ఎమ్బీయస్‌: వెల్స్‌ ఫార్గో - బ్యాంకులకు ఓ పాఠం

 ప్రతి కుటుంబానికి ఒక బ్యాంక్‌ ఖాతా వుండాలనే ఉద్దేశంతో మోదీ 2014 ఆగస్టు 15 న జన్‌ధన్‌ యోజనా మొదలుపెట్టారు. ఒక్క రూపాయి బాలన్సు కూడా పెట్టనక్కరలేకుండా ఖాతా తెరవవచ్చనగానే చాలామంది తెరిచారు. స్విస్‌ బ్యాంకుల నుంచి నల్లధనం తెచ్చి తలా కాస్తా పంచుతానన్న ప్రభుత్వం ఆ ఖాతాల్లో వేస్తుంది గామోసు, మిస్సయితే ఎలా అనుకున్నారు. అలాటిదేమీ జరగకపోవడంతో సగానికి సగం మంది ఆ ఖాతాలను పట్టించుకోవడం మానేశారు. ఇక అప్పణ్నుంచి ఫైనాన్సు శాఖ నుండి బ్యాంకు అధికారులపై ఒత్తిడి పెరగసాగింది - జనధన్‌ ఖాతాల్లో ఆపరేషన్స్‌ వుండాలి, జీరో బాలన్సు ఖాతాల శాతం తగ్గించాలి అని. దేశంలో అన్నిటి కంటె పెద్ద బ్యాంకు స్టేటు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కాబట్టి వారిపై ఒత్తిడి చాలా వచ్చిందేమో 2016 మార్చిలో ఆ బ్యాంకు చైర్మన్‌ ఓ ప్రకటన చేశారు - 'మా బ్యాంకులో జీరో బాలన్సు ఖాతాల శాతం 46%కి లోపే' అని. అది చాలదనుకున్న  ప్రభుత్వం  ఆ శాతాన్ని తగ్గించడం మీదనే ధ్యాస పెట్టింది. వెబ్‌సైట్‌లో ఆగస్టు 2016 నాటి అంకెలు యిచ్చారు. ప్రభుత్వ బ్యాంకుల్లో 25%, గ్రామీణ బ్యాంకుల్లో 21%, ప్రయివేటు బ్యాంకుల్లో 37% వుంది. రకరకాల ఒత్తిళ్లు తెచ్చి ప్రభుత్వ బ్యాంకుల చేత మంచి ప్రగతి సాధించేరే అనుకుంటూ వుంటే ఓ తెలుగు పేపర్లోనే వార్త చదివాను - బాలన్సుగా సున్న కనబడకుండా వుండాలని ఒత్తిడి రావడంతో బ్యాంకు అధికారులే వేలాది ఖాతాల్లో ఒక్కో రూపాయి చొప్పున వేసి, వాటిని జీరో బాలన్స్‌ వర్గీకరణ నుంచి తప్పించేశారని! కొందరు జేబుల్లోంచి వేసుకున్నారట, కొందరు బ్యాంకు ఎంటర్‌టైన్‌మెంట్‌ చార్జిల నుంచి, సాదరు ఖర్చుల ఖాతా నుంచి డబ్బు డ్రా చేసి యీ ఖాతాల్లో వేసేశారట. ఈ విషయాలన్నీ పై అధికారులకు తెలిసినా గప్‌చుప్‌గా వున్నారట - ప్రభుత్వానికి కావలసిన మంచి పిక్చర్‌ ఎలాగోలా యిచ్చేశాం కదా, అదే చాలు అని. 

ఇక్కడి బ్యాంకు అధికారులు యిటువంటివి చేస్తారంటే నేనేమీ ఆశ్చర్యపడను. కానీ అమెరికాలో యింత కంటె ఘోరంగా చేశారని తెలిసి ఆశ్చర్యపడ్డాను. వెల్స్‌ ఫార్గో అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలో హెడ్‌క్వార్టర్స్‌ గల పెద్ద అంతర్జాతీయ బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ. మార్కెట్‌ కాపిటలైజేషన్‌ ప్రకారం ప్రపంచంలో రెండవ పెద్దది, ఎస్సెట్స్‌ ప్రకారం చూస్తే అమెరికాలో మూడో పెద్దది. అలాటి బ్యాంకు తన సిబ్బంది చేత తప్పుడు మార్గాలు అవలంబింప చేసిందని తెలుసుకుని అమెరికన్‌ సెనేటర్లే నిర్ఘాంతపోయారు. జరిగిందేమిటంటే వెల్స్‌ ఫార్గో తన సిబ్బందికి విపరీతమైన టార్గెట్లు పెట్టడంతో వాళ్లు ఆ లక్ష్యం చేరడానికి అడ్డుదోవలు తొక్కారు. అది తెలిసి కూడా కంపెనీ చూసీచూడనట్లు వూరుకుంది. కానీ కొందరు దాన్ని వెలికితీసి బయటపెట్టారు. ఇప్పుడు కంపెనీ సిఇఓ సెప్టెంబరు 20న సెనేట్‌ ముందుకు వచ్చి మొహం వేలాడేశాడు. సిబ్బందిదే తప్పు తప్ప కంపెనీ విధానం అది కాదని వాదిస్తూన్నాడు. ఎవరూ నమ్మటం లేదనుకోండి.

