సీమ ఏడుస్తుంటే.. చంద్రబాబు సంబరాలు!

మరో ఏడాది రాయలసీమలో కరువు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రధాన పంట వేరుశనగ రైతులను నిండా ముంచింది. అదునుకు రాని వర్షాలు భారీ పంటనష్టాన్ని మిగిల్చాయి. ఈసారి మామూలు పంట నష్టం కాదు. విత్తనం విత్తగానే మొహం చాటేసిన వరుణుడు మళ్లీ అటువైపు చూడేలేదు. విత్తనాలు అయితే మొలకెత్తాయి కానీ.. పైరు మాత్రం అస్సలు ఎదగలేదు.

వర్షాలు లేవు, మరోవైపున ఎండకాలాన్ని తలపింపజేసే ఎండలు. వీటి ఫలితంగా కాస్త ఎదిగిన పైరంతా మాడి మసి అయ్యింది. ఒకచోట కాదు.. మొత్తంగా సీమ అంతా ఇదే పరిస్థితి. పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఖరీఫ్‌ సీజన్‌ పంటతో రైతులకు ఇంతటి దారుణ అనుభవం ఎదురైంది. ఇలాంటి నేపథ్యంలో సీమకు వచ్చాడు చంద్రబాబునాయుడు. ఎందుకు? కరువుతో నష్టపోయిన పరిశీలించడానికా? అంటే.. అంత సీనేమీ లేదు. ఆయన మార్కు సంబరాలకు ఆయన వచ్చాడు. ఏవో శంకుస్థాపనలు.. డబ్బాలు కొట్టుకోవడాలు.. వీటికోసం భారీ ఏర్పాట్లు. కోట్ల రూపాయల ఖర్చు.

మొన్న అనంతపురంలో జరిగిన సభకు భారీగా జనాలను తోలారు. ఆర్టీసీ బస్సులను అన్నింటినీ రద్దుచేసేసి చంద్రబాబు సభకు జనాలను తోలేందుకు వాటిని పంపించేశారు. ఇలా సంబరాలు చేసుకుని వెళ్లాడు చంద్రబాబు. కరువు రైతు గురించి మాటల్లేవు.

దారుణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామనే మాటలేదు. యథావిథిగా సొంతడబ్బా.. అద్భుతాలు చేస్తున్నామని మాటలు.. ప్రజలతో ఏమాత్రం కనెక్ట్‌ కాని రీతిలో చంద్రబాబు అలా సాగిపోతూ ఉన్నాడు. బాధ్యత మరిచి.. స్వకుచమర్దనంతో సాగిపోతున్నాడు. అచ్చం 2004 నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నాడు.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

Show comments