శర్వానంద్ రికార్డు?

'కథ లేదని ముందు నుంచి చెబుతూనే వున్నా' అంటూ ఓ స్టేట్ మెంట్ పడేసాడు హీరో శర్వానంద్ రణరంగం సినిమా గురించి. కథనాన్ని నమ్మి సినిమా చేసానన్నది ఆ స్టేట్ మెంట్ కు కొనసాగింపు. సరే ఈ సంగతి ఇప్పుడు తెలిసిందా? శర్వానంద్ కు? కథ విన్నపుడే ఇది పాత కథలా వుంది, సుధీర్ వర్మ ట్రాక్ రికార్డ్ తెలుసు. కథనం మాత్రం నమ్ముకుంటే పని జరుగుతుందా? అని ఆలోచించాలి కదా?

కానీ ఆ సంగతి ఎలావున్నా ఓ విషయంలో మాత్రం శర్వా రికార్డు సృష్టించాడు. సినిమాల జయాపజయాలు ఎలా వున్నా ఇప్పటి వరకు హారిక హాసిని సంస్థకు కానీ, సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు కానీ నష్టాలు లేవు. సినిమాలు యావరేజ్ అయినా, అజ్ఞాతవాసిలా డిజాస్టర్ అయినా, బయ్యర్లకు డబ్బులు వెనక్కు ఇచ్చినా, ఏం చేసినా, ఓ రూపాయి లాభంలోనే వుంటూ వచ్చారు తప్ప, చేతి డబ్బులు పడలేదు.

అలాంటిది తొలిసారి హారిక హాసిని సిస్టర్ కన్సర్న్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు మూడు నాలుగు కోట్లు నష్టం వచ్చేలా చేయగలిగిన సినిమాగా రణరంగం, ఆ సినిమా డైరక్టర్ గా సుధీర్ వర్మ, హీరోగా శర్వానంద్ ఆ సంస్థల చరిత్రలో మిగిలిపోతారు. వాళ్లనే ఎందుకు బ్లేమ్ చేయాలి అంటే, రెండేళ్లపాటు నిర్మాణం సాగి, ఖర్చు తడిసి మోపెడు అయినందుకు అన్నది సమాధానంగా వినిపిస్తోంది.

శర్వానంద్ మూడ్ ఔట్ అయినపుడల్లా షూటింగ్ లేట్ అయ్యేదని బోగట్టా. పడి పడి లేచెమనసు ఫ్లాప్ అయ్యేసరికి కొద్దిరోజులు మూడ్ అవుట్ అయి షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. సుధీర్ వర్మ టేకింగ్, సెట్ లు అన్నీకలిసి నిర్మాణ వ్యయాన్ని శర్వా మార్కెట్ కు మించి పెంచేసాయి. అదే సమయంలో పడి పడి లేచెమనసు సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో, రణరంగం మార్కెట్ డౌన్ అయిపోయింది.

ఆంధ్రలో పదికోట్ల రేషియోలో అమ్మగలిగిన కాంబినేషన్ సినిమాను ఏడుకోట్ల రేషియోలో అమ్మాల్సి వచ్చింది. దాంతో సినిమా టేబుల్ లాస్ అయింది. బాబుబంగారం, శైలజరెడ్డి అల్లుడు లాంటి యావరేజ్ టాక్ సినిమాలకు కూడా టేబుల్ లాస్ లేదు. కాసిన్ని డబ్బులు వెనక్కు అడ్జస్ట్ చేసినా ఇంకా మిగులులోనే వున్నారు.

కానీ ఆ రికార్డును రణరంగం ఇప్పుడు చెరిపేసేలా వుంది. ఆ ఘనత శర్వా-సుధీర్ ల టీమ్ కే దక్కింది. బహుశా కథలేదు సినిమా అని ముందుగా తెలిసినట్లు, లాభం వుండదు ఈ సినిమాకు అని కూడా ముందే తెలిసిందేమో?

‘బాహుబలి’ రికార్డ్స్ ను ‘సాహో’ అధిగమిస్తుందా?

Show comments