంటి వైఎస్‌ ఛరిష్మాతో పోలిస్తే.. జగన్‌ దూదిపింజలా కనిపిస్తున్నాడు!

ఐదేళ్ల కిందట ఇదే సమయంలో జగన్‌ వెంట ఉన్న వాళ్లలో ఇప్పుడు ఎంతమంది ఆయన వెంట ఉన్నారు? అనే అంశాన్ని పరిశీలిస్తేనే, జగన్‌ ఫెయిల్యూర్‌ ఏమిటో అర్థం అవుతుంది. పార్టీలో ఇప్పుడు ఉన్న నేతల్లో కూడా ఎంతమందికి జగన్‌తో అంతో ఇంతో సాన్నిహిత్యం ఉందో ఎవ్వరికీ తెలియదు! ఇప్పుడున్న వాళ్లంతా కచ్చితంగా జగన్‌తో పాటే ఉంటారా? కనీసం ఎన్నికల వరకూ అయినా? అనే నమ్మకమూ లేదు! ఏమైనా జరగొచ్చు. ఇలాంటి డోలాయమాన పరిస్థితే కొనసాగుతోంది వైకాపాలో!

జిల్లా స్థాయిలో వీక్‌.. బూత్‌ స్థాయి శూన్యం!

కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో ఉండిన రోజుల్లో కూడా డీసీసీ ప్రెసిడెంట్‌ ఎవరంటే.. జిల్లా మొత్తం తెలిసేది! మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిన వారు కూడా తమ ఉనికిని కలిగి ఉండే వాళ్లు. అయితే వైకాపాలో కొన్ని జిల్లాల విషయంలో పార్టీ అధ్యక్షుడు ఎవరు? అంటే.. ఆ పార్టీ వీరాభిమానులు కూడా చెప్పలేరు. ఈ తరహా నాయకత్వ లోటు వైకాపాలో చాలా ఉంది. 

ఆఖరికి కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం అనే ప్రోగ్రామ్‌ను పెట్టుకొంటూ ఉంటుంది. ఏపీలో ఆ పార్టీ పరిస్థితి శూన్యమే అయినా.. ఆ కార్యక్రమం జరిగింది. కానీ.. వైకాపా మాత్రం అలాంటి ప్రోగ్రామ్‌ ఏదీ పెట్టుకోలేదింత వరకూ! అవతల తెలుగుదేశం పార్టీ.. కార్యకర్తలే మా బలం, అంటూ హడావుడి చేస్తూ ఉంటుంది. వైకాపా తరపున మాత్రం ఇలాంటి పనులేమీ జరగవు! 

పార్టీ సంస్థాగతంగా బలపడటం అనేది ఇప్పటి వరకూ జరగలేదు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా.. జనాలు వెళ్లి జగన్‌ మీద మోజుతో ఓటు వేయాల్సిందే తప్ప.. జగన్‌కు ఓటు వేయాల్సిన ఆవశ్యకత ఏమిటో వివరించే నాథుడు క్షేత్ర స్థాయిలో లేడు! గత ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినా ఇలాంటి విషయాల్లో జగన్‌ వైఖరి ఏ మాత్రమూ మారకపోవడం విశేషం.

మీడియా బలం.. ఉన్నా లేనట్టే!

పదిలక్షల వరకూ సర్క్యులేషన్‌ ఉన్న ఒక పత్రిక, దానికి జోడీగా ఒక టీవీ ఛానల్‌ను అయితే జగన్‌ కలిగి ఉన్నాడు. కానీ దాన్ని సద్వినియోగ పరుచుకుంటున్న దాఖలు శూన్యం. ఆల్రెడీ జగన్‌కు అనుకూలమైనవి అని ముద్రపడిపోయిన వాటి నిర్వహణ విషయంలో, వాటిని సరైన వ్యక్తుల చేతిలో పెట్టడంలో జగన్‌ విఫలం అయ్యాడు. వాటిని లాభాల కోసం నడిపే వ్యాపారాలుగా కొద్దిసేపు, తన మాటలను యథాతథంగా ప్రచురించుకోవడానికి ఉపయోగపడేవన్నట్టుగా కొద్దిసేపు.. చూస్తూ, చివరకు ఎటూ కాకుండా చేసుకుంటున్నాడు జగన్‌ మోహన్‌ రెడ్డి. మీడియాను అడ్డం పెట్టుకుని ఎంత మాయ చేయవచ్చునో.. చంద్రబాబు వంటి నేత ఇప్పటికే పలుమార్లు చూపించినా, జగన్‌ అలాంటి టెక్నిక్స్‌ను అందిపుచ్చుకోలేకపోతున్నాడు. మెజారిటీ మీడియా జగన్‌కు వ్యతిరేకమే అయినా.. ఉన్న పత్రిక, టీవీతో ప్రభుత్వాన్ని గడగడలాండించవచ్చు. కానీ.. ఇవేవీ జరగడం లేదు. 

పార్టీ అభ్యర్థులు బికారులైపోతున్నారు!

