ఎమ్బీయస్‌: సింధియా అవస్థ

2018 డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్‌లో 230 సీట్లలో కాంగ్రెసుకు 114 సీట్లు వచ్చి, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కనబడగానే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే ప్రశ్న ముందుకు వచ్చింది. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్‌ యువతరాన్ని ప్రోత్సహిస్తాడు కాబట్టి రాజస్థాన్‌లో సచిన్‌ పైలట్‌ను, మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రులను చేస్తాడని అనుకున్నారు. కానీ సోనియా రంగంలో దిగి, సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూర్చడానికి, నడపడానికి చాతుర్యం కావాలి కాబట్టి అనుభవం ఉన్న వృద్ధ నాయకత్వమే కావాలి అంటూ రాజస్థాన్‌లో గెహలోట్‌ను, మధ్యప్రదేశ్‌లో కమల్‌ నాథ్‌ను సిఎంలుగా చేసింది. యువ పోటీదారులకు ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్‌ చేస్తే పైలట్‌ తీసుకున్నాడు, సింధియా వద్దన్నాడు. కమల్‌ టక్కుటమార విద్యలతో నలుగురు స్వతంత్రుల, ఒక ఎస్పీ, యిద్దరు బియస్పీ సభ్యుల మద్దతు కూడగట్టుకున్నాడు.

సింధియా ఉపముఖ్యమంత్రి పదవి వద్దన్నాడు కాబట్టి పోనీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తారేమో ననుకుంటే అదీ చేయలేదు. రెండు అధికార కేంద్రాలు ఏర్పడతాయి కాబట్టి సోనియా వద్దందని వార్త. గత పది నెలలుగా కమలే రెండు బాధ్యతలూ నిర్వహిస్తున్నాడు.  జరుగుతున్నదేమిటంటే కమల్‌, దిగ్విజయ్‌ సింగ్‌ చేతులు కలిపి సింధియాను పక్కకు నెట్టేశారు. గతంలో దిగ్విజయ్‌ రాష్ట్రంలో పాలించేటప్పుడు కమల్‌ దిల్లీలో ఉండి, అతనికి మద్దతు యిచ్చేవాడు. ఇప్పుడు కమల్‌ రాష్ట్రంలో ఉండగా దిగ్విజయ్‌ దిల్లీలో అతనికై లాబీయింగు చేస్తున్నాడు. కాబినెట్‌ కూర్చినపుడు కమల్‌ అనుయాయులు, దిగ్విజయ్‌ అనుయాయులు, సింధియా అనుయాయులకు తలా 8 పదవులు దక్కాయి.

సింధియా పలుకుబడిని హరించడానికి కమల్‌, దిగ్విజయ్‌ చాలా యత్నాలు చేశారు, చేస్తున్నారు. హై కమాండ్‌ వారికి వంత పాడుతోంది. పార్లమెంటు ఎన్నికల వేళ అతన్ని ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల పరిశీలకుడిగా వేశారు. 2014లో బిజెపి ప్రభంజనంలో కూడా గుణ నియోజకవర్గం నుంచి నెగ్గిన అతనికి యీసారి టిక్కెట్టు చాలా ఆలస్యంగా ప్రకటించారు. చివరకు అత్యంత ఆశ్చర్యకరంగా అతను ఓడిపోయాడు. వీళ్లిద్దరూ ఏదో కుట్ర చేసి అతన్ని ఓటమిపాలు చేశారని గుసగుసలున్నాయి. ఇప్పుడు అతన్ని మహారాష్ట్ర ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీలో వేశారు. అంటే ఏదో విధంగా రాష్ట్ర రాజకీయాల నుంచి అతన్ని దూరంగా ఉంచే ప్రయత్నాలు సాగుతున్నాయి. వీటితో విసిగిపోయిన సింధియా అనుచరులు బిజెపిలో చేరమని అతనిపై ఒత్తిడి తెస్తున్నారు. 'ఇప్పటికే బిజెపిలో నాయకులు చాలామంది ఉన్నారు. నేను వెళితే వాళ్లను పక్కకు పెట్టి నాకు మంచి పదవి యిస్తారనే నమ్మకం లేదు' అని అతను వారికి చెప్పాడట.

