బీజేపీతో ఆ పార్టీ సర్దుబాటు.. అలక వీడింది!

ఇన్ని రోజులూ కమలం పార్టీని ఎన్ని రకాలుగా బెదిరించినా, అప్పుడప్పుడు మోడీని తిట్టినా.. రాహుల్ ను పొగిడినా.. తామిద్దరిదీ టామ్ అండ్ జెర్రీ బంధమే అని శివసేన రుజువు చేసింది. ఎన్నికల నేపథ్యంలో కమలం పార్టీతో సేన పొత్తుకు ఓకే చెప్పేసింది. ఇరు పార్టీలూ సీట్ల ఒప్పందాన్ని కూడా చేసేసుకున్నాయి.

మహారాష్ట్రలో బీజేపీ పాతిక ఎంపీ సీట్లలో పోటీ చేసేలా.. శివసేన ఇరవై మూడు ఎంపీ సీట్లలో పోటీ చేసేలా ఈ పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమిత్ షా – ఉద్ధవ్ ఠాక్రేల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఇరు పార్టీలూ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అంతే కాదు.. లోక్ సభ పోల్స్ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయాలని ఆ పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నాయట. 

మొత్తానికి బీజేపీ- శివసేనల బంధం తెగనిది అని స్పష్టం అయిపోయింది. ఇన్ని రోజులూ ఎన్ని రకాలుగా విమర్శించుకున్నా.. కలిసి ప్రభుత్వంలో కొనసాగిన ఈ పార్టీలు.. ఇప్పుడు మళ్లీ చేతులు కలిపేశాయి. ఇక ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ –ఎన్సీపీల పొత్తు కూడా ఖాయం అయినట్టే!