మేకోవర్ పాతదే.. మాటలే కొత్త తేజూ!

వరుసగా ఫ్లాపులు రావడంతో గ్యాప్ తీసుకున్నాడు సాయిధరమ్ తేజ్. అయితే ఈ గ్యాప్ ను అతడు బాగా వినియోగించుకుంటున్నాడంటూ కథనాలు వచ్చాయి. ఊడిపోతున్న జుట్టును సరిచేసుకోవడంతో పాటు ఇంకాస్త కొత్తగా ముస్తాబై సెట్స్ పైకి రాబోతున్నాడంటూ వార్తలొచ్చాయి. కానీ అవన్నీ ఉత్తివే అని తేలిపోయింది. సాయిధరమ్ తేజ్ ఏం మారలేదు. ఎలాంటి మేకోవర్ లేదు. కేవలం ఫుల్ గా గడ్డం పెంచాడంతే.

అతడి హెయిర్ స్టయిల్ ఎప్పట్లానే ఉంది. ఇంకా చెప్పాలంటే నుదురు మీద ఇంకాస్త జుట్టు తగ్గినట్టే కనిపిస్తోంది. పోనీ ఈ గ్యాప్ లో కాస్త ఒళ్లు తగ్గించాడంటే అది కూడా లేదు. ఎప్పట్లానే బొద్దు పర్సనాలిటీతో ఉన్నాడు. సో.. కేవలం గడ్డం పెంచడం కోసమే అతడు ఈ గ్యాప్ తీసుకున్నాడని అర్థం అవుతోంది.

పెంచిన గడ్డంతో ఈరోజు కొత్త సినిమా ఓపెనింగ్ కు వచ్చాడు తేజూ. ఇది కూడా గ్యాప్ లో తీసుకున్న నిర్ణయం కాదు. తేజ్ ఐ లవ్ యు సినిమా టైమ్ లోనే ఈ సినిమాకు ఓకే చెప్పాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది.

ముందు నుంచి అనుకున్నట్టుగానే ఈ సినిమాకు చిత్రలహరి అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు. ఇదే టైటిల్ ను కొన్నాళ్ల కిందట ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించనుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు.

ఈ సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతానంటున్నాడు తేజు. తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన బహిరంగ లేఖలో చెప్పినట్టు.. పరాజయాలకు గల కారణాల్ని విశ్లేషించుకుంటూ, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటానని అంటున్నాడు. మొత్తమ్మీద సాయిధరమ్ తేజ్ మేకోవర్ కొత్తగా లేకపోయినా, ఈసారి అతడు మాట్లాడిన మాటలు మాత్రం కాస్త కొత్తగా ఉన్నాయి.

చిత్రలహరి ఓపెనింగ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

Show comments