పార్లమెంటు ఎన్నికలలో గతంలో 2 సీట్లు వస్తే యీసారి ఒకటే గెలవడం, కమల్‌ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి చూసి యికనైనా పార్టీని చూసేందుకు ఎవరో ఒకరు ఫుల్‌టైమర్‌ ఉండాలని అలజడి కలిగింది. సెప్టెంబరు 1 కల్లా అది జరుగుతుందని, సింధియాను ఆ పదవిలో కూర్చోబెడతారని అనుకున్నారు. కానీ అది జరగలేదు. గ్వాలియర్‌లో అతని అనుయాయులు అతనికి పదవి యివ్వాలంటూ పోస్టర్లు కూడా వేసినా హై కమాండ్‌లో చలనం లేదు. యువతరమంటూ కలవరించిన రాహుల్‌ తనే తప్పుకోవడంతో సింధియా తరఫున మాట్లాడేవారూ లేరు. సింధియా వంటి గట్టి నాయకుణ్ని కాకుండా రాజకీయంగా బలహీనుడైన వాణ్ని అధ్యక్షుడిగా పెట్టాలని సోనియా ఆలోచనట. మాజీ ముఖ్యమంత్రి అర్జున్‌ సింగ్‌ కొడుకు అజయ్‌ సింగ్‌ను ఆ పదవిలో కూర్చోబెడితే బాగుంటుందని దిగ్విజయ్‌ సిఫార్సు చేస్తున్నాట్ట.

దాంతో తిక్క రేగిన సింధియా తన పార్టీతోనే పోట్లాడడానికి తయారవుతున్నాడు. 'రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని, ప్రభుత్వం ఏదో ఒకటి చేయకపోతే తనే రంగంలో దిగాల్సి వుంటుందని' అతను యీ మధ్య ఓ ప్రకటన చేశాడు. దిగ్విజయ సింగ్‌పై ధ్వజమెత్తిన అటవీశాఖ మంత్రి ఉమంగ్‌ సింఘార్‌కు బహిరంగ మద్దతు తెలుపుతూ మాట్లాడాడు. ఉమంగ్‌ ధ్వజమెత్తిన సందర్భం ఏమిటంటే - తను చేసిన రాజకీయపరమైన అభ్యర్థనల సంగతి ఏమైందంటూ దిగ్విజయ్‌ యిటీవల మంత్రులందరికీ (అర్బన్‌ అడ్మినిస్ట్రేషన్‌ మంత్రిగా ఉన్న తన కొడుకు జై వర్ధన్‌ సింగ్‌కు తప్ప) ఉత్తరాలు రాశాడు. 'ఇది ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేయడమే, ప్రతిపక్షాలకు అస్త్రాలను అందించడమే. ఓ పక్క పరోక్షంగా ప్రభుత్వాన్ని నడుపుతూ ఆయన యిలా చేయడమేమిటి?' అంటూ ఉమంగ్‌ బహిరంగంగా విమర్శించాడు. ఉమంగ్‌ గిరిజన ఎమ్మెల్యే. గతంలో దిగ్విజయ్‌ కాబినెట్‌లో ఉపముఖ్యమంత్రిగా పని చేసిన జమునాదేవికి మేనల్లుడు. రాహుల్‌ గాంధీ సిఫార్సుతో యిప్పుడు మంత్రి అయ్యాడు. రాహుల్‌ నిష్క్రమణతో కమల్‌కు దగ్గరవుతున్నాడు. ఇప్పుడీ ప్రకటనలతో దిగ్విజయ్‌, కమల్‌ల మధ్య దూరం పెరుగుతుందని అంచనా. సింధియాకు కావలసినది అదే కాబట్టి అతను ఉమంగ్‌ను సమర్థిస్తున్నాడు.

