సబ్బం.. ఈసారెక్కడ రాజకీయ పబ్బం.!

కాంగ్రెస్‌లో వుండి, కాంగ్రెస్‌ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి రాజీనామా చేయకుండా.. వైఎస్‌ జగన్‌ భజన చేశారాయన. అయితే, ఆ భజన జగన్‌ మీద అభిమానంతో చేసిందికాదు, జగన్‌ పేరు చెప్పి తన పాపులారిటీ పెంచుకోవడం కోసం మాత్రమే.! ఆ విషయం బయటపడ్డానికి ఎంతో సమయం పట్టలేదు. విశాఖజిల్లాలో వైఎస్సార్సీపీని దెబ్బ తీసేందుకు తెరవెనుక గట్టి ప్రయత్నాలు చేసిన ఘనుడాయన. అందుకే, 2014 ఎన్నికల తర్వాత రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వచ్చింది.

పరిచయం అక్కర్లేని పేరది. ఆయనే సబ్బంహరి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పుణ్యమా అని రాజకీయంగా ఎదిగిన సబ్బంహరి, 'నేను రొటీన్‌ పొలిటీషియన్‌ని కాదు..' అని చెప్పుకుంటుంటారు. నీతికీ, నిజాయితీకీ మారుపేరని చెప్పుకునే సబ్బం హరిలో, చంద్రబాబు లక్షణాలు కన్పిస్తుంటాయి. అందుకేనేమో, ఆయన నిన్న మొన్నటిదాకా చంద్రబాబు భజన చేశారు. ఇప్పుడూ చేస్తున్నట్టే వున్నారు. ఐదేళ్ళ తర్వాత తిరిగి రాజకీయాల్లో యాక్టివ్‌ అవ్వాలనుకుంటున్నట్లు సబ్బం హరి తాజాగా వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పవన్‌ - జగన్‌ కలిస్తే, చంద్రబాబుకి రాజకీయంగా కష్టాలు తప్పకపోవచ్చని సబ్బంహరి జోస్యం చెబుతున్నారు. నిన్న మొన్నటిదాకా ఇదే సబ్బంహరి, పవన్‌ - జగన్‌ కలిస్తే అది చంద్రబాబుకి లాభమని సెలవిచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్బంహరిని, ఎంటర్‌టైన్‌ చేసే పరిస్థితిలేదు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేందుకు కాస్తంత మొహమాటపడుతున్నారాయన. కాంగ్రెస్‌ పార్టీలోకి ఆయన తిరిగి వెళతారా.? అంటే, 'వెళ్ళరు' అని మాత్రం చెప్పలేం. జనసేన రూపంలో ఇంకో ఆప్షన్‌ కూడా సబ్బంహరికి వుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సబ్బం హరికీ మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఎందుకంటే, టీడీపీకి తెలంగాణలో అనుకూల వాతావరణం వుంటుందంటూ మొన్నీమధ్యనే ఓ చర్చా కార్యక్రమంలో (టీడీపీ అనుకూల మీడియాలోనే) సెలవిచ్చారు సబ్బంహరి. అఫ్‌కోర్స్‌, టీడీపీ అనుకూల మీడియా చంద్రబాబు భజన కోసం ఇలాంటోళ్ళను తీసుకురావడం కొత్తేమీ కాదనుకోండి.. అది వేరే విషయం.

ఇంతకీ, సబ్బంహరి.. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఏ పార్టీని 'బెటర్‌ ఛాయిస్‌'గా ఎంచుకుంటారట.? ఏమో, వేచి చూడాల్సిందే.  

Show comments