‘సై’ అంటున్న జగన్‌.. వైసీపీ శ్రేణుల్లో టెన్షన్!

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రను తిరిగి ప్రారంభించబోతున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఇటీవల వైఎస్‌ జగన్‌ మీద హత్యాయత్నం జరగడంతో, ఈ ఘటనలో గాయపడ్డ వైఎస్‌ జగన్‌ శస్త్ర చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్న విషయం విదితమే. మరికొన్ని రోజులపాటు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు చెబుతున్నా, జగన్‌ మాత్రం పాదయాత్ర వీలైనంత త్వరగా పునఃప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి జగన్‌ ప్రజాసంకల్ప యాత్రకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. విజయనగరం జిల్లాలో జగన్‌ పాదయాత్ర తిరిగి కొనసాగనుంది.

ఇక, జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర కోసం కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగినా, ప్రభుత్వంలో పెద్దగా చలనం లేకపోవడం, ప్రభుత్వ పెద్దలు వెటకారపు మాటలు మాట్లాడుతున్న దరిమిలా, పార్టీ పరంగా మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యతను వైఎస్సార్సీపీ గుర్తెరిగింది. మరోపక్క, జగన్‌కి అదనపు భద్రత కోసం ఇప్పటికే వైఎస్సార్సీపీ, అధికారికంగా చెయ్యాల్సిన ప్రయత్నాలూ చేస్తోన్న విషయం విదితమే.

ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా నిత్యం జనంలో వుంటున్నా, వందలాది మంది.. వేలాది మంది.. లక్షలాది మంది జగన్‌తో కరచాలనం చేయడం, జగన్‌తో సెల్ఫీలు దిగడం చేస్తున్నా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోలేదు ఇప్పటిదాకా. అలాంటిది, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు వుండే విశాఖ విమానాశ్రయంలో జగన్‌ మీద హత్యాయత్నం జరగడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.

'పెద్దల హస్తం' లేకుండా, జగన్‌ మీద దాడి జరిగే ప్రసక్తే లేదన్నది వైఎస్సార్సీపీ వాదన. ఎయిర్‌ పోర్ట్‌లో హత్యాయత్నానికి తెగించినప్పుడు, జగన్‌పై ప్రజాసంకల్ప యాత్రలోనూ దాడులు చేసేందుకు అవకాశం వుంది గనుక.. వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. జగన్‌ మాత్రం, ప్రజాసంకల్ప యాత్ర కొనసాగించాలనే గట్టి నిర్ణయంతో వున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ తరఫున ప్రైవేటు సెక్యూరిటీ మరింత పకడ్బందీగా ప్రజా సంకల్ప యాత్ర కోసం పనిచేయనుంది. దానికి తోడు, ప్రభుత్వం తరఫున కూడా జగన్‌కి భద్రత మరింత పెరగనుంది.

ఆ టికెట్ల విషయంలో కుటుంబ పోరు!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

Show comments