దిగ్విజయ్‌ మద్దతుతో కమల్‌ గొప్పగా పాలించేస్తూ ఉంటే సింధియాను నిర్లక్ష్యం చేయడానికి సోనియాకు తగినంత కారణం ఉందనుకోవచ్చు. కానీ అక్కడ అలాటి పరిస్థితి ఏమీ లేదు. ఋణమాఫీ విషయంలో కాంగ్రెసు వేసిన కప్పగంతుల కారణంగా రైతాంగం వారి మీద కత్తి కట్టింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెసు రూ.2 లక్షల వరకు ఋణమాఫీ చేస్తానని రైతులను ఆకట్టుకుంది. దాంతో బిజెపికి కంచుకోట లాటి మాళ్వా నిమార్‌ ప్రాంతంలో బిజెపికి 56 నుంచి 28కి సీట్లు తగ్గగా కాంగ్రెసుకు 35 నుంచి 66 సీట్లకు ఎగబాకింది. పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి బిజెపి కార్యకర్తలు యిల్లిల్లూ తిరిగి ఋణమాఫీ విషయంలో కాంగ్రెసు చేసిన 'దగా' గురించి రైతులను నమ్మించడంతో అక్కడున్న 8 సీట్లలో కాంగ్రెసు ఒక్కటి కూడా గెలవలేక పోయింది. దీనికి తోడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనా, ఉజ్జ్వలా యోజనా వంటి 12 సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేసి, అక్కడ బిజెపిని దింపేస్తే యివన్నీ ఆగిపోతాయని కన్విన్స్‌ చేశారు.

కమల్‌ అధికారం చేపట్టిన గంటల్లోనే జై కిసాన్‌ ఋణమాఫీ స్కీమును అమలు చేస్తున్నామని ప్రకటించాడు. పార్లమెంటు ఎన్నికల తర్వాత పోడు వ్యవసాయం చేసే సంచార రైతులకు కూడా మేలు చేస్తానన్నాడు. తర్వాత భారం తగ్గించుకోవడానికి రూ.2 లక్షలకు మించి ఋణం తీసుకున్న రైతులకు యీ స్కీము వర్తించదన్నాడు. అలా 5 లక్షల మందిని జాబితాలోంచి తీసేశారు. ఇది వాళ్లకు షాక్‌ కలిగించింది. రూ.3 లక్షలు అప్పు తీసుకున్న రైతు, రూ.2 లక్షల వరకు ప్రభుత్వం తీరుస్తుందని, పై లక్ష మాత్రమే తను తీర్చుకోవాలనీ అనుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మొత్తం 3 లక్షలూ అతనే కట్టాలనేసరికి భగ్గుమన్నాడు. తర్వాత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, క్లాస్‌ 1, 2, 3 ప్రభుత్వాధికారులు, ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ పదవులు అనుభవిస్తున్నవారు, అనుభవించినవారూ అర్హులు కాదన్న నియమం పెట్టి 7 లక్షల మందిని తీసేశారు.

ఈ విధంగా చేసినా చివరకు 48 లక్షల మంది తేలారు. వీరిలో 50 వేల రూ.ల కంటె తక్కువ అప్పు ఉన్న రైతుల ఋణాలు, ఎన్‌పిఏ (నిరర్ధక ఆస్తులు)గా మారిన రూ. 2 లక్షల ఋణాలను ప్రభుత్వం మొదటగా తీర్చేసింది. దీనికి రూ.7 వేల కోట్లు ఖర్చయింది. 20 లక్షల మంది రైతులకు మేలు కలిగింది. 50 వేల నుంచి లక్ష రూ.ల పరిధిలో ఉన్న మరో 6 లక్షల మందికి తర్వాతి విడతలో మాఫ్‌ చేస్తామంది. ఇక మూడో కేటగిరీ (లక్ష నుంచి 2 లక్షలు)లో కోఆపరేటివ్‌, గ్రామీణ బ్యాంకుల నుంచి తీసుకున్న వారి అప్పులు తీర్చేసి, ఆ తర్వాత మిగిలినవారి సంగతి చూస్తామంది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమంత బాగా లేదు. రూ.34 వేల కోట్లు బిజెపి నుంచి వారసత్వంగా వచ్చింది. పైగా గోధుమ సేకరణపై బోనస్‌, 'భావ్‌ అంతర్‌' స్కీము వంటి బిజెపి పథకాలను కొనసాగించవలసిన నైతిక బాధ్యత కూడా ఉంది. గోధుమ ఉత్పత్తికి అయిన ఖర్చుకి, కేంద్రం యిచ్చే మద్దతు ధరకు మధ్యలో గల ధరలో తేడాను భావాంతర్‌ స్కీము కింద రాష్ట్రం భరిస్తూ వచ్చింది. రాష్ట్ర ఆర్థిక స్థితి తెలిసి కూడా అధికారంలోకి వద్దామనుకున్న పార్టీ ఎడాపెడా కొత్త పథకాలపై హామీలు గుప్పిస్తుంది. గద్దె నెక్కాక 'ఖాళీ ఖజానా యిచ్చారు' అని వాపోతూ ఉంటుంది. ఇక్కడా అదే కథ.

