కమలదళం ఆపుకోలేని ఉబలాటం!

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాల కోసం తెలుగు ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు అధికారంలో ఉన్న తెరాస తాము ఏకంగా 100 స్థానాల వరకు గెలుస్తున్నాం అని చెప్పుకుంటుండగా, మరోవైపు ప్రజాఫ్రంట్ పార్టీలు తమకు 75-80 సీట్లు వస్తాయని చాటుకుంటున్నారు. ఈ అంచనాల మీదనే ప్రజలంతా రెండు గ్రూపులుగా విడిపోయి వాదించుకుంటున్నారు. తమాషా ఏంటంటే.. ఈ రెండు కూటములు కోరుకుంటున్న రీతిగా కాకుండా, తెలంగాణలో హంగ్ రావాలని కోరుకుంటున్న వారు కూడా ఉన్నారు.

తెలంగాణలో తెరాస ప్రభుత్వం ఏర్పాటు కావాలని, అది కూడా తమ మద్దతుతో మాత్రమే ఏర్పాటు కావాలని భారతీయ జనతా పార్టీ అత్యుత్సాహంతో ఎదురుచూస్తున్నట్లుగా ఉంది. మరో 48 గంటలు ఆగితే.. ఫలితాల విషయంలో స్పష్టత వచ్చేస్తుంది. కానీ ఈ కొద్ది గంటలకు కూడా భాజపా ఉబలాటం ఆపుకోలేకపోతున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో తెరాస ప్రభుత్వం ఏర్పడడానికి తాము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ.. ఆ పార్టీ నాయకులు ముందే ప్రకటనలు చేసేస్తున్నారు.

భాజపా నాయకురాలు పురందేశ్వరి మాట్లాడుతూ.. ఎంఐఎంను దూరం పెట్టేట్లయితే తెరాసకు మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇన్నాళ్లూ మజ్లిస్ ను నెత్తిన పెట్టుకుని తెరాస ఊరేగిన విషయాన్ని కూడా మరచిపోయి.. పురందేశ్వరి ఇలాంటి ప్రకటన చేయడం చిత్రమే. అయితే ఫలితాలు రాకముందే.. ఎవరి సత్తా ఏంటో తేలకముందే.. ఇలాంటి ప్రకటన చేయడం వలన.. పార్టీ పరువు పూర్తిగా పోతుందని అనుకున్నారో ఏమో గానీ.. భాజపా అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మాట్లాడుతూ.. తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోయేది లేదని ప్రకటించి.. నష్ట నివారణ చర్యలు చేపట్టారు.

భారతీయ జనతా పార్టీ మరీ చవకబారు రాజకీయానికి తెరతీస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పీఠంలో భాగం పంచుకోవాలనేది వారి ఉబలాటం. అందుకు ఎలాంటి దిగజారుడు తనానికి కూడా వారు వెనుకాడ్డం లేదు. పార్టీవర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి..  భాజపాకు రాష్ట్రంలో పదికంటె ఎక్కువ స్థానాలు దక్కాలని వారు ఆశిస్తున్నారు. అదే సమయంలో తెరాస ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు పది సీట్ల దూరంలో ఆగిపోవాలనేది వారి కోరిక.

తాము గట్టిగా వ్యతిరేకించే ఎంఐఎంకు ఎట్టి పరిస్థితుల్లోనూ 7 సీట్లకు మించి వచ్చే అవకాశం లేదు గనుక.. అప్పుడిక గతిలేక.. తెరాస ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. తమ మీదనే ఆధారపడే పరిస్థితి రావాలని వారు కోరుకుంటున్నారు. నిన్నటిదాకా ఎన్ని మాటలు కేసీఆర్ అన్నప్పటికీ.. అంతిమగా ఆయన మోచేతినీళ్లు తాగడానికే కమలదళం ఉబలాటపడుతుండడం చిత్రమే మురి!

తెలంగాణ తీర్పు ప్రభావం.. ఏపీపై ఉంటుందా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments