సంక్రాంతి టెన్షన్ ఎవరికి ఎక్కువ?

ఉరుము ఉరిమితే ఎవరి మీద పడితే ఎవరి మీద పడుతుందో తెలియదు. ఇటైనా పడొచ్చు.. అటైనా పడొచ్చు. జనవరి 12న విడుదలకు ఢీ అంటే ఢీ అంటున్న రెండు పెద్ద సినిమాల వ్యవహారం ఇలాగే వుంది. హీరోల పంతమో, డేట్ లు అలా రావడమో మొత్తానికి జరిగిపోయింది. ఒకళ్లు 11న వచ్చి మరొకళ్లు 12న వస్తామన్నా బాగుండేది. కానీ అలా కూడా జరుగుతుందేమో చూడాలి.

కానీ ఈలోగా నిర్మాతలకు టెన్షన్. ముఖ్యంగా మహేష్ సినిమా నిర్మాత అనిల్ సుంకరకు కాస్త ఎక్కువే అని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. ఎందుకంటే మహేష్ సినిమా అయినా, బన్నీ సినిమా అయినా ఇప్పుడు ఆంధ్రనాట 40 కోట్ల రేషియోలో విక్రయించాల్సిందే. గతంలో భరత్ అనే నేను, మహర్షికి జరిగింది అదే. ఇప్పుడు ఆల్ రెడీ అల వైకుంఠపురంలో కోట్ చేస్తున్నది అదే.

సోలోగా వస్తే మహర్షి సినిమా ఆంధ్రలో 41 కోట్ల మేరకు వసూలు చేసింది. భరత్ అనే నేను 36 కోట్ల రేంజ్ లో వసూలు చేసింది. డిజాస్టర్ అనిపించుకున్న నా పేరు సూర్య సినిమా 26 కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పుడు బన్నీ, మహేష్ సినిమాలు టఫ్ కాంపిటీషన్ లో రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు ఒకదానికి ఒకటి పోటీ పైగా రజనీ కాంత్ సినిమా వుంది.

పోనీ అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు ఏమన్నా తేడా వుందా అంటే అప్పుడు కూడా యూనిఫారమ్ టికెట్ రేటు 200 పెట్టారు. అప్పుడు సమ్మర్. ఇప్పుడు సంక్రాంతి. ఒక విధంగా చెప్పాలంటే సంక్రాంతి కన్నా సమ్మర్ నే పెద్ద సీజన్. ఇలాంటి నేపథ్యంలో బయ్యర్లు ఏ మేరకు అడ్వాన్స్ లు కడతారు? పరిస్థితి ఎలా వుంటుంది అన్నది టెన్షన్.

ఇక్కడ లక్ ఏమిటంటే, బన్నీ సినిమాకు వైజాగ్ ను దిల్ రాజు తీసుకుంటున్నారు. అక్కడి లోకల్ ప్లేయర్ గాయత్రి ఫిలింస్ సతీష్ తీసుకోవాలని పట్టుదలగా వున్నారు. ఈస్ట్ గీతా ఫిలింస్ రెడీగా వుంది. ఎప్పుడూ హారిక హాసిని సినిమాలు చేసే బయ్యర్ పోటీగా వున్నారు. వెస్ట్ కూడా గీతా-ఎల్ వీ ఆర్ పోటీ పడుతున్నారు.

కృష్ణ గీతా-దిల్ రాజు-యువి కంబైన్డ్ సంస్థ వుండనే వుంది. నైజాం ఎలాగూ దిల్ రాజు, నెల్లూరు భాసర్కరెడ్డి వున్నారు. అదే భాస్కర రెడ్డి భాగస్వామి హరి సరిలేరు నీకెవ్వరు తీసుకుంటారు. మహేష్ సినిమాకు కూడా వైజాగ్, నైజాం దిల్ రాజు తీసుకుంటారు. ఈస్ట్ అనిల్ సుంకర స్వంత సంస్థ వింటేజ్ వుండనే వుంది. సీడెడ్ ఎన్వీ ప్రసాద్ వుంటారు. కృష్ణ, గుంటూరు ఇంకా ఫిక్స్ కావాలి.