ఋణమాఫీ సత్ఫలితాలను యివ్వకపోగా దానికే చాలా నిధులు ఖర్చవడంతో ప్రభుత్వం యితర హామీలు నెరవేర్చ లేకపోయింది. కొత్త పథకాలను ప్రవేశపెట్టలేక పోగా ఉన్న సంక్షేమ పథకాలను కూడా కుదించవలసి వచ్చింది. ఇలా రెండున్నర నెలలు గడిచేసరికి ఎన్నికల కోడ్‌ వచ్చి పడింది. ముఖ్యమంత్రిగా కమల్‌ వస్తే చింద్వారా నియోజకవర్గంలో చేసినట్లే తన పరిచయాలతో రాష్ట్రమంతటికీ పెట్టుబడులను రప్పించి పరిశ్రమలు పెట్టిస్తాడని, ఉద్యోగాలు వస్తాయని ఆశపడిన యువత నిరాశ చెందారు. ఉద్యోగాలకు టైమ్‌టేబుల్‌ యిస్తూ కమల్‌ ప్రకటించిన 'యువ స్వాభిమాన్‌ యోజనా' పథకం వారిలోకి వెళ్లలేదు.

1990ల నుంచి మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఓటర్ల ధోరణి గమనిస్తే వాళ్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకరిని ఆదరిస్తే, పార్లమెంటు ఎన్నికల సమయంలో మరొకరిని ఆదరిస్తున్నారు. అవి కొద్ది నెలల వ్యవధిలో వచ్చినా సరే, యీ లోగా మనసు మార్చేసుకుంటున్నారు. నవంబరులో 40.9% ఓట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెసు మే నాటికి పార్లమెంటు ఎన్నికలలో 34.5% ఓట్లు మాత్రమే తెచ్చుకుంది. అప్పుడు 41% తెచ్చుకున్న బిజెపి యీసారి 58% తెచ్చుకుంది. అంటే బిజెపికి 17% పెరిగితే, కాంగ్రెసుకు 6.4% తగ్గాయి. మొత్తం 29 సీట్లలో ఒక్కటంటే ఒక్కటే ఒక్కటి కాంగ్రెసుకి దక్కింది. నెగ్గిన చింద్వారా సీటు కమల్‌ది. అతను అక్కణ్నుంచి 9 సార్లు (1977లో సైతం) గెలిచాడు. ఈ సారి అభ్యర్థి అతని కొడుకు నకుల్‌! కానీ గెలిచినది కేవలం 37 వేల తేడాతో! భోపాల్‌లో ప్రజ్ఞా ఠాకూర్‌ అనే 'సాధ్వి' ఎన్నికలలో అవాకులు, చెవాకులు వాగినా దిగ్విజయ్‌ వంటి దిగ్గజాన్ని 3 లక్షల తేడాతో ఓడించింది.

ఒబిసి కోటాను 14 నుంచి 27కు పెంచడం వలన వాళ్లేదో ఓట్లేస్తారని అనుకున్నారు కానీ అది జరగలేదు. అసెంబ్లీ ఎన్నికలలో 41% మంది ఒబిసిలు కాంగ్రెసుకు ఓటేయగా, పార్లమెంటుకు వచ్చేసరికి 27% మంది మాత్రమే వేశారని ఓ సర్వే చెపుతోంది. బిజెపికి అది 48%, 66%. అగ్రవర్ణాలు బిజెపికి అసెంబ్లీ ఎన్నికలలో 58% మంది వేసినా, పార్లమెంటులో 75% వేశారు. కాంగ్రెసుకు అది 33%, 25%. ముస్లిముల విషయానికి వస్తే అసెంబ్లీలో కాంగ్రెసుకు 52%, బిజెపికి 15% వేసి, పార్లమెంటులో కాంగ్రెసుకు 67%, బిజెపికి 33% వేశారట. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల చట్టాన్ని బిజెపి నీరుకారుస్తోందన్న అభిప్రాయంతో ఆ వర్గాలు అసెంబ్లీ ఎన్నికలలో  కాంగ్రెసుకు మద్దతు యిచ్చాయి. దళితులు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసుకు 49%, బిజెపికి 33% వేయగా, పార్లమెంటు ఎన్నికలలో అవి 50%, 38% అయ్యాయి. గతంలో బహుజన సమాజ్‌ పార్టీకి యీ ఓట్లన్నీ వెళ్లేవి. కానీ వారి బలం 6.5% నుంచి 5%కి క్షీణించింది.

గ్వాలియర్‌-చంబల్‌ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు జనాభాలో 20% ఉన్నారు. 2018 ఏప్రిల్‌లో జరిగిన భారత్‌ బంద్‌ సందర్భంగా ఆ ప్రాంతంలో 6గురు ఎస్సీ, ఎస్టీలు చంపబడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి అక్కడున్న 27 సీట్లలో కాంగ్రెసు 21 గెలిచింది. గిరిజనులు అధికంగా ఉన్న మహాకోసల్‌ ప్రాంతంలో 38 సీట్లలో కాంగ్రెసు 24 గెలిచింది. పై సర్వే ప్రకారం అప్పుడు వారి ఓట్లలో 40% కాంగ్రెసుకు పడగా, 30% బిజెపికి పడ్డాయి. కానీ పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెసుకు 38%, బిజెపికి 54% వేేశారు. దాంతో 4 సీట్లున్న గ్వాలియర్‌-చంబల్‌ ప్రాంతంలో బిజెపియే అన్నీ గెలుచుకుంది. ఇదే ప్రాంతంలోని గుణ నియోజకవర్గంలో 1.26 లక్షల తేడాతో సింధియా ఓటమి అనూహ్యమైనది. పైగా అతను ఓడిపోయినది ఒకప్పటి తన సహాయకుడు కెపి యాదవ్‌ చేతిలో! అతను 2002 నుంచి అక్కడ గెలుస్తూ వచ్చాడు. 2014లో బిజెపి 54.8% ఓట్లు, కాంగ్రెసుకు 35% ఓట్లు వచ్చినప్పుడు కూడా అతను గెలిచాడు. తన నియోజకవర్గానికి మెడికల్‌ కాలేజీ, ఇంజనీరింగు కాలేజీలు, స్టేడియం వగైరాలు తెప్పించినా, తండ్రి, నాయనమ్మ కంటె ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉన్నా అతనెందుకు ఓడాడు అంటే ఆ నియోజకవర్గంలో 70% రైతులేట. ఋణమాఫీ వైఫల్యం దెబ్బ కొట్టిందంటున్నారు.

కాంగ్రెసు నాయకుల మధ్య అసెంబ్లీ ఎన్నికలలో కనబడిన సఖ్యత పార్లమెంటు ఎన్నికల నాటికి కానరాలేదు. పార్లమెంటు ఫలితాల తర్వాత కమల్‌ తను దిగిపోతానన్నాడు కానీ పార్టీ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. జి.ఎస్‌ దామోర్‌ అనే బిజెపి ఎమ్మెల్యే ఎంపీగా నెగ్గడంతో అతని ఝాబువా అసెంబ్లీ నియోజకవర్గంలో అక్టోబరు 21న ఉపయెన్నిక జరగనుంది. బిజెపి భానూ భూరియా అనే యువకుణ్ని నిలబెట్టగా, కమల్‌ సిఫార్సుపై కాంగ్రెసు మాజీ కేంద్రమంత్రి కాంతిలాల్‌ భూరియాకు టిక్కెట్టిచ్చింది. దాంతో జేవియర్‌ మేడా అనే నాయకుడికి కోపం వచ్చింది. బిజెపిలో కూడా టిక్కెట్టు ఆశించి భంగపడిన కల్యాణ్‌ దామోర్‌ పార్టీ నుంచి రాజీనామా చేశాడు.

ఈ ఎన్నికలో కాంగ్రెసు నెగ్గకపోతే కమల్‌ ప్రతిష్ఠ మసకబారుతుంది. కమల్‌ కుటుంబసభ్యులపై, సన్నిహితులపై ఏప్రిల్‌లో జరిపిన ఇన్‌కమ్‌టాక్స్‌ దాడులు పార్లమెంటు ఎన్నికలలో కాస్త ప్రభావం చూపించాయి. కమల్‌ మేనల్లుడు రతుల్‌ పూరి పేరు అగస్టావెస్ట్‌ల్యాండ్‌ స్కాములో వినవస్తోంది. బిజెపి నాయకులు దొరికితే వారిని కూడా కేసుల్లో యిరికించి అందరం ఒకే తానులో ముక్కలం అని చూపించడానికి కమల్‌ తాపత్రయ పడుతున్నాడు. జులై 27న రాష్ట్ర ప్రభుత్వపు ఎకనమిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌ (ఇఓడబ్ల్యు) నిర్మల్‌ అవస్థి, వీరేంద్ర పాండే అనే వారిని అరెస్టు చేసింది.

బిజెపి హయాంలో మంత్రిగా చేసిన నరోత్తమ్‌ మిశ్రా దగ్గర ఒఎస్‌డి (ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ)గా వీరేంద్ర పనిచేయగా, నిర్మల్‌ ఆయన యింట్లో టెలిఫోన్‌ ఆపరేటర్‌గా పని చేశాడు. ఇద్దరూ కలిసి వాటర్‌ రిసోర్సెస్‌ డిపార్టుమెంటుకు సంబంధించిన ఈ-టెండర్లను మేనేజ్‌ చేశారని అభియోగం. ఆ డిపార్టుమెంటులో పని చేసే యింజనియర్లు, పోర్టల్‌ నిర్వహించిన ప్రయివేటు కంపెనీ సహాయంతో వీరు అక్రమాలు చేశారట. ఒక గుజరాతీ కంపెనీకి రూ.116 కోట్ల టెండర్‌ కట్టబెట్టే వ్యవహారంలో మధ్యవర్తిగా పని చేసిన మనీశ్‌ ఖారే అనే మే నెలలో అరెస్టు చేయగా, అతనే వీళ్లిద్దరి పేర్లూ చెప్పాడట. తన సిబ్బందిని అరెస్టు చేసి వారి చేత తన పేరు చెప్పించాలని కమల్‌ ప్రయత్నిస్తున్నారని నరోత్తమ్‌ ఆరోపిస్తున్నాడు. 'ఈ-టెండర్లను నిర్వహించేది ఉన్నతాధికారులు తప్ప వీరి లాటి చిన్న ఉద్యోగులు కాదు' అని అతని వాదన.

