జగన్ 'సాక్షి'.. మరో ఆంధ్రజ్యోతి కాకూడదు

తాజా ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయానికి చంద్రబాబు అరాచక పాలన ఎంత కారణమో.. పచ్చ పత్రికలు చేసిన భజన కూడా అంతే కారణం. రాష్ట్రంలో ప్రజలు కష్టాల్లో ఉంటే.. చంద్రబాబు ప్రాపకం కోసం అంతా బాగున్నట్టు, అంతా టీడీపీకే అనుకూలంగా ఉన్నట్టు ప్రచారం చేశాయి ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు. వీటికి చాలా టీవీ ఛానెళ్లు అదనం. వీలైనంతగా ప్రముఖ టీవీ ఛానెల్స్ అన్నీ బాబు భజనలో తరించాయి.

ఈ మీడియా సంస్థలు ఎక్కడా ప్రభుత్వ తప్పుల్ని వేలెత్తి చూపలేదు. ప్రజల బాధల్ని పట్టించుకున్న పాపానపోలేదు. జర్నలిస్ట్ లకు నిజం తెలిసినా, వారు యాజమాన్యాల కోసం, ఆ యాజమాన్యం చంద్రబాబు మెప్పు కోసం కల్పిత కథలల్లి అభాసుపాలయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. అధికార పార్టీకి భజన చేసే పని పచ్చపత్రికలు మానేశాయి. అయితే ఇప్పుడా పనిని ఒకరకంగా సాక్షి మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది.

మన డప్పు మనం కొట్టుకోవాల్సిందే, కానీ అది మన అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసేలా కాదు. మన మనుగడకు కష్టం వచ్చేలా అసలేకాదు. సీఎం జగన్ ప్రజారంజక పాలన సాగించాలనే సదుద్దేశంతోనే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు, ఇసుక మాఫియాకు చెక్ పెడుతున్నారు, మద్యం విధానాన్ని సమూలంగా మారుస్తున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే.

మరోవైపు నిర్మాణాలకు ఇసుక దొరక్క సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మద్యం విధానంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వాలంటీర్ల ఇంటర్వ్యూల్లో రాజకీయ పెత్తనం ఎక్కువైంది. రేషన్ డీలర్లు తమ భవిష్యత్ పై బెంగ పెట్టుకున్నారు. టీడీపీ చేసిన పాపమే అయినా కొన్ని ప్రాంతాల్లో రైతులు విత్తనాలు అందక ఇబ్బందిపడ్డారు. ఊహించని కరెంటు కోతలు కొత్త సర్కారుపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తున్నాయి.

మరి ఈ విషయాలను ధైర్యంగా సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరది? కచ్చితంగా మీడియాదే. అయితే వ్యతరేక మీడియాని సీఎం జగన్ పట్టించుకోరు. ప్రతిపక్ష విమర్శలు వ్యక్తిగతంగా ఉంటాయి కాబట్టి ఆయన వాటిని లెక్కచేయరు. అలాంటప్పుడు ప్రజాస్వామ్యంలో నిఖార్సయిన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది ఎవరు? కచ్చితంగా సాక్షి మీడియానే ఆ బాధ్యత భుజానికెత్తుకోవాలి.

నిజమైన స్నేహితుడు మనలోని బలహీనతల్ని సైతం వేలెత్తి చూపించి వాటిని సరిచేసుకునేందుకు మద్దతుగా నిలవాలి. సరిగ్గా ఇప్పుడు సాక్షి చేయాల్సిన పని ఇదే. ప్రజల్లో ఉన్న అసంతృప్తుల్ని, అనుమానాలను జగన్ దృష్టికి తీసుకెళ్లాలి. సీఎం ఆశయాల అమలుకు నిర్మాణాత్మకంగా మద్దతిస్తూనే.. కొన్ని సమస్యల్ని నిర్భయంగా ప్రచురించాలి. ప్రసారం చేయాలి.

ఇలా ఓవైపు జగన్ ఆలోచనల్ని ప్రజల్లోకి మోసుకెళ్తూనే, మరోవైపు ప్రజల కష్టాల్ని, వాళ్ల మనోభావాలను నిర్భయంగా, నిజాయితీగా సీఎం దృష్టికి తీసుకెళ్లి లోటుపాట్లు లేకుండా చేయగలిగినప్పుడే సాక్షితో సీఎంకి ప్రయోజనం. లేదంటే మరో పచ్చమీడియాలా మారి కేవలం స్తోత్రాలకే పరిమితమైతే మాత్రం సాక్షితో వైసీపీకి మేలు కంటే, భవిష్యత్ లో కీడు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంటుంది. 

ఆమెను ఆమెగా ప్రేమించేవాడే కావాలట..!

ఎన్ని సినిమాలు పోయినా తీస్తూనే ఉంటా..