సదరన్ స్పైస్: వర్మ అండ్ కంపెనీ..!

రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు సినిమాల కన్నా, టీవీలకు, యూట్యూబ్ ఛానళ్లకు ఇష్టంగా మారిపోయిన మెటీరియల్. వర్మతో సినిమాల కన్నా.. ఇతర విషయాల గురించి మాట్లాడటానికి ఉత్సాహం చూపిస్తోంది మీడియా. దేవుడు, దెయ్యం, సెక్స్, రిలేషన్స్ వంటి విషయాల గురించి మాట్లాడటానికి ఆ అంశాల గురించి వర్మ చేత మసాలా మాటలు చెప్పిస్తే వాటిని వినడానికి టీవీల ముందు, యూట్యూబ్ లోనూ బోలెడంత మంది పోగవుతున్నారు కాబట్టి.. మీడియా కూడా ఆ విధంగా ముందుకు పోతోంది. 

వర్మ చెప్పిన ఈ వేదాంతాలు పుస్తకాలుగా, డీవీడీలుగా విడుదల అవుతున్నాయి. వర్మ ప్రస్తుతం ఇలాగే కనిపిస్తున్నాడు. మరి ఇతడు దర్శకుడా లేక ప్రవచనకారుడా అది కూడా కాకుండా ప్రవక్తగా ఏమైనా మారాడా? అంటే.. మీడియానే వర్మను అలా మార్చిందని అనుకోవాల్సి వస్తుంది. మరి వర్మ కథ ఇలా ఉంటే.. వర్మ నుంచి మంచి సినిమాలను ఆశించే వాళ్లు నిరాశతో మిగిలిపోయినా.. ఒక విషయంలో మాత్రం వర్మను క్షమించేయ వచ్చనిపిస్తుంది. 

టాలీవుడ్ కైనా, బాలీవుడ్ కైనా కొంత టాలెంట్‌ను పరిచయం చేసిన విషయంలో వర్మను అభినందించాలి. వర్మ మంచి సినిమాలు తీయడం పనిగట్టుకుని ఆపేసినట్టుగా కనిపిస్తున్నా.. కొంతకాలమైన వర్మ కంపెనీతో సంబంధ బాంధవ్యాలు నెరిపిన వాళ్లు మాత్రం ఆ లోటును కొంత వరకూ తీరుస్తున్నారు. వీరిలో మరికొందరు పూర్తిగా ఫేడ్ అవుట్ అయ్యారు. వీళ్లను వర్మకు శిష్యులు అనడానికేం లేదు.. వర్మేక పాఠాలు నేర్పగలిగే స్థాయిలో ఉన్నారు మరి. వీళ్లందరిదీ ఒకే కంపెనీ. ఆ కంపెనీ కథ ఇప్పుడు ఇలా ఉంది..

అనురాగ్ కశ్యప్.. ఈ మధ్య కాలంలో మీడియాలో బాగా నానుతున్న పేరు. వివాదాస్పద కాన్సెప్టులతో సినిమాలు తీసి మంట పుట్టించగలడంలో వర్మకు ఎన్నో రెట్లు ప్రతిభావంతుడితను. ఇప్పటి వరకూ కశ్యప్ తొలి సినిమా విడుదల కాలేదంటే.. తీవ్ర వివాదాల పాలైన ఆ సినిమాను ఇండియాలో నిషేధించారంటే కశ్యప్ కాన్సెప్టులు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇక కశ్యప్ దర్శకత్వం వహించిన రెండో సినిమా రెండేళ్ల పాటు సెన్సార్ కోరల్లో నలిగింది. 

హుస్సేన్ జైదీ అనే జర్నలిస్టు ముంబై సీరియల్ బ్లాస్ట్స్ మీద రాసిన పుస్తకాన్నే సినిమాగా తీసినా.. వాస్తవికతకు చాలా దగ్గరగా ఉండటంతో ‘బ్లాక్ ఫ్రైడే’ అనే ఆ సినిమా రెండు సంవత్సరాల పాటు సెన్సార్ వద్దే ఆగిపోయింది. చివరకు ఎలాగోవిడుదలై.. ముంబై వరస పేలుళ్ల విధానాన్ని కళ్లకు కట్టింది. సీరియల్స్‌కు రాతలు రాసుకునే కశ్యప్‌ను బాలీవుడ్‌కు తీసుకొచ్చిన ఘనత వర్మదే. వర్మ తీసుకురాకపోతే అతడు రాలేడని అనలేం కానీ.. కశ్యప్‌కు మాత్రం వర్మపై గురుభావం ఉంది. అయితే వర్మ ఈ మధ్య కాలంలో తీసే సినిమాలను తను చూడడం లేదని కశ్యప్ స్పష్టం చేస్తాడు.

ఎందుకంటే.. ఇప్పుడు ఆయన సినిమాలను చూస్తే.. ఆయనపై దర్శకత్వ ప్రతిభపై గౌరవం తగ్గిపోతుంది అనేది కశ్యప్ కంప్లైంట్! అయితే కశ్యప్ మీద కూడా ఇప్పుడు ఇలాంటి ఫిర్యాదులే అందుతున్నాయి ఆయన అభిమానుల నుంచి. బ్లాక్ ఫ్రైడే తర్వాత ఆయన తీసిన ‘నోస్మోకింగ్’పై దుమ్మెత్తిపోశారు జనాలు. ఆ తర్వాత కొన్ని సినిమాలతో ఫర్వాలేదనిపించిన.. బాంబే వెల్వెట్ కశ్యప్ తీసిన డిజాస్టర్‌గా నిలిచిపోయింది. సహ నిర్మాతగా ‘ఉడ్తాపంజాబ్’తో ప్రశంసలు అందుకున్నాడు కశ్యప్.

నీరజ్ పాండే... రియాలిస్టిక్ ఇన్సిడెంట్స్‌ను థ్రిల్లింగ్ సినిమాలుగా మలచి చూపించిన నీరజ్ పాండే ఒకానొక సమయంలో కంపెనీలో పనిచేసిన వ్యేక్త. ప్రస్తుతం టీజర్ దశలో ఆసక్తి రేపుతున్న ‘రుస్తుం’ సినిమాకు పాండే మాటలు రాశాడు. అలాగే టీమిండియన్ వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథాంశాన్ని సినిమాగా తీస్తున్నాడు. ఇవిగాక పాండే తీసిన మంచి సినిమాల జాబితా వేరే ఉంది. 

అందులో ముఖ్యమైనవి.. ఏ వెన్స్ డే, స్పెషల్ చబ్బీస్, బేబీ తదితరాలు. ఉగ్రవాద సమస్య మీద తీసిన వెన్స్ డేకు జాతీయ స్థాయిలో అవార్డులు దక్కాయి. అనేక ప్రాంతీయ భాషల్లో ఆ సినిమా రీమేక్ అయ్యింది. ఇక ముంబైలో ఎన్నో సంవత్సరాల కిందట జరిగిన ఒక దొంగతనం ఆధారంగా చేసుకుని పాండే చక్కటి కథ, కథనాలు అద్ది రూపొందించిన ‘స్పెషల్ చబ్బీస్’ నిజంగా వండర్. ఈ సినిమా విషయంలో పాండే ప్రతిభకు ఎలాంటి అవార్డులు ఇచ్చినా తక్కువే.

షిమిత్ అమిన్.. ఇతడివి మెరిసింది రెండు మూడు సినిమాలతోనే అయినా.. వర్మ ప్రభావం ఎక్కువగా కలిగిన దర్శకుడితను. వర్మ చేసిన కొన్ని తెలుగు సినిమాలకు కూడా అమిన్ సహాయ దర్శకుడిగా పనిచేశాడు. వర్మ నిర్మాతగా మారి చేసిన దర్శకుల్లో అమిన్ ఒకరు. అబ్ తక్ చప్పన్‌లో షిమిత్ దర్శకుడయ్యాడు. దానికి వర్మ నిర్మాతగా వ్యవహరించాడు. ముంబై పోలిస్ ఇన్సెపెక్టర్ దయానాయక్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించి సూపర్ హిట్‌ను కొట్టాడు షిమిత్. పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా ఈ సినిమాప్రదిర్శితం అయ్యింది. 

తర్వాతి కాలంలో ఇదే సినిమాను ఆధారంగా చేసుకుని తెలుగులో సిద్ధం సినిమా వచ్చింది. జగపతి బాబు హీరోగా నటించిన ఈ సినిమాకు వర్మ కంపెనీకే చెందిన జేడీ చక్రవర్తి దర్శకత్వం వహించినట్టున్నాడు. అబ్ తక్ చప్పన్ తర్వాత మూడేళ్ల విరామానంతరం ‘చెక్ దే ఇండియా’ వంటి గొప్ప సినిమాను రూపొందించాడు షిమిత్. షారూక్ హీరోగా నటించిన ఈ సినిమాను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. జాతీయ అవార్డును కూడా అందుకుంది ఈ సినిమా. అయితే ఆ తర్వాత మాత్రం షిమిత్ కెరీర్ నెమ్మదించింది. అయితే గత దశాబ్దంలో వచ్చిన ఉత్తమ సినిమాల్లో ఒకదానికి దర్శకుడిగా షిమిత్ నిలుస్తాడు.

వీళ్లుగాక వర్మ కంపెనీ దర్శకుల్లో మిగతా వారి పరిస్థితి మాత్రం గొప్పగా ఏం లేదు. ప్రవాల్ రామన్ వంటి వాళ్ల అడ్రస్ గల్లంతయ్యింది. తెలుగులో వర్మ శిష్యుల్లో చాలా మంది ఫేడవుట్ అయ్యారు. వర్మ దగ్గర శిష్యరికం చేసిన వాళ్లు.. వర్మ నిర్మాణంలో వచ్చిన సినిమాలకు దర్శకత్వం వహించి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కొందరు మాత్రమే పోటీలో ఉన్నారు. శివనాగేశ్వరరావు వంటి దర్శకుడికి ఇప్పుడు చేతిలో సినిమాలేమీ లేవు. ఇక కృష్ణ వంశీ గమనం పడుతూ లేస్తూ సాగుతోంది. తెలుగులో వర్మకు సిసలైన వారసుడు కృష్ణవంశీనే. వర్మ సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేయడంతో పాటు.. వర్మ ప్రొడక్షన్‌లో వచ్చిన సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు కృష్ణవంశీ. గులాబీ, డేంజర్ వంటి సినిమాలను చూస్తే వర్మ స్కూల్ ప్రభావం ఏమిటో తెలుస్తుంది.

 వర్మ కంపెనీలో కొంత కాలమైన పనిచేసి.. ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్నది పూరీ జగన్నాథే అనుకోవాలి. అయితే పూరీ నుంచి కూడా పాతమెరుపుల్లేవు. తన పాత సినిమాల్లోని సీన్లనే మళ్లీ మళ్లీ వాడేసుకునే దశలో ఉన్నాడు పూరీ. సరైన కథ దొరికితే పూరీ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.

ఇక వర్మ దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలకు ఘోస్ట్‌గా దర్శకత్వం వహించిన వ్యక్తి జేడీ చక్రవర్తి. మధ్యాహ్నపు హత్య సినిమాకు దర్శకుడిగా వర్మ పేరే పడ్డా.. దాన్నంతా జేడీనే చుట్టేశాడని అంటారు. ఆ తర్వాత జేడీ స్వయంగా దర్శకుడిగా మారాడు. హిందీలో వర్మ కంపెనీలో వచ్చిన దర్వాజా బంద్ రఖో, అబ్ తక్ చప్పన్ వంటి సినిమాలను తెలుగులో రీమేక్ చేశాడు. అయితే ప్రయోజనం లేకపోయింది. ఆఖరికి వర్మ కంపెనీలో వచ్చి ‘మనీ’ సినిమాకు రెండో సీక్వెల్ అంటూ తీసిన ‘మనీ మనీ మోర్ మనీ’ కూడా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు కూడా నిర్మాణ దశలో ఉన్న వర్మ కంపెనీ సినిమాలకు దర్శకత్వ బాధ్యతల్లో ఉన్నట్టున్నాడు జేడీ. ఇక వర్మతో కలిసి పనిచేసిన నేపథ్యం ఉన్న తేజ, రసూల్ ఎల్లోర్ వంటి వాళ్లు కూడా తర్వాతి కాలంలో దర్శకులుగా మారారు. వాళ్ల పరిస్థితి కూడా ఇప్పుడు ఏమంత గొప్పగా లేదు.

భారతీయ సినిమాలో ఒక కెరటం లాంటిది వర్మ కంపెనీ. కొంత క్వాలిటీ ప్రోడక్ట్‌ను ఇచ్చినా.. ప్రత్యేకతను చూపించినా.. ప్రస్తుతానికి అయితే ఒకరిద్దరు మినహా ఈ కంపెనీ నుంచి వచ్చిన వాళ్లంతా ఉనికి పాట్లు పడుతున్నారు. అలాగే గత పదేళ్లలో వర్మ కంపెనీ నుంచి ఒక సరైన దర్శకుడు కూడా బయటకు రాకపోవడాన్ని కూడా గమనింవచ్చు. మెరుపులు మెరిపించిన వాళ్లు కూడా 2005కు ముందు దర్శకులుగా కెరీర్ మొదలుపెట్టిన వాళ్లే.

Show comments