ఈ నరోత్తమ్‌ తను అధికారంలో ఉండగా యిద్దరు కాంగ్రెసు ఎమ్మెల్యేలను బిజెపిలోకి ఫిరాయింప చేశాడు. ఇప్పుడు కూడా కొందరు కాంగ్రెసు ఎమ్మెల్యేలను లాక్కుని వచ్చి కమల్‌ ప్రభుత్వాన్ని పడగొడతానని ప్రకటించుకున్నాడు. ప్రస్తుతం కేవలం ఎమ్మెల్యే అయిన నరోత్తమ్‌కు కేంద్రమంత్రులకు యిచ్చే వై కేటగిరీ యిప్పిస్తున్నాడు, అతనికి సన్నిహితుడైన అమిత్‌ షా! నరోత్తమ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిగా ఉండగా ముకేశ్‌ శర్మ అనే అవినీతిపరుడైన వ్యాపారవేత్త ఒక హైదరాబాద్‌ కంపెనీ ద్వారా లంచం యిచ్చాడని ముకేశ్‌ యింటిపై యిన్‌కమ్‌టాక్స్‌ శాఖ చేసిన దాడుల్లో డాక్యుమెంట్లు దొరకడంతో ఆ శాఖ 2008లోనే ఓ కేసు నమోదు చేసి ఉంది.  ఇఓడబ్ల్యు యిప్పుడు దానిపై కూడా విచారణ జరుపుతోంది. కమల్‌పై కత్తులు దూస్తున్న బిజెపి జనరల్‌ సెక్రటరీ కైలాస్‌ విజయవర్గీయకు వ్యాపమ్‌ కేసులో పాత్ర ఉందంటారు. కైలాశ్‌కు బుద్ధి చెప్పడానికి కమల్‌ ఆ కేసు కూడా తిరగతోడే ప్రయత్నాల్లో ఉన్నాడట.

పరిస్థితులు యిలా వుండగా 48 ఏళ్ల శ్వేతా సప్నిల్‌ జైన్‌ అనే ఆమె కొన్నేళ్లగా నిర్వహిస్తూ వచ్చిన హనీ ట్రాప్‌ వ్యవహారం సెప్టెంబరు మూడో వారంలో తెరమీదకు వచ్చింది. ముఖ్యమైన రాజకీయ నాయకులకు, అధికారులకు అమ్మాయిలను ఎర వేసి, వారి రాసలీలలను రహస్యంగా రికార్డు చేసి ఆడియో, వీడియో టేపులను చూపించి వారిని బ్లాక్‌మెయిల్‌ చేసి, డబ్బు గుంజడం ఆమె పని. ఆమెకు ముఖ్య సహాయకురాలిగా పని చేసిన శ్వేతా విజయ్‌ జైన్‌ కూడా సాంకేతిక నిపుణురాలే. బెంగుళూరుకి చెందిన సంతోష్‌ నిర్వహిస్తున్న సైబర్‌ సేఫ్టీ, సైబర్‌ ఫోరెన్సిక్‌, ఫోన్‌ భద్రతకు సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా శ్వేత చాటింగ్‌, ఎస్సెమ్మెస్‌, ఫోన్‌కాల్స్‌ రికార్డు చేసింది. ఈమె 2009-13 మధ్య బిజెపి యూత్‌ వింగ్‌లో పని చేసిందిట. కాంగ్రెసు ఐటీ సెల్‌ వైస్‌ ప్రెసిడెంటు అమిత్‌ సోనీ భార్య బర్ఖా కూడా యీ టీములో సభ్యురాలు. మోనికా యాదవ్‌ అనే 18 ఏళ్ల పేద అమ్మాయి కూడా ఆ టీములో ఉంది. ఆమె అప్రూవర్‌గా మారవచ్చంటున్నారు. ఆరతీ దయాల్‌ మరో సభ్యురాలు. కారు డ్రైవర్‌ ఓంప్రకాశ్‌ కోరీ వీరికి సహాయకుడు. వీరందరినీ ఇండోర్‌లో, భోపాల్‌లో అరెస్టు చేశారు.