అలాగే మహేష్ సినిమాలో కేవలం థియేటర్ హక్కులు మాత్రమే నిర్మాతవి. కానీ బన్నీ సినిమాలో అన్ని హక్కులు నిర్మాతలవే. బన్నీకి మహేష్ కు ఇస్తున్న రెమ్యూనిరేషన్ల విషయంలో కనీసం పాతిక కోట్లు తేడా వుంది. ఖర్చు రెండు సినిమాలకు దాదాపు సమానమే. సెట్ లు, స్టార్ కాస్ట్ అంతా రెండింటికీ దాదాపు సమానమే. అందువల్ల సేఫ్ జోన్ లేదా రికవరీ జోన్ అన్నది బన్నీ సినిమాకు ఎక్కువ.

కానీ ఇక్కడ అసలు టెన్షన్ ఏమిటంటే, సినిమాలు తేడా చేస్తే పరిస్థితి ఏమిటి? హారిక హాసినికి ఓ ట్రాక్ రికార్డు వుంది. వరుసగా సినిమాలు వున్నాయి. ప్రతి సినిమాకు ఎప్పటికప్పుడు బయ్యర్లకు లాస్ వస్తే సెటిల్ చేసేస్తున్నారు. అందువల్ల అడ్వాన్స్ లు కావచ్చు, సేల్ ఫిగర్లు కావచ్చు. అంతకు అంతా వచ్చేస్తాయి. సమస్య పెద్దగా వుండకపోవచ్చు.

కానీ మహేష్ సినిమాను అనిల్ సుంకర చూసుకుంటున్నారు. దిల్ రాజు కేవలం నిమిత్తమాత్రంగా వుండిపోయారు. ఆయన కేవలం ఓ బయ్యర్ గా వున్నారు. భాగస్వామ్యం అన్నది లాభం వస్తే ఇస్తారు లేదంటే లేదు. అంత వరకే. ప్రొడక్షన్, మార్కెటింగ్ అంతా అనిల్ సుంకరనే. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో దిల్ రాజు మార్కెటింగ్ అంటే ఒకలా వుంటుంది. అనిల్ సుంకర మార్కెటింగ్ అంటే  ఒకలా వుంటుంది. అడ్వాన్స్ లు రాబట్టడం, ఇవ్వడం అన్నింటికీ వ్యవహారం వేరుగా వుంటుంది.

దిల్ రాజుకు ఫిక్స్ డ్ బయ్యర్లు వుంటారు. వరుస సినిమాలు వుంటాయి. అందువల్ల అడ్వాన్స్ లు పక్కాగా వస్తాయి. సమస్యలు వుండవు. కానీ అనిల్ సుంకర అంటే వ్యవహారం ఎలావుంటుందో చూడాలి. గత సినిమాల లెక్కలు, వ్యవహారాలు అన్నీ వుంటాయి. అన్నీ బాగుండి, అంతా బాగుంటే, ఏ సమస్య లేదు. అలా కాకపోతే, భారం అనిల్ సుంకర మీదే పడుతుంది. దీని తరువాత రాబోయే పెద్ద సినిమాలు అనిల్ సుంకర నుంచి ప్రస్తుతానికి అయితే లేవు.

కానీ హారిక హాసినికి చాలా సినిమాలు వున్నాయి. అందువల్ల భారం పెద్ద సమస్య కాకపోవచ్చు. కాస్త ధైర్యం భరోసా వుంటుంది. ఇలాంటి నేపథ్యంలో మహేష్ బాబు నిర్మాత క్షేమం ఆలోచించి, 11కు తన సినిమాను తీసుకువస్తేనే బెటర్ అన్న సలహాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

దాని వల్ల మంచి ప్రీమియర్లు వస్తాయి, సోలో ఓపెనింగ్ దొరకుతుంది. ఆపైన సినిమాలను బట్టి ఫలితం. ఇదే జరుగుతుందని, సరిలేరు నీకెవ్వరు సినిమా 11కు మారే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. అయితే అది డిసెంబర్ మూడో వారానికి కానీ తెలియదని టాక్ వుంది.

రాంగ్ రూట్లో బాబు ఆత్మశోధన

Show comments