సీమలో జగన్‌ సునామీ..!

2014 ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని సొంతం చేసుకోలేకపోయినా రాయలసీమ వరకూ మాత్రం జగన్‌ పార్టీనే ఛాంపియన్‌గా నిలిచింది. అప్పుడే రాయలసీమలోనే మెజారిటీ ఎమ్మెల్యే సీట్లను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సొంతం చేసుకుంది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గాలి బలంగా వీచిన నేపథ్యంలో ఈసారి రాయలసీమలో ఫ్యాన్‌ సంచలన విజయాలను సొంతం చేసుకుంది. 52 అసెంబ్లీ సీట్లున్న రాయలసీమలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి దక్కింది 49 సీట్లు. తెలుగుదేశం పార్టీ కేవలం మూడంటే మూడు అసెంబ్లీ సీట్లకు పరిమితం అయ్యిందంటే.. సీమ ప్రజలు చంద్రబాబు చేసిన సత్కారం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకదశలో కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుస్తారా? అనేదే సందేహంగా నిలిచింది!

రెండో రౌండ్‌ ముగిసేసరికి కుప్పంలో చంద్రబాబు మీద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పైచేయి సాధించారు. అదే ఊపు కొనసాగి ఉంటే.. చంద్రబాబు నాయుడుకు కుప్పం ప్రజలు భారీగా సత్కరించినట్టుగా అయ్యేది. అయితే చంద్రబాబు నాయుడు బయటపడ్డారు. అయితే ఆయన మెజారిటీ మాత్రం చాలావరకూ ఆవిరిపోయింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా.. చంద్రబాబు నాయుడు తన గత మెజారిటీని నిలబెట్టుకోలేకపోయారు. గతంతో పోలిస్తే చంద్రబాబు నాయుడి మెజారిటీ పదిహేడు వేల వరకూ తగ్గిపోయిందందంటే సొంతం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

ఇక రాయలసీమ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన మరో ఇద్దరు బాలకృష్ణ, పయ్యావుల కేశవ్‌. బాలకృష్ణ గెలుపు కేవలం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిన పొరపాట్లే అని చెప్పవచ్చు. హిందూపురంలో మొదటి నుంచి ఒకే అభ్యర్థిని ప్రొజెక్ట్‌ చేసి, సరిగా వర్క్‌ చేయించుకుని ఉంటే అక్కడ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జయకేతనం ఎగరవేయడం ఏ మాత్రం కష్టం అయ్యేదికాదు. ఒకరికి ముగ్గురు అభ్యర్థులను మార్చింది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. నవీన్‌ నిశ్చల్‌ను ఆఖరి నిమిషంలో తప్పించారు.

అబ్ధుల్‌ ఘనీ వచ్చినట్టుగానే వచ్చి తను పోటీచేయనంటూ తప్పుకున్నాడు. ఆ తర్వాత నాన్‌లోకల్‌ ఇక్బాల్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అక్కడ పోటీలో నిలిచింది. అదే పెద్ద పొరపాటు అయ్యిందని చెప్పవచ్చు. కష్టమో నష్టమో నవీన్‌ నిశ్చల్‌కు అవకాశం ఇచ్చేసి ఉంటే.. హిందూపురంలో కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జయకేతనం ఎగరేవేసేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఉరవకొండలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  పరాజయం ఆ పార్టీకే మేలు చేసిందేమో!

అక్కడ ఎవరు నెగ్గినా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండదు. ఆ సెంటిమెంట్‌ మరోసారి రిపీట్‌ అయ్యింది. ఆఖరివరకూ ఉరవకొండలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పైచేయి సాధించినా, ఆఖరి రౌండ్స్‌లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పయ్యావుల పైచేయి సాధించి విజయం సొంతం చేసుకున్నాడు. అప్పటికే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడం ఖరారు అయ్యింది. అనంతపురం జిల్లాలో 2014లో తెలుగుదేశం పార్టీ పన్నెండు సీట్లను సొంతం చేసుకుని స్వీప్‌ చేస్తే, ఈసారి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సరిగ్గా అనే సీట్లతో సమాధానం ఇచ్చింది. అనంతపురం అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట అనేది ఉత్తుత్తి మాటగా మారింది.

గమనించాల్సిన అంశం ఏమిటంటే.. కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నెగ్గినప్పుడు కూడా అనంతపురం జిల్లాలో వచ్చింది ఎనిమిది అసెంబ్లీ సీట్లే. అయితే జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ వైఎస్సార్సీపీ మాత్రం అనంతపురం జిల్లాలో ఏకంగా పన్నెండు సీట్లను నెగ్గింది. తద్వారా చరిత్రను తిరగరాసింది.

కడపజిల్లాలో స్వీప్‌ చేయడం కూడా గొప్ప సంగతే. ఇంతకు ముందు వైఎస్‌ హవాలో కడపలో కాంగ్రెస్‌కు తొమ్మిది అసెంబ్లీ సీట్లు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. జగన్‌ పదికి పదీ కొట్టారు!

కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కనీసం ప్రాతినిధ్యం లేకుండా పోయింది. పద్నాలుగు అసెంబ్లీ సీట్లకూ పద్నాలుగు స్థానాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సొంతం చేసుకుని కొత్త చరిత్రను లిఖించింది.

చిత్తూరులో చంద్రబాబు నాయుడుకు మాత్రమే మినహాయింపు లభించింది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఘన విజయాలు నమోదు చేశారు.

స్థూలంగా సీమలో జగన్‌ సునామీ నమోదు అయ్యింది. ఈ సునామీలో తెలుగుదేశం పార్టీ చిత్తు అయ్యింది. జగన్‌ మీద రాయలసీమ ప్రజల నమ్మకం ఏ స్థాయిలో ఉందో చాటి చెబుతూ ఉంది ఈ విజయం!

 పదేళ్ల రాజకీయ ప్రస్థానం అద్భుత మలుపు

Show comments