వీరి వలలో చిక్కినవారిలో కొందరు క్యాష్‌ యిచ్చారు, మరి కొందరు యిరువురు శ్వేతలు నడిపే కంపెనీలకు టెండర్లు, కాంట్రాక్టులు యిప్పించారు. ఇంకొందరు వీళ్లు నడిపే బోగస్‌ స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు యిప్పించారు. ఈ ముఠా తనను రూ. 3 కోట్లు యిమ్మనమని బ్లాక్‌మెయిల్‌ చేస్తోందంటూ ఇండోర్‌ మునిసిపల్‌ కార్పోరేషన్‌లో ఇంజనియర్‌ ఫిర్యాదు చేయడంతో వీరు పట్టుబడ్డారు. వీళ్ల దగ్గర 4 వేల వీడియోలు, ఆడియోలు, ఫోటోలు ఉన్నాయట. హనీట్రాప్‌ నిర్వాహకులు ఎన్నికల సమయంలో తమ వద్ద నున్న రాజకీయ నాయకుల వీడియోలను వారి ప్రత్యర్థులకు అమ్ముదామని చూశారట. గుత్తబేరంగా రూ. 30 కోట్లు అన్నారట. అన్నీ అక్కరలేదు, మా పోటీదార్లవి యిస్తే చాలు, వాళ్ల పరువు బజారు కీడుస్తాం అని అవతలివాళ్లు అన్నారు. విడివిడిగా యివ్వమని వీళ్లు కొన్నాళ్లు మొండికేశారు కానీ చివరకు అలాగే అమ్మవలసి వచ్చిందట. ప్రభుత్వం మారడంతో కంగారు పడి అయినకాడికి అమ్మేసుకుందామని చూసే తొందరలోనే పోలీసులకు పట్టుబడ్డారట.

దీనిపై బిజెపి కేంద్ర ఆధిపత్యంలో ఉన్న సిబిఐ చేత విచారణ చేయించాలంటోంది కానీ కమల్‌ రాష్ట్ర స్థాయిలో స్పెషల్‌ యిన్వెస్టిగేషన్‌ టీము (సిట్‌) వేయడం జరిగింది. దీని ద్వారా 15 ఏళ్లగా అధికారంలో ఉన్న బిజెపి నాయకుల, వారి హయాంలో వెలిగిన అధికారుల కార్యకలాపాలను బయటపెడదామని కమల్‌ ప్రయత్నం. కానీ ఆ క్రమంలో కాంగ్రెసు నాయకులు కూడా దొరికితే ఏం చేయాలో తెలియదు పాపం. తన పరిస్థితి బాగా లేని టైములో సింధియా వచ్చి ఎక్కడ దెబ్బ తీస్తాడోనని కమల్‌ భయం. అందువలన సోనియా అడిగినప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరైనా గిరిజనుణ్ని పెట్టాలని పట్టుబడుతున్నాడు. నువ్వూ, కమల్‌ యిద్దరూ కలిసి సిఫార్సు చేసిన వ్యక్తికి ఆ పదవి యిస్తానని సోనియా మెలిక పెడుతోంది.

అంటే అది తనకు దక్కదని సింధియాకు అర్థమై పోయింది. అందుకని కాంగ్రెసు అధిష్టానంపై రాళ్లు వేయడం మొదలుపెట్టాడు. నిన్న సల్మాన్‌ ఖుర్షీద్‌ ఒక వ్యాసం రాస్తూ ఓటమితో రాజీ పడలేకపోతున్న కాంగ్రెసు హరియాణా, మహారాష్ట్రలలో ఓడిపోవడం ఖాయం అని రాశాడు. 'మా నాయకుడు రాహుల్‌ పార్టీని అధ్వాన్న పరిస్థితిలో వదిలేసి వెళ్లిపోయాడు, అతని స్థానంలో వచ్చిన సోనియా తను తాత్కాలిక ప్రత్యామ్నాయమే అనుకుంటున్నారు. దాంతో పైన శూన్యం ఏర్పడింది.' అన్నాడు. అతని మాటలను సంజయ్‌ నిరుపమ్‌ అనే కాంగ్రెసు నాయకుడు సమర్థించాడు. సింధియా కూడా 'కాంగ్రెసు అర్జంటుగా ఆత్మపరిశీలన చేసుకోవాలి, లేకపోతే భవిష్యత్తు అంధకారమే' అన్నాడు. ఏ ప్రాధాన్యతా లేక కుములుతున్న సింధియా తెగించి ఏమైనా చేసినా చేయవచ్చనిపిస్తోంది.

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2019)
mbsprasad@gmail.com

Show comments