ఇప్పటికే వున్న ఖాతాదారుకి మరొక కొత్త సేవ, లేదా ఉత్పాదన అంటగట్టడాన్ని క్రాస్‌ సెల్లింగ్‌ అంటారు. అంటే డ్రాఫ్టు తీసుకోవడానికి ఎవరైనా కస్టమరు బ్యాంకుకి వస్తే, అతన్ని బుజ్జగించి ఫిక్సెడ్‌ డిపాజిట్‌ వేయించడం లాటిదన్నమాట. వెల్స్‌ ఫార్గో యీ ఫార్ములాను బాగా నమ్ముకుంది. తమ ప్రగతికి క్రాస్‌ సెల్లింగే మూలకారణమంటూ గొప్పలు చెప్పుకుంటూ వచ్చింది. అందరూ ఓహోఓహో అనుకున్నారు. షేరు మార్కెట్‌లో ఆ కంపెనీ షేరు 30 డాలర్లు పెరిగింది. ఆ కంపెనీ సిఇఓ జాన్‌ స్టంఫ్‌ పేర వున్న వాటాల విలువ 200 మిలియన్‌ డాలర్లకు చేరింది. అయితే యీ రోజీ పిక్చర్‌ వెనక్కాల జరుగుతున్నది వేరే. కొత్త ఖాతాలు తెరుస్తారా లేదా అని ఉద్యోగులను ఊదరగొట్టేశారు. పనివేళలు అయిపోయినా ఆలస్యంగా కూర్చోండి, సెలవులు తీసుకోకండి, మీరు ఖాతాల సంఖ్య పెంచకపోతే మాత్రం ఉద్యోగం పీకేయడం ఖాయం అంటూ బెదిరించింది. దాంతో ఉద్యోగులు ఆ లక్ష్యాన్ని చేరడానికి ఖాతాదారులకు తెలియకుండానే వారి పేర కొత్త ఖాతాలు తెరిచేయడం, క్రెడిట్‌ కార్డులు జారీ చేసేయడం మొదలెట్టారు. ఇలా జరుగుతోందని 2008లోనే మేనేజ్‌మెంట్‌ దృష్టికి తెచ్చానని యేసేనియా గుయిట్రాన్‌ అనే విజిల్‌ బ్లోయర్‌ అంటోంది. ఆ మాట ఎలాగున్నా 2011 నాటికి యీ ధోరణి గురించి మేనేజ్‌మెంటుకి స్పష్టంగా తెలుసని యిన్వెస్టిగేటర్స్‌ కనిపెట్టారు. 2013లో దీని గురించి లాస్‌ ఏంజిలెస్‌లో వెల్స్‌ ఫార్గోను సంజాయిషీ అడిగితే 'కస్టమరుకి తెలియకుండా, అతనికి అవసరం లేకుండా అతని పేర ఖాతాలు తెరిచే ప్రసక్తే లేదు' అని ఘంటాపథంగా చెప్పింది. 

'అవన్నీ ఒట్టి కబుర్లే, కంపెనీ రెగ్యులేటర్ల ముందు తప్పు జరిగిందని ఒప్పుకున్నారు' అని లాస్‌ ఏంజిలెస్‌ టైమ్స్‌ 2013లోనే ఆర్టికల్‌ రాసింది. ఆ తర్వాత వెల్స్‌ ఫార్గో మేల్కొంది. తప్పంతా ఉద్యోగులపై నెట్టేసి అప్పుడప్పుడు కొంతమంది చొప్పున మొత్తం 5300 మందిని తీసేసింది. కానీ వాళ్ల చేత అలాటి పనులు చేయించిన టాప్‌ ఎక్జిక్యూటివ్‌లను మాత్రం సత్కరించింది. గత నెలలోనే కమ్యూనిటీ బ్యాంకింగ్‌ విభాగానికి యిన్‌చార్జిగా వున్న కారీ టోల్‌స్టీడ్‌కు రిటైరయ్యేటప్పుడు 124.60 మిలియన్‌ డాలర్ల విలువైన షేర్లు ముట్టచెప్పారు. ఇక ఫ్రాడ్‌ విషయానికి వస్తే 2011 నుంచి 2015 మధ్య ఖాతాదారులకు తెలియకుండా తెరిచిన బ్యాంకు ఎక్కవుంట్లు 15 లక్షలు, జారీ చేసిన క్రెడిట్‌ కార్డులు 5,65,000. వీటి కోసం ఖాతాదారు దృష్టికి తేకుండా అతని ఎక్కవుంటులో డెబిట్‌ చేసిన మొత్తం విలువ 26 లక్షల డాలర్లు. ఈ విషయం బయటపడడంతో యిప్పుడు 18.50 కోట్ల డాలర్ల పెనాల్టీ కడుతోంది. స్టంఫ్‌ స్వయంగా 41 మిలియన్‌ డాలర్ల జీతాన్ని వదులుకుంటానన్నాడు. సెనేటర్లు యివన్నీ విని ముక్కున వేలేసుకున్నారు. పెనాల్టీ కట్టావు సరే, బ్యాంకింగు వ్యవస్థపై నమ్మకాన్ని చెదరగొట్టావే, దాని కేమంటావ్‌? అని అడిగారు. డెమోక్రాట్లు యీ బ్యాంకును ఖండఖండాలు చేసి నిఘా పెంచితే మంచిదంటున్నారు. అది జరగకపోవచ్చు కానీ వెల్స్‌ ఫార్గో ఉదంతం మన బ్యాంకు మేనేజ్‌మెంట్‌లు కూడా ఒక పాఠంగా తీసుకోవాలి.   Readmore!

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2016)

mbsprasad@gmail.com

Show comments