ఆల్రెడీ గత ఎన్నికల్లో ఖర్చులు పెట్టుకుని చాలా మంది అభ్యర్థులు చేతులు కాల్చుకున్నారు. కోట్ల రూపాయలు పెట్టి ఇలాంటి వారిలో చాలా మంది ఆస్తులమ్ముకున్నారు. మరి అలాంటి వారిపైనా ఇప్పుడు జగన్‌ తన పర్యటనలతో అదనపుభారం మోపుతున్నట్టుగా తెలుస్తోంది. జగన్‌ జిల్లాల పర్యటనలకు వచ్చినప్పుడు ఖర్చులు సహజంగా ఆ జిల్లా నేతలు పెట్టుకోవాల్సి ఉంటుంది. అనునిత్యం ఏదో ఒక జిల్లాకు.. ఏదో ఒక నియోజకవర్గానికి వెళుతూ వైకాపా అధినేత వారిపై భారాన్ని మోపుతున్నాడు. ఇలా ఆరిపోతే.. రేపు ఎన్నికల నాటికి వాళ్ల పరిస్థితి ఏమిటి?

చెప్పుకొంటూ పోతే జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వ లోపాలు బోలెడున్నాయి. జగన్‌ తీరువల్ల నష్టం ఆయనకు, ఆయన పార్టీకి మాత్రమే అయితే ఎవరికీ ఆందోళన లేదు. కానీ.. జగన్‌ ప్రతిపక్ష నేత. ప్రభుత్వ వ్యవహారాలకు వాచ్‌ డాగ్‌గా ఉండాల్సిన వ్యక్తి. ప్రజాస్వామ్యంలో ఆయనకు ఆ బాధ్యత ఉంది. ఆ బాధ్యతను ఆయన నెరవేర్చాల్సి ఉంది. ఈ విషయంలో జగన్‌ ఫెయిలయితే.. అది ప్రజలకే నష్టం. 

వైఎస్‌ లాంటి పాలనను అందిస్తానని జగన్‌ ఒకటికి వందసార్లు చెబుతూ ఉంటాడు. వైఎస్‌ లాంటి పాలన అందించాలంటే.. వైఎస్‌ లాంటి వ్యక్తిత్వం కూడా ఉండాలి! భోజరాజు, భువన విజయం.. అనేంతలా ఉండేది వైఎస్‌ వైభవం. జగన్‌ ప్రస్థానంలో మాత్రం అది కానరావడం లేదు. ఆర్థిక శక్తి, మీడియా అండ ఏదీ లేకపోయినా.. వైఎస్‌ మొండి ధైర్యంతో పోరాడాడు.. ప్రజల మన్నన పొందాడు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో తన ప్రత్యేక ప్రస్థానాన్ని శాశ్వతంగా ఉంచి వెళ్లాడు. మరి జగన్‌ వైఎస్‌ లాంటి పాలనను అందించగలనని ప్రజల్లో విశ్వాసం కలిగించాలంటే.. దాని కన్నా మునుపు వైఎస్‌ వ్యక్తిత్వాన్ని తనలో ప్రతిబింబంపజేయాలి. అప్పుడే ఆయన పాస్‌ అయినట్టు! 

జగన్‌ పూర్తిగా విఫలం.. -ఎమ్బీఎస్‌ ప్రసాద్‌, ప్రముఖ రచయిత, విశ్లేషకులు. 

ప్రతిపక్ష నేతగా జగన్‌ పూర్తిగా ఫెయిల్యూర్‌. అనూహ్య పరిస్థితుల మధ్య వైఎస్‌ వారసుడిగా తెరపైకి వచ్చిన జగన్‌ తన వ్యూహాత్మక తప్పిదాలతో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగలేకపోయాడు. కాంగ్రెస్‌ హైకమాండ్‌పై రెబల్‌గా మారడంలో జగన్‌ అభినందనీయుడే అయినా.. ఆ తర్వాత మాత్రం అనేక పొరపాట్లు జరిగాయి. అమలుకు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ప్రజలను నమ్మించాడు. ఇప్పటికీ పెద్ద పెద్ద కబుర్లు, సింగపూర్‌ అబద్ధాలతో బాబు బ్రేకుల్లేకుండా జర్నీ చేస్తున్నాడు. బాబు మోసం చేస్తున్నాడు.. అని ప్రజలకు కనువిప్పు కలిగించడంలో జగన్‌ పూర్తిగా విఫలం అయినట్టే!

ఏదో సాక్షి పత్రికలో రాసేశాం.. అయిపోయింది. ప్రజలను మేలుకొలిపాం.. అని జగన్‌ అనుకుంటుంటే అంతకు మించిన పొరపాటు మరోటి ఉండదు. ప్రతిపక్ష పాత్ర అంటే అది కాదు. నలుగురిని కలుపుకుపోవాలి.. మేధో వర్గానికి ప్రాధాన్యతను ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమం కేవలం కేసీఆర్‌ ఒక్కడే మాట్లాడటం వల్ల ఉధత స్థాయికి వెళ్లలేదు. ఆ  ప్రాంతానికి చెందిన అనేక మంది మేధావులు, ప్రొఫెసర్లు.. మాట్లాడారు. అవును ఏదో అన్యాయం జరుగుతోంది.. అని ప్రజలు విశ్వసించడానికి కారణం వారే. వాళ్లెవ్వరూ అప్పటికి తెరాస కాదు. ఇప్పుడు ఏపీలో బాబు పాలనలో సాగుతున్న మోసాన్ని మూడో వ్యక్తి చేత చెప్పించగలగాలి. 

కానీ క్రెడిటంతా మాకే కావాలి.. అంతటా మేమే ఉండాలి, మేం మాట్లాడితే చాలు అని జగన్‌ భావిస్తున్నాడు. ప్రతిపక్ష పార్టీ ఏ అంశంపై పోరాటాన్ని జరిపినా అందులో .. విస్తతమైన సదస్సులు, ఇండిపెండెంట్‌ పీపుల్‌ వాయిస్‌ను వినిపించగలగాలి. ఏపీలో అలా జరగడం లేదు. అందుకే చంద్రబాబు ఆటలు సాగుతున్నాయి.

గతం గతః.. ఐదు లక్షల ఓట్లు, చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచాడు.. అనే మాటలు జగన్‌ వదిలిపెట్టాలి. అలాగే అసెంబ్లీని వినియోగించుకోవడంలో జగన్‌ పూర్తిగా ఫెయిల్‌. సభలో జగన్‌ లేవగానే.. అవతల నుంచి లక్షకోట్లు అని అరుస్తున్నారు. ఈ సమయంలో ప్రతిసారీ తనే మాట్లాడాలి అనే ఆరాటాన్ని జగన్‌ వదులుకోవాలి. తన పార్టీ తరపున మాట్లాడే శక్తి ఉన్నవారికి అవకాశం ఇవ్వాలి. టీవీ చర్చా కార్యక్రమాల్లో కూడా వైకాపా తరపున వాదన వినిపించగల వారిలో నలుగురైదుగురు సమర్థులు కూడా కనిపించడం లేదు. తెలంగాణలో వైఎస్‌కు ఉండిన గొప్ప ఇమేజ్‌ను ఉపయోగించుకోవడంలో జగన్‌ ఇప్పటికే పూర్తిగా జీరో అయ్యాడు. ఏపీ వ్యవహారాల్లో జగన్‌ తన తీరు నుంచినే సంస్కరణలు మొదలుపెట్టుకోవాలి.

విఫలం అయ్యాడని అనేయడం సమంజసం కాదు..  తెలకపల్లి రవి, సీనియర్‌ జర్నలిస్టు, 'ప్రజాశక్తి' ఎడిటర్‌. 

ప్రతిపక్ష నేతగా జగన్‌ మోహన్‌ రెడ్డి తన శక్తి కొద్దీ ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవలి కాలంలో ఆయన వేగం పెంచడం కూడా కనిపిస్తోంది. అయితే పార్టీలోని ప్రతిమూలనూ ఆయన కలుపుకుపోవాలి. విభజిత రాష్ట్రంలో సమస్యల మీద మరింత అధ్యయనం, నిర్మాణాత్మక కార్యాచరణ మరింత పెంచుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఏకపక్ష ధోరణి నేపథ్యంలో వ్యూహాత్మకంగా చర్చను లేవనెత్తడంలో కషి జరగాలి. జగన్‌ మొదటి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పదవిని లక్ష్యంగా చేసుకుని ఆశించి, కొద్ది ఓట్ల తేడాతో ప్రతిపక్ష నేత అయ్యాడు. యువకుడిగా జగన్‌కు లాభనష్టాలున్నాయి. అనుభవం తక్కువ కావడం నష్టం అనుకుంటే, యువకుడిగా శక్తియుక్తులు లాభం. కేసులు, ఆరోపణలు నీడలా వెంటాడుతున్నాయి.. శాసన సభలో తెలుగుదేశం వాటి వైపు చర్చను మళ్లించడంతో ఈ వ్యూహంలో జగన్‌ తరచూ చిక్కుపోతుంటాడు. గతంలో వారి తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికార పక్షంలో ఉంటూనే.. అసమ్మమతి నేతగా ప్రజాభిప్రాయాన్ని ప్రతిభింబించ గలిగేవారు. 1999- 2004ల మధ్య చంద్రబాబుతో ఢీ కొట్టగల ప్రతిపక్ష నాయకుడిగా రాణించాడు. చంద్రబాబు పదేళ్లు ప్రతిపక్షంలో మనుగడ కోసం తీవ్రంగానే పోరాడాడు. ఆ అనుభవాల నుంచి జగన్‌ నేర్చుకోవాలి. ఒక్కటైతే వాస్తవం.. ఆయనకు కనీసం అవకాశం ఇవ్వకుండా, ఆయన ప్రతిపక్ష నేతగా విఫలం అయినట్టుగా ముద్ర వేయటం సమంజసం కాదు. 

-వెంకట్‌ ఆరికట్ల